పారిశ్రామికం పరుగులు

Sun,October 6, 2019 12:44 AM

-మౌలిక సదుపాయాల కోసం రూ.1,825 కోట్లు ఖర్చు
-23 పారిశ్రామిక పార్కుల కోసం 39 వేల ఎకరాల సేకరణ
-1,235 సంస్థలకు భూముల కేటాయింపు.. రూ.80 వేల కోట్ల పెట్టుబడులు రాక
-టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:గడిచిన ఐదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) రూ.1,825 కోట్ల అభివృద్ధి పనులు చేసింది. రాష్ట్రంలో 23 పారిశ్రామిక పార్కుల కోసం 38,989 ఎకరాలు సేకరించామని టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49 వేల ఎకరాల్లో 59 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. బషీర్‌బాగ్ పరిశ్రమ భవన్‌లో శనివారం టీఎస్‌ఐఐసీ చైర్మన్‌గా మూడేండ్లు పూర్తవుతున్న సందర్భంగా బాలమల్లు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్‌ఐఐసీ ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించారన్నారు. 2005 తరువాత తెలంగాణలో కొత్తగా ఒక్క పారిశ్రామిక పార్కును కూడా ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు. తెలంగాణలో కొత్త పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల కోసం టీఎస్‌ఐఐసీ ద్వారా రూ.1,825 కోట్లు ఖర్చు చేశామన్నారు. 1,235 సంస్థలకు భూ కేటాయింపులు చేసినట్లు తెలిపారు. 185 సంస్థలు ఎస్సీ, ఎస్టీలకు చెందినవే ఉన్నాయని, వీరికి రూ.8 కోట్ల రాయితీ ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ కంపెనీల్లోకి రూ.80,300 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా 1,25,365 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.

మహిళల కోసం..

మహిళలను పారిశ్రామికంగా ప్రోత్సహించడానికి మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మూడు ప్రత్యేక పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఫార్మా సిటీకి భూ సేకరణ జరుగుతుందని, మొదటి దశ పనులను త్వరలో ప్రారంభిస్తామని, జహీరాబాద్‌లో నిమ్జ్ ఏర్పాటుకు భూ సేకరణ జరుగుతుందన్నారు. కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకి తరలించడానికి 1,746 పరిశ్రమలను గుర్తించడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ తెలంగాణ పారిశ్రామికవేత్తలకు భూ కేటాయింపుల్లో రిజర్వేషన్లు, రాయితీలు ప్రకటించడం జరిగిందన్నారు. టీ ప్రైడ్ ద్వారా టీఎస్‌ఐఐసీ ఏర్పాటు చేసిన పారిశ్రామిక పార్కులో ఎస్సీలకు 15.44 శాతం, ఎస్టీలకు 9.34 శాతం భూ కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లుగా బాలమల్లు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలకు భూ కేటాయింపుల్లో 10 శాతం రిజర్వ్ చేయడం జరుగుతుందన్నా రు. రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో జనరల్ పార్కును ఏర్పాటు చేయడానికి 945 ఎకరాలు సేకరించినట్లుగా చెప్పిన ఆయన వెల్‌స్పన్‌కు భూములు కేటాయించామన్నారు.

ఎంఎస్‌ఎంఈల కోసం..

తెలంగాణలో మొదటిసారిగా ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు దండు మల్కాపురంలో 440 ఎకరాల్లో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్‌కు కేటాయించారన్నారు. దీనిలో మౌలిక సదుపాయాల కోసం రూ.250 కోట్ల వరకు వెచ్చిస్తున్నామన్నారు. ఈ పార్కును మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పా రు. పార్కుల్లో పనిచేసే కార్మికులు నివాసం ఉండటానికి గాను పార్కు సమీపాల్లోనే స్థలాలను కేటాయిస్తున్నామన్నారు. 200 ఎకరాలను కేటాయించామని పేర్కొన్నారు. ఇక ఇక్కడ 430 కంపెనీలు ఏర్పాటు కానున్నాయని, వీటి ద్వారా రూ.1,553 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని వివరించారు. బండ తిమ్మాపూర్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు కోసం 150 ఎకరాలు కేటాయించామని, కోల్‌కతాకు చెందిన ఆర్‌పీజీ గోయెంకా సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిందన్న ఆయన యాదాద్రి జిల్లా రాయరావుపేటలో 40 ఎకరాల్లో సూక్ష్మ పరిశ్రమల కోసం పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడ 289 మందికి భూము లు కేటాయిస్తామన్నారు.

396
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles