వాణిజ్య యుద్ధానికి తెర?

Fri,November 8, 2019 12:24 AM

-ప్రతీకార సుంకాలను వెనక్కి తీసుకునేలా అమెరికా-చైనా అంగీకారం
-ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు

బీజింగ్, నవంబర్ 7: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాదికిపైగా ఈ రెండు అగ్రదేశాలు పరస్పరం వేల కోట్ల డాలర్ల సుంకాలను విధించుకుంటున్న విషయం తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇది కలవరపెడుతున్న సంగతీ విదితమే. అయితే దశలవారీగా ఇప్పటిదాకా విధించుకున్న ప్రతీకార సుంకాలను వెనుకకు తీసుకునేందుకు చైనా, అమెరికాలు అంగీకరించినట్లు తెలుస్తున్నది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గావ్ ఫెంగ్ గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు తెలియజేశారు. గత రెండు వారాలుగా ఇరు దేశాల మధ్య స్పష్టమైన, నిర్మాణాత్మక సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే ఇరువైపులా విడుతలవారీగా అదనపు సుంకాలను ఎత్తివేసేందుకు సమ్మతించినట్లు చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన తుది ఒప్పందం ఖ రారు కావాల్సి ఉందన్నారు. అయినప్పటికీ టారీఫ్‌ల ఉపసంహరణతో తొలి దశ ఒప్పందం జరిగిందని వెల్లడించారు. అమెరికా-చైనా సంప్రదింపుల్లో ఇదే కీలక ఘట్టమని వ్యాఖ్యానించారు. చైనా ఉప ప్రధాని ల్యూ హీ గత శుక్రవారం అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్ మ్నూచిన్, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి రాబర్ట్ లైథీజర్‌లతో ఫోన్‌లో మాట్లాడగా, ప్రస్తుత సంప్రదింపులపై ఇరు వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయని సమాచారం.

అమెరికా స్పందనేది?

వాణిజ్య యుద్ధం ముగిసిపోనుందన్న సంకేతాలు చైనా నుంచి వ్యక్తమవుతున్నా.. అమెరికా వైపు నుంచి మాత్రం కనిపించడం లేదు. గడిచిన ఏడాదికిపైగా కాలంలో అమెరికా-చైనాల మధ్య ఎన్నోసార్లు చర్చలు, సంప్రదింపులు జరిగాయి. అయితే ప్రతీసారి అర్ధాంతరంగానే ముగియడం, ఆ తర్వాత పరస్పర సుంకాలు వేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ దఫా అలా జరుగదన్న విశ్వాసాన్ని చైనా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అమెరికా నోటి నుంచి మాత్రం ఆ రకమైన ప్రకటనలు రావడం లేదు. అమెరికా నుంచి కూడా ఇదే సంతృప్తి వ్యక్తమైతే.. గ్లోబల్ ఎకానమీలో ఓ పెద్ద డీల్ కుదిరినట్లేనన్న అభిప్రాయాలు అంతర్జాతీయ సమాజం నుంచి వినిపిస్తున్నాయి. చైనాతో వాణిజ్య లోటు ప్రమాదకరంగా ఉందని, అమెరికా సంపదను చైనా దోచుకుపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ సుంకాల సమరానికి తెర తీసిన సంగతి విదితమే. ఇటు తమ దేశంలోకి వస్తున్న వందలాది రకాల చైనా ఉత్పత్తులపై బిలియన్ డాలర్ల సుంకాలు ట్రంప్ వేయగా, చైనా కూడా తమ దేశంలోకి దిగుమతి అవుతున్న అమెరికా వస్తువులపై అదే రీతిలో సుంకాలు బాదింది.

డిసెంబర్‌లో అధ్యక్షుల భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. వచ్చే నెలలో లండన్‌లో కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ నెలలోనే ఇరువురి సమావేశం జరుగాల్సి ఉన్నది. అయితే చిలీ ఆసియా-పసిఫిక్ దేశాధినేతల సదస్సు రద్దు కావడంతో ఈ భేటీకి వీల్లేకుండా పోయింది. దీంతో డిసెంబర్‌లో నాటో సదస్సు తర్వాత ట్రంప్, జిన్‌పింగ్ చర్చలకు వీలుందని వైట్‌హౌజ్ వర్గాల్లోని ఓ సీనియర్ అధికారి తెలిపారు. డిసెంబర్ 3-4 తేదీల్లో ట్రంప్.. నాటో సమ్మిట్‌కు హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే లండన్‌తోపాటు స్వీడన్, స్విట్జర్లాండ్‌లలో అధ్యక్షుల భేటీకి వీలుందన్న ఆయన ఎక్కువ అవకాశాలు మాత్రం లండన్‌కే ఉన్నాయన్నారు.

334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles