నీరవ్ సెల్ సిద్ధం

Wed,June 12, 2019 01:26 AM

Arthur Road Jail kept ready for Nirav Modi

-ముంబై జైలులో బ్యారక్ నెం.12ను రెడీ చేసిన అధికారులు

ముంబై/లండన్, జూన్ 11: నీరవ్ మోదీని భారత్‌కు అప్పగిస్తే ఉంచేందుకు జైలు గది సిద్ధమైంది. ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉన్న బ్యారక్ నెం. 12ను అధికారులు రెడీ చేశారని మంగళవారం మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. గత వారం జైళ్ల శాఖ.. ఆర్థర్ రోడ్డు కారాగారం స్థితిగతులను, అందులోని సదుపాయాలను రాష్ట్ర హోం శాఖకు తెలియపరిచింది. ఈ క్రమంలోనే నీరవ్‌ను అప్పగిస్తే అత్యంత భద్రత కలిగిన బ్యారక్ నెంబర్ 12లో పెట్టవచ్చని సదరు అధికారి పేర్కొన్నారు. ఇటీవలే ఈ విషయాన్ని కేంద్రానికి కూడా వివరించినట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది మార్చి 19న లండన్‌లో నీరవ్ మోదీని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడి వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు నీరవ్‌ను భారత్‌కు అప్పగింత కేసును విచారిస్తున్న సంగతీ విదితమే. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.14,000 కోట్లు మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. నీరవ్ మేనమామ, రత్నాల వర్తకుడు మెహుల్ చోక్సీ సైతం ఈ కుంభకోణంలో కీలక నిందితుడే. బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉండగా, మోసపూరితంగా లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూలు) జారీతో వేల కోట్లను కొల్లగొట్టారు.

ఒకే గదిలో మాల్యా, నీరవ్?

బ్యారక్ నెంబర్ 12లో రెండు గదులున్నాయని, ఒక గదిలో ముగ్గురిని ఇప్పటికే ఉంచినందున, మరో గదిలో నీరవ్‌ను పెడుతామని అధికారులు తెలిపారు. అయితే విజయ్ మాల్యా అప్పగింత కేసు విచారణ సందర్భంగా కూడా అధికారులు ఇదే బ్యారక్‌లో గదిని సిద్ధం చేశామని కోర్టుకు చెప్పడంతో మాల్యా, నీరవ్‌లను ఒకే గదిలో ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాలుగోసారి బెయిల్ కోసం..

బెయిల్ కోసం నీరవ్ మోదీ మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. మంగళవారం దీనిపై బ్రిటన్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు మూడు సార్లు నీరవ్ బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో నాలుగోసారి హైకోర్టులో బెయి ల్ పిటీషన్ వేశాడు.

1134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles