రోల్స్ రాయిస్‌పై ఈడీ కన్నెర్ర

Mon,September 9, 2019 12:16 AM

ED files money laundering case against Rolls Royce

-మనీ లాండరింగ్ కింద క్రిమినల్ కేసు నమోదు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: లండన్‌కు చెందిన రోల్స్ రాయిస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గట్టి షాకిచ్చింది. ప్రభుత్వరంగ సంస్థలైన హెచ్‌ఏఎల్, ఓఎన్‌జీసీ, గెయిల్‌ల నుంచి కాంట్రాక్టు పొందడానికి 2007 నుంచి 2011 మధ్యకాలంలో మధ్యవర్తికి సంస్థ రూ.77 కోట్ల చెల్లింపులు జరిపినట్లు తేలింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కంపెనీకి వ్యతిరేకంగా మనీ లాండరింగ్ కింద కేసును దాఖలు చేసినట్లు ఈడీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్‌ఏ) కింద కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ క్రిమినల్ కేసును దాఖలు చేసింది. రోల్స్ రాయిస్‌కు చెందిన ఇండియన్ సబ్సిడరీ, సింగపూర్‌కు చెందిన అశోక్ పట్ని, ఆశామోర్ ప్రైవేట్ లిమిటెడ్‌లతోపాటు ముంబైకు చెందిన టర్బోటెక్ ఎనర్జీ సర్వీసెస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రైవేట్ సంస్థలు..ప్రభుత్వరంగ సంస్థలైన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ), గెయిల్‌ల నుంచి ఆర్డర్లు పొందడానికి లంచం ఇవ్వచూపినట్లు సీబీఐ ఇప్పటికే కేసును దాఖలు చేసింది. 2000 నుంచి 2013 మధ్యకాలంలో హెచ్‌ఏఎల్ నుంచి రోల్స్ రాయిస్ రూ.4,700 కోట్ల ఆర్డర్ పొందింది. ప్రతిఫలంగా రూ.18 కోట్లను పట్నికి చెల్లింపులు జరిపింది. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన సీబీఐ..ఈ కేసును సుదీర్ఘకాలంగా ఐదేండ్లపాటు విచారించింది. ఈ విషయంపై రోల్స్ రాయిస్ వర్గాలు స్పందిస్తూ..ప్రస్తుతం భారత్‌లో ఏ సంస్థతో కలిసి పనిచేయడం లేదని, భారత మార్కెట్ చాలా కీలమని, ఇక్కడ నైపుణ్యం కలిగిన ఎంతోమంది కార్మికులను అందించినట్లు చెప్పారు. విడిభాగాలను సరఫరా చేయడానికి రోల్స్ రాయిస్‌తోపాటు ఓఎన్‌జీసీ, గెయిల్‌తో పట్ని ఒప్పందం కుదుర్చుకున్నది. 2007 నుంచి 2011 మధ్యకాలంలో ఓఎన్‌జీసీ నుంచి పొందిన ఆర్డర్లలో 73 ఆర్డర్లను సరఫరా చేసినందుకుగాను రోల్స్ రాయిస్ రూ.29.81 కోట్లను ముట్టచెప్పింది. సంస్థ నుంచి రోల్స్ రాయిస్ పది లక్షల పౌండ్ల ఆర్డర్లను పొందినట్లు సీబీఐ వెల్లడించింది. అలాగే గెయిల్ నుంచి పొందిన ఆర్డర్‌కుగాను రూ.28.08 కోట్లు చెల్లించింది.

286
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles