మరో రెండేండ్లు పట్టవచ్చు

Mon,April 15, 2019 01:12 AM

-దేనా, విజయా బ్యాంకుల విలీన ముగింపుపై బీవోబీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)లో దేనా, విజయా బ్యాంకులు పూర్తిస్థాయిలో విలీనం కావాలంటే మరో రెండేండ్ల సమయం పట్టవచ్చునని బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ విలీనం అమలులోకి వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో జరుగాలంటే ఏడాదికి పైగా సమయం పట్టవచ్చని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఆయా బ్యాంకులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుసంధానం చేయడానికి కనీసంగా 12 నెలలు, ఇతర ప్రాసెస్, సిస్టమ్స్‌లను టేకోవర్ చేయడానికి మరో ఏడాది పట్టవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ఒక్కో బ్యాంక్ తమ లావాదేవీలకు సంబంధించి వారికి నచ్చిన టెక్నాలజీని వినియోగిస్తున్నాయని, వీటిని ఇతరవాటికి బదలాయించడం మాములు విషయంకాదని, ముఖ్యంగా ఖాతాదారుడికి సంబంధించిన ప్రతి సమాచారం ఒక్కతాటిపైకి తీసుకురావడం అంత సులభంకాదని ఆయన వ్యాఖ్యానించారు.

నిధుల లేక సతమతమవుతున్న బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులను కేటాయించిందని, ఇదే క్రమంలో బీవోబీలోకి రూ.5,042 కోట్ల నిధులను వెచ్చించిందని, వీటిని వ్యాపార అవసరాల నిమిత్తం వినియోగించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ రెండు బ్యాంకులను విలీనం చేసుకోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌పై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపనున్నదని, ఆ తర్వాతి క్రమంలో ఈ తీవ్రత తగ్గనున్నదన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి కేంద్రం..పలు బ్యాంకులను విలీనం చేస్తున్నది. దీంతో వాటాదారులకు కూడా ప్రయోజనం కలుగనున్నది. విలీనం తర్వాత ఏర్పడిన బీవోబీ..15 లక్షల కోట్ల బ్యాలెన్స్ షీట్‌తో దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించనున్నది. వీటిలో రూ.8.75 లక్షల కోట్లు డిపాజిట్లు కాగా, రూ.6.25 లక్షల కోట్లు అడ్వాన్స్ రూపంలో ఉండనున్నాయి. ఎస్‌బీఐ తర్వాత రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన బీవోబీకి 9,500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85 వేల మంది ఉద్యోగులు, 12 కోట్ల మంది వినియోగదారులు కలిగివుండనున్నది. బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సేవలు అందించే ఉద్దేశంలో భాగంగా వీటిని విలీనం చేస్తున్నట్లు ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ఇటీవల వ్యాఖ్యానించారు. సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం..ఐడీబీఐ బ్యాంకులో బీమా దిగ్గజం ఎల్‌ఐసీ 51 శాతం వాటాను కొనుగోలు చేసింది.

గతేడాది రూ. 1.06 లక్షల కోట్లు

గడిచిన ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీల్లోకి కేంద్ర ప్రభుత్వం రూ.1.06 లక్షల కోట్ల మేర నిధులను చొప్పించింది. మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకులకు ఆర్థికంగా చేయూతనందించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. నిరర్థక ఆస్తులు కలిగిన ప్రభుత్వరంగ బ్యాంకులపై రిజర్వు బ్యాంక్ రూపొందించిన జాబితా నుంచి ఐదు బ్యాంకులు బయటకు వచ్చాయి. వీటిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంకులు ఉన్నాయి. విలీనాలతో బ్యాంకుల నిరర్థక ఆస్తులు కూడా తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.23,860 కోట్లు తగ్గా యి. ఈ మూడు బ్యాంకుల విలీనం తర్వాత ప్రస్తుతం 18 బ్యాంకులు ఉన్నాయి.

2199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles