గోల్డ్ ఈటీఎఫ్‌లు అదుర్స్

Mon,August 26, 2019 12:31 AM

Assets under gold ETFs jump to 5,000 crore in first 4 months

-ఏప్రిల్-జూలైలో రూ.5 వేల కోట్లు దాటిన ఆస్తులు
-స్టాక్ మార్కెట్ల పతనంతో బంగారం వైపు చూస్తున్న మదుపరులు

న్యూఢిల్లీ, ఆగస్టు 25: గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లోని ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి నాలుగు నెల (ఏప్రిల్-జూలై)ల్లో రూ.5,079.22 కోట్లను తాకాయి. ఇదే సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లు 3 శాతం నష్టపోగా, ఆర్థిక ప్రతికూల పరిస్థితుల మధ్య స్టాక్ పెట్టుబడులు శ్రేయస్కరం కాదన్న భావనతోనే మదుపరులు బంగారంవైపు చూశారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ నుంచి ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులకు డిమాండ్ పెరిగిందని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ తెలియజేసింది. ఏప్రిల్-జూలై కాలంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 1,191.79 పాయింట్లు నష్టపోయింది. వరుస నష్టాల మధ్య తమ పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా మదుపరులు బంగారాన్ని ఎంచుకోవడంతో గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షణీయంగా మారాయి. దీంతో ఒక్కసారిగా వాటి ఆధ్వర్యంలోగల ఆస్తులు పెరిగిపోయాయి. ఏప్రిల్‌లో రూ.4,594.06 కోట్లుగా ఉంటే, మే నెలలో రూ.4,606.69 కోట్లకు, జూన్‌లో రూ.4,931.16 కోట్లకు, జూలైలో రూ.5,079.22 కోట్లకు చేరుకున్నాయి.

ఒడిదుడుకుల్లో సురక్షితం

ఎంతో సున్నితంగా ఉండే స్టాక్ మార్కెట్ పెట్టుబడుల కంటే బంగారంపై పెట్టుబడులు సురక్షితమని పలువురు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆటుపోట్లకు గురైనప్పుడు మదుపరుల పెట్టుబడులను బంగారమే రక్షిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుండగా, ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతుంటే.. బంగారం ధరలు మాత్రం రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. మదుపరులు తమ పెట్టుబడులను బంగారంపై పోగేస్తుండటమే ఇందుకు కారణం.

313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles