మెగా బ్యాంకులు కావాలి

Mon,May 20, 2019 12:22 AM

Can be internationally competitive EC Krishnamurthy Subramanian

- అప్పుడే అంతర్జాతీయంగా పోటీపడగలం: సీఈఏ కృష్ణమూర్తి సుబ్రమణియన్
న్యూఢిల్లీ, మే 19: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వీ సుబ్రమణియన్ సమర్థించారు. అంతర్జాతీయంగా భారత్ పోటీ పడాలంటే మెగా బ్యాంకుల అవసరం ఉందని అన్నారు. ఎక్కువ బ్యాంకుల స్థానంలో మంచి బ్యాం కులు, బలమైన బ్యాంకులు వస్తేనే లాభదాయకమని వ్యాఖ్యానించారు. ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఈఏ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆర్థికంగా ఆరోగ్యవంతమైన బ్యాంకులు దేశానికిప్పుడు అవసరం. కొన్ని భారీ బ్యాంకులు అందుబాటులో ఉంటే చాలు. అలాంటివే అంతర్జాతీయంగా భారత్‌ను పోటీలో నిలుపగలవు అన్నారు. అమెరికా, చైనా, ఐరోపా దేశాల్లోని బ్యాంకులు చాలా పెద్దవని గుర్తుచేసిన ఆయన గ్లోబల్ సేవింగ్స్ నుంచి ఈ బ్యాంకులు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతున్నాయని వివరించారు. ఈ క్రమంలోనే బ్యాంకుల విలీనాన్ని పరోక్షంగా ఆయన సమర్థించారు.

మోసాలూ తగ్గుతాయ్

ఎక్కువ బ్యాంకులు ఉంటే మోసగాళ్లకు పండుగేనని వ్యాఖ్యానించిన కృష్ణమూర్తి.. బ్యాంకుల సంఖ్య తక్కువగా ఉంటే మోసాలకూ చెక్ పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అందుకే కేంద్రంలోని మోదీ సర్కారు.. బ్యాంకుల విలీనానికి తెర తీసిందన్నారు. ఒక బ్యాంకులో రుణం తీసుకుని, అక్రమాలకు పాల్పడిన వ్యక్తే.. మరో బ్యాంకులోకి దర్జాగా వెళ్లి ఇంకో మోసానికి కారకుడవుతున్నాడని చెప్పారు. బ్యాంకుల ఏకీకరణ వల్ల ఇలాంటి అక్రమాలకు తావుండదని, పొదుపు సామర్థ్యం కూడా పెరుగుతుందని, వ్యయ భారం తగ్గుతుందని తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో దాని అనుబంధ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (ఎస్‌బీపీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ (ఎస్‌బీటీ)లతోపాటు భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ)ను కలిపేసిన విషయం తెలిసిందే. 2017 ఏప్రిల్ 1 నుంచి ఈ విలీనం అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో దేనా, విజయా బ్యాంక్‌లూ విలీనమైయ్యాయి. దీంతో దేశీయ బ్యాంకుల్లో మూడో అతిపెద్ద బ్యాంక్‌గా బీవోబీ అవతరించింది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తర్వాతి స్థానం బీవోబీదే. ఇంతకుముందు ఐసీఐసీఐ బ్యాంక్ ఉండేది. బీవోబీ మొత్తం వ్యాపారం విలువ దాదాపు రూ.15 లక్షల కోట్లు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బీవోబీ రెండో అతిపెద్ద బ్యాంక్‌గా ఉన్నది.

విలీనం దిశగా మరిన్ని

విలీనం దిశగా మరిన్ని బ్యాంకులు వెళ్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి సంకేతాలు వస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో కొన్ని బ్యాంకులను కలిపే యోచన ఉన్నట్లు తెలుస్తున్నది. ఎస్‌బీఐ, బీవోబీల విలీనం తర్వాత, ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ అనంతరం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. 20 దిగువకు చేరింది. వీటిని 4-5 బ్యాంకులుగా మార్చాలని కేంద్రం చూస్తున్నట్లు సమాచారం. ఎస్‌బీఐ ప్రస్తుతం ప్రపంచంలోని 50 అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే.

693
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles