ప్యాసింజర్ వాహనాలు ఢమాల్

Wed,June 12, 2019 01:06 AM

Domestic passenger cars sales down

-18 ఏండ్ల కనిష్ఠ స్థాయికి అమ్మకాలు

న్యూఢిల్లీ, జూన్ 11: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 18 ఏండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. మార్కెట్లో ఈ వాహనాలకు డిమాండ్ లేకపోవడంతో గడిచిన నెలలో అమ్మకాలు 20 శాతం పడిపోవడంతో ఆటోమొబైల్ సంస్థలు ఉత్పత్తిని భారీగా తగ్గించుకుంటున్నాయి. వరుసగా ఏడో నెల మే లోనూ 2,39,347 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది అమ్ముడైన 3,01,238లతో పోలిస్తే 20 శాతం దిగువకు పడిపోయాయి. గతేడాది అక్టోబర్‌లో 1.55 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న పీవీల విక్రయాలు అప్పటి నుంచి పతనం చెందాయి. సెప్టెంబర్ 2001లో 21.91 శాతం పడిపోయిన అమ్మకాలు మళ్లీ ఇప్పుడు అంతే స్థాయిలో పతనం చెందాయి. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) విడుదల చేసిన నివేదికతో ఈ విషయం వెల్లడైంది. ఆటోమొబైల్ పరిశ్రమలో మందకొడి పరిస్థితులు కొనసాగుతున్నాయి..హోల్‌సేల్ అమ్మకాల కంటే రిటైల్ విక్రయాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు.ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే కేంద్రం జోక్యం చేసుకోని ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని, 2008-09, 2011-12 సంవత్సరాల్లో వివిధ మార్గాల ద్వారా కేంద్రం ఆటోమొబైల్ పరిశ్రమను ఆదుకున్నదని, ముఖ్యంగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

సియామ్ విడుదల చేసిన నివేదికలో పలు అంశాలు..

-దేశీయంగా కార్ల అమ్మకాలు 26.03 శాతం తగ్గి 1,47,546లకు పడిపోయాయి. అంతక్రితం ఇదే నెలలో 1,99,479 కార్లు అమ్ముడయ్యాయి.
-మోటార్‌సైకిళ్ల విక్రయాలు కూడా 4.89 శాతం క్షీణించ ఇ11,62,373 లకు పరిమితమయ్యాయి. 2018 మే నెలలో 12,22,164 బైకులు విక్రయించారు.
-మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 6.73 శాతం తగ్గి 17,26,206లకు పడిపోయాయి.
-కమర్షియల్ వాహన సేల్స్ కూడా 10.02 శాతం తగ్గి 68,847లకు పరిమితమయ్యాయి.
-గత నెలలో దేశవ్యాప్తంగా 20,86, 358 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదేనెలలో అమ్ముడైన 22,83,262లతో పోలిస్తే 8.62 శాతం తగ్గాయి.

1859
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles