రూ.6,399 కోట్లు వెనక్కి

Mon,May 20, 2019 12:24 AM

FPIs withdraw Rs 6,399 crore in May so far

-మే నెలలో తరలించుకుపోయిన ఎఫ్‌పీఐలు
న్యూఢిల్లీ, మే 19: గడిచిన కొన్ని నెలలుగా దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ పెట్టుబడిదారులు క్రమంగా వీటిని ఉపసంహరించుకుంటున్నారు. ప్రస్తుత నెల మే లో ఇప్పటి వరకు రూ.6,399 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. ఎన్నికలకు సంబంధించి అనిశ్చిత పరిస్థితితోపాటు, అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లలో(ఎఫ్‌పీఐ) ఆందోళన స్పష్టంగా కనిపించింది. అంతకుముందు వరుసగా మూడు నెలలపాటు భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో రూ.16,093 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు..మార్చిలో రూ. 45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ.11,182 కోట్ల నిధులను చొప్పించారు. ఆ తర్వాతి నెలలో రివర్స్ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది.

తాజాగా విడుదలైన డిపాజిటరీ డాటా ప్రకారం..మే 2 నుంచి 17 మధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.4,786.38 కోట్లను ఉపసంహరించుకున్న ఎఫ్‌పీఐలు.. డెబిట్ మార్కెట్ల నుంచి కూడా రూ. 1,612.62 కోట్లను వదిలించుకున్నారు. మొత్తంమీద నికరంగా రూ.6,399 కోట్లను ఉపసంహరించుకున్నట్లు అయింది. దేశ ఆర్థిక పరిస్థితులు నిరాశావాదంగా ఉండటం, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో విదేశీ పెట్టుబడిదారులు వేచి చూసే దోరణి అవలంభించారని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. దేశీయ, అంతర్జాతీయంగా నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి ప్రధాన కారణమని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజరీ ఇండియా సీనియర్ రీసర్చ్ హిమాన్షు శ్రీవాత్సవ తెలిపారు. వీటికితోడు అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమేఘాలు ఈ ఆందోళనను మరింత పెంచాయి.

981
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles