సగం వసూలయ్యాయ్!

Mon,April 15, 2019 12:56 AM

-క్రెడిటర్లకు కలిసొస్తున్న దివాలా చట్టం
-ఫిబ్రవరికల్లా దాఖలైన కేసుల్లో 50 శాతం పరిష్కారం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దివాలా చట్టం (ఇన్సాల్వెన్సీ బ్యాంక్ప్స్రీ కోడ్-ఐబీసీ) కింద ఆర్థిక, నిర్వహణపరమైన రుణదాతలు దాఖలు చేసిన కేసుల్లో సగందాకా పరిష్కారమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి 88 కేసులు నమోదవగా, వీటి విలువ రూ.1.42 లక్షల కోట్లపైనే. ఇందులో ఫైనాన్షియల్ క్రెడిటర్ల వాటా రూ.1.36 లక్షల కోట్లవగా, ఆపరేషనల్ క్రెడిటర్ల వాటా రూ.6,469 కోట్లు. అయితే ఇప్పటిదాకా రూ.68,766 కోట్ల రుణాలు వసూలయ్యాయని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్స్రీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తెలియజేసింది. ఫైనాన్షియల్ క్రెడిటర్లు 48.24 శాతం (రూ.65,635 కోట్లు) రికవరీ సాధించారని, ఆపరేషనల్ క్రెడిటర్లు 48.41 శాతం (రూ.3,131 కోట్లు) రికవరీ అందుకున్నారని స్పష్టం చేసింది. మూడు కేసుల్లో ఫైనాన్షియల్ క్రెడిటర్లు 100 శాతం సంతృప్తిని పొందారు. ఇక మొత్తం ఈ 88 కేసుల్లో టాటా స్టీల్ చేతికి భూషణ్ స్టీల్ రాక, వేదాంత గూటికి ఎలక్ట్రోస్టీల్ పోక వంటి భారీ టేకోవర్లు కూడా ఉన్నాయి. భూషణ్ స్టీల్ కేసులో అటు ఫైనాన్షియల్, ఇటు ఆపరేషనల్ క్రెడిటర్లకు రూ.57,505.05 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది. ఇందులో ఫైనాన్షియల్ క్రెడిటర్లకు 63.49 శాతం, ఆపరేషనల్ క్రెడిటర్లకు 80.94 శాతం వసూలయ్యాయి. అలాగే ఎలక్ట్రోస్టీల్ బకాయిలు రూ.13,958 కోట్లుండగా, ఫైనాన్షియల్ క్రెడిటర్లకు మాత్రమే 40.38 శాతం లబ్ధి చేకూరింది. మొన్నెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ కేసు విలువ రూ.11,478.08 కోట్లవగా, ఫైనాన్షియల్ క్రెడిటర్లు 26.26 శాతం, ఆపరేషనల్ క్రెడిటర్లు 5.40 శాతం ప్రయోజనం పొందాయి. ఇవిగాక ఆర్సెలార్ మిట్టల్-ఎస్సార్ స్టీల్ రూ.49,395 కోట్ల కేసులో ఫైనాన్షియల్ క్రెడిటర్లకు రూ.41,987 కోట్లు, ఆపరేషనల్ క్రెడిటర్లకు రూ.214 కోట్లు రానున్నాయి. క్రెడిటర్ల కమిటీ ఆర్సెలార్ మిట్టల్ బిడ్డింగ్‌ను ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆపరేషనల్ క్రెడిటర్లకు రావాల్సిన బకాయిలు రూ.4,976 కోట్లుగా ఉంటే, కేవలం రూ.214 కోట్లే దక్కుతున్నాయి.

807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles