వాహన సంస్థలకు శుభవార్త!

Wed,September 11, 2019 02:50 AM

FM Sitharaman hints at no GST rate cut on automobiles

- జీఎస్టీ తగ్గింపుపై సంకేతాలిచ్చిన నిర్మలా సీతారామన్

చెన్నై, సెప్టెంబర్ 10: వాహన సంస్థలకు ఊరట కలుగనున్నాదా! అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాకు జీఎస్టీ రేటును తగ్గించాలని వాహన సంస్థలు చేస్తున్న డిమాండ్‌పై వచ్చేవారంలో జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వాహన సంస్థల డిమాండ్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నదని, దీంట్లోభాగంగా జీఎస్టీ కౌన్సిల్ కూడా తనవంతుగా రేటును తగ్గిస్తాదని అనుకుంటున్నట్లు చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి చెప్పారు. ప్రస్తుతం కార్లపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీ రేటును 18 శాతం తగ్గించాలని వాహన సంస్థలు కోరుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 20న గోవాలో జరుగనున్న కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

మాంద్యం దెబ్బకు ఆటోమొబైల్ రంగంతోపాటు ఇతర రంగాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు, ఇప్పటికే గడిచిన రెండు నెలల్లో రెండు కీలక నిర్ణయాలు(బ్యాంకుల విలీనం, పలు రంగాల్లో ఎఫ్‌డీఐల పరిమితులు ఎత్తివేయడం) తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని మంత్రి సంకేతాలిచ్చారు. ఆగస్టు నెలలో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు 31.6 శాతం తగ్గి 1,96,524 యూనిట్లకు పరిమితమైనట్లు ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) వెల్లడించిన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహన అమ్మకాలు కూడా 22.24 శాతం క్షీణించి 1,514,196లకు పడిపోయాయి. అమ్మకాలు పడిపోవడంతో అన్ని ఆటోమొబైల్ సంస్థలు తమ వాహన ఉత్పత్తిని భారీగా తగ్గించుకున్నాయి.

టాస్క్ ఫోర్స్ ఏర్పాటు..

మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడంతోపాటు రంగాలవారీగా గుర్తించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. వినిమయాన్ని ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో భారీగా ఖర్చు చేస్తున్నదని, దీంట్లోభాగంగా మౌలిక సదుపాయాల రంగంకోసం రూ.100 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇదివరకే ప్రకటించినట్లు మంత్రి చెప్పారు.

మైండ్‌సెట్ మారడం వల్లే ఈ సంక్షోభం

ఆటోమొబైల్ రంగంలో మందగమనానికి నిన్నటి తరం యువత ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు కూడా కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. సొంత కార్ల కంటే అద్దె కార్లకే మిల్లేనియల్స్ మొగ్గు చూపుతున్నారని.. ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులను బుక్ చేసుకుని ప్రయాణించడమే సులభమని భావిస్తున్నారని అన్నారు. 1980 నుంచి 2000 మధ్య జన్మించిన వారిని మిల్లేనియల్స్ అంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగలవారైన వీరంతా కూడా నెలసరి వాయిదా పద్ధతుల్లో చెల్లించి కార్లు కొనేందుకు ఆసక్తి చూపడం లేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. నేటి ఆటో రంగ సంక్షోభానికి బీఎస్-6 నిబంధనలు, రిజిస్ట్రేషన్ సంబంధిత అంశాలతోపాటు మిల్లేనియల్స్ మైండ్‌సెట్‌లో మార్పు ప్రధాన కారణాలుగా ఆమె అభిప్రాయపడ్డారు. మెట్రో నగరాల్లో మెట్రో సర్వీసులనూ బాగానే వాడుకుంటున్నారని చెప్పారు.

2567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles