బకాయిలపై బీఎస్‌ఎన్‌ఎల్ దృష్టి

Mon,August 12, 2019 02:14 AM

BSNL plans to chase dues

-రూ.3 వేల కోట్ల వసూలుకు సిద్ధం

న్యూఢిల్లీ, ఆగస్టు 11: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్.. బకాయిల వసూలుపై దృష్టి పెడుతున్నది. ఈ క్రమంలోనే రాబోయే రెండు, మూడు నెలల్లో రూ.3 వేల కోట్లకుపైగా వసూలు చేస్తామన్న ధీమాను సంస్థ చైర్మన్, ఎండీ పీకే పుర్వార్ వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలనూ సకాలంలో చెల్లించలేని దుస్థితిలో బీఎస్‌ఎన్‌ఎల్ నడుస్తున్న నేపథ్యంలో బకాయిలు వసూలైతే పరిస్థితి కాస్త మెరుగుపడగలదన్న విశ్వాసాన్ని పుర్వార్ కనబరుస్తున్నారు. మా కస్టమర్ల నుంచి మాకు రావాల్సిన బకాయిలు రూ.3 వేల కోట్లపైనే ఉన్నాయి. వీటి వసూలుకు చర్యలు చేపడుతాం అని పుర్వార్ పీటీఐకి తెలిపారు. అయితే ఎప్పట్లోగా ఈ బకాయిలను వసూలు చేస్తారు? అన్న దానిపై సమాధానం కష్టమేనన్న ఆయన 2-3 నెలల్లో వసూలవుతాయన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.

ఆదాయం పెరుగాలి.. ఖర్చు తగ్గాలి

నగదు కష్టాలను అధిగమించేందుకు సంస్థ ఆవరణల అద్దెపైనా బీఎస్‌ఎన్‌ఎల్ ఉన్నతవర్గాలు దృష్టి పెట్టాయి. ఇందులోభాగంగానే ఇప్పటిదాకా వస్తున్న రూ.200 కోట్ల ఆదాయాన్ని.. ఈ ఏడాది దాదాపు రూ.1,000 కోట్లకు పెంచాలని చూస్తున్నాయి. సంస్థ పరిధిలో ఉన్న భవనాలను, ఇతర ఆస్తులను బీఎస్‌ఎన్‌ఎల్ యాజమాన్యం అద్దెకు, లీజుకు ఇస్తున్న విషయం తెలిసిందే. వేడుకలు, సమావేశాలు వంటి వాటికి రెంటుకు ఇస్తున్నారు. వృథాగా పడి ఉన్న ఆస్తులను అమ్మేయాలని కూడా చూస్తున్నారు. అలాగే ఖర్చులనూ తగ్గించుకోవాలని భావిస్తుండగా, విద్యుత్ బిల్లులను కనీసం 15 శాతమైనా దించాలని చూస్తున్నది. నిర్వహణ వ్యయం, వేతనాల మధ్య వ్యత్యాసం నెలనెలా సుమారు రూ.800 కోట్లుగా ఉంటున్నదని అధికారులు చెబుతున్నారు. ఇకపోతే బీఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు ఎంటీఎన్‌ఎల్ కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులకు స్వచ్చంధ పదవీ విరమణను ఆఫర్ చేస్తున్నాయి. ఈ రెండు ప్రభుత్వరంగ టెలికం సంస్థలు ఆదాయం పెంచుకునేందుకు 4జీ స్పెక్ట్రం కేటాయింపులనూ కోరుతున్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్-ఎంటీఎన్‌ఎల్ విలీనం?

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్‌ఎల్)లను విలీనం చేయాలని టెలికం శాఖ ప్రయత్నిస్తున్నది. ఈ రెండింటి పునరుద్ధరణలో భాగంగానే ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో బీఎస్‌ఎన్‌ఎల్ నష్టం దాదాపు రూ.14 వేల కోట్లుగా ఉందని అంచనా. ఆదాయం రూ.19,308 కోట్లుగా ఉన్నది.

266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles