రెపో రేటుతో దోస్తీ

Sun,August 11, 2019 01:32 AM

Banks slash MCLR set for repo linked deposit loan rates

-రుణాలపై వడ్డీరేటును అనుసంధానిస్తున్న బ్యాంకర్లు
-స్వచ్చంధంగా ముందుకొస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులు
-ఆర్బీఐ ద్రవ్యసమీక్ష ఆధారంగా ఇక సవరణలు

న్యూఢిల్లీ, ఆగస్టు 10: కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా తగ్గిస్తున్న నేపథ్యంలో ఖాతాదారులకు ఆ ప్రయోజనాన్ని అందించేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 110 బేసిస్ పాయింట్ల చొప్పున ఆర్బీఐ కోత పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలోనైతే ఏకంగా 35 బేసిస్ పాయింట్ల మేర దించింది. అయినప్పటికీ ఇందులో మూడో వంతుకు సమానంగా కూడా రుణాలపై వడ్డీరేట్లను తగ్గించలేదంటూ బ్యాంకుల తీరుపై ఆర్బీఐ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతీ విదితమే. దీంతో రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఆధారిత వడ్డీరేట్లను వివిధ రుణాలపై బ్యాంకులు అమల్లోకి తెస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు స్వచ్చంధంగా ముందుకొస్తున్నాయి. తమ మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను తగ్గిస్తున్నా.. ఆర్బీఐ ద్రవ్యసమీక్ష ప్రయోజనాలు సత్వరమే ఖాతాదారులకు అందేందుకు రెపో రేటుతో బ్యాంకర్లు తమ రుణాల వడ్డీరేట్లను అనుసంధానిస్తున్నారు.

లాభాలపై ప్రభావం

రెపో రేటుతో రుణాలపై వడ్డీరేట్లను అనుసంధానించడం వల్ల బ్యాంకుల లాభాలు ప్రభావితం కానున్నాయి. ఆర్బీఐ ద్రవ్యసమీక్షలో రెపో రేటు తగ్గిన ప్రతిసారి రుణాలపై వడ్డీరేటూ తగ్గుతుంది మరి. బ్యాంక్ రుణాలు తీసుకున్న ఖాతాదారులకు ఇది లాభించినా.. ఆ రుణాలను ఇచ్చిన బ్యాంకులకు మాత్రం నష్టాన్నే మిగులుస్తుంది. అందుకే బ్యాంకులు రెపో రేటుతో కాకుండా ఇతర ప్రామాణికాల ఆధారంగా రుణాలపై వడ్డీరేట్లను సవరిస్తున్నారు. అయితే ఆందోళన కలిగిస్తున్నా.. ఇప్పుడు చాలా బ్యాంకులు స్వచ్చంధంగా రెపో రేటుతో తమ రుణాలపై వడ్డీరేట్లను అనుసంధానిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. అయితే ఇప్పటికే మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) సమస్యతో సతమతమవుతున్న బ్యాంకులు.. మరింత ఆదాయాన్ని కోల్పేతే ఇబ్బందులు వస్తాయన్న భయం బ్యాంకింగ్ రంగంలో కనిపిస్తున్నది.

గృహ, వాహన రుణాలు చౌక

బ్యాంకింగ్ రంగంలో వస్తున్న ఈ మార్పు.. గృహ, వాహన రుణాలను చౌకగా మార్చేందుకు దోహదం చేయనుంది. మందగించిన జీడీపీని తిరిగి వృద్ధిపథంలో నడిపించాలన్న లక్ష్యంతో ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) రాబోయే ద్రవ్యసమీక్షల్లో మరో 40 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించవచ్చన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే రెపో రేటుతోపాటు రుణాలపై బ్యాంకుల వడ్డీరేట్లు దిగివస్తాయి. దీంతో గృహ, వాహన రుణాలపై ఈఎంఐ భారం గణనీయంగా తగ్గిపోవడం ఖాయం. దీనివల్ల ఆటో, నిర్మాణ రంగాల్లో కొనుగోళ్లు పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రెపో రేటు 5.40 శాతంగా, రివర్స్ రెపో రేటు (బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు) 5.15 శాతంగా ఉన్నది.

255
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles