జెట్‌ను టేకోవర్ చేస్తాం

Wed,April 24, 2019 12:07 AM

British entrepreneur offers to take control of Jet Airways

-మరోసారి బ్రిటన్ వ్యాపారవేత్త నుంచి ఆఫర్
-సంస్థ సీఈవో వినయ్ దూబేకు లేఖ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: జెట్ ఎయిర్‌వేస్‌ను టేకోవర్ చేస్తామని ఓ బ్రిటీష్ ఎంటర్‌ప్రెన్యూర్ మరోసారి ఆసక్తి కనబరిచారు. సంస్థ సీఈవో వినయ్ దూబేకు లేఖ కూడా రాశారు. జాసన్ అన్స్‌వర్త్ అనే బ్రిటన్‌కు చెందిన వ్యాపార, పారిశ్రామికవేత్త.. ఇప్పటికే జెట్ ఎయిర్‌వేస్‌కు రుణాలిచ్చిన బ్యాంకర్లకు మెజారిటీ వాటా టేకోవర్‌పై తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ లేఖ రాశారు. అయితే ఇంకా దీనిపై రుణదాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో తాజాగా జెట్ సీఈవో దూబే ముందుకు జాసన్ మళ్లీ తన ఆఫర్‌ను తీసుకొచ్చారు. కాగా, దూబే నుంచి నాకు సమాధానం వచ్చింది. జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారితో తాజా సమాచారం కోసం నన్ను అనుసంధానపరిచారు అని జాసన్ తెలిపారు. అట్మాస్ఫియర్ ఇంటర్‌కాంటినెంటల్ ఎయిర్‌లైన్స్ అనే స్టార్టప్‌ను జాసన్ నిర్వహిస్తుండగా, ఈ ఏడాది చివరి నుంచి లండన్‌లోని స్టాన్‌స్టడ్ ఎయిర్‌పోర్టు కేంద్రంగా ఇది విమాన సేవల్ని ఆరంభించే యోచనలో ఉన్నది. జెట్ ఎయిర్‌వేస్‌లో మెజారిటీ వాటా కోసం ప్రయత్నిస్తున్న జాసన్.. బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడవగా, ఆ దేశ ప్రధాని థెరిస్సా మే మద్దతునూ ఈ విషయంలో కూడగడుతున్నారు. ప్రధాని మోదీ కార్యాలయాని (పీఎంవో)కీ జెట్ టేకోవర్‌పై జాసన్ ఓ లేఖ రాయడం గమనార్హం.

ఉద్యోగులకు శుభవార్తే

జెట్ ఎయిర్‌వేస్‌ను టేకోవర్ చేయడానికి జాసన్ ఆసక్తి కనబరుస్తుండటం.. ఆ సంస్థ ఉద్యోగులకు శుభవార్తే అవుతున్నది. జెట్ ఎయిర్‌వేస్ మూతబడటంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 23 వేల మంది రోడ్డునపడ్డ విషయం తెలిసిందే. రూ.8,500 కోట్ల రుణ భారాన్ని మోస్తున్న జెట్‌లో బ్యాంకర్లకు మెజారిటీ వాటా ఉండగా, దాన్ని విక్రయించేందుకు ఆసక్తి గల సంస్థలు, వ్యక్తుల నుంచి బిడ్లను ఆహ్వానించిన సంగతీ విదితమే. మే 10 బిడ్ల దాఖలుకు చివరి తేదీ. కాగా, ఎతిహాద్ ఎయిర్‌వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్‌నర్స్, ఎన్‌ఐఐఎఫ్‌ల బిడ్లను ఇప్పటికే రుణదాతలు ఎంపిక చేశారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లేదన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో జాసన్ ఆసక్తి చూపిస్తుండటం.. జెట్ ఉద్యోగుల్లో కొత్త ఆశల్ని చిగురింపజేస్తున్నాయి. నాలుగు నెలలుగా జెట్ ఉద్యోగులకు జీతాల్లేని విషయం తెలిసిందే.

1340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles