అమ్మకానికి గీతాంజలి జెమ్స్!

Wed,April 17, 2019 12:32 AM

Gitanjali gems for sale!

-రూ.12,550 కోట్ల రుణ భారం
-నగదీకరణకే మొగ్గు చూపుతున్న రుణదాతల కమిటీ

ముంబై, ఏప్రిల్ 16: మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌ను అమ్మేసి బకాయిలను వసూలు చేసుకోవాలని ఆ సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకులు భావిస్తున్నాయి. గీతాంజలి జెమ్స్.. 31 రుణదాతలకు రూ.12,550 కోట్లకుపైగా బకాయిపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రూ.14,000 కోట్ల కుంభకోణం ప్రధాన నిందితుల్లో మెహుల్ చోక్సీ కూడా ఒకరన్న విషయం తెలిసిందే. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. చోక్సీకి మేనల్లుడవగా, ఈ మామాఅల్లుళ్లు కలిసి పీఎన్‌బీని మోసం చేసిన సంగతీ విదితమే. గతేడాది జనవరిలోనే వీరిరువురు కుటుంబ సభ్యులతోసహా విదేశాలకు పారిపోగా, ఆంటిగ్వా నుంచి చోక్సీ, బ్రిటన్ నుంచి నీరవ్ అప్పగింతల కోసం భారతీయ దర్యాప్తు సంస్థలు తీవ్ర ప్రయత్నాలనే చేస్తున్నాయి. కాగా, గీతాంజలి జెమ్స్‌కు అప్పులిచ్చిన రుణదాతల నేతృత్వంలోని కమిటీ.. రిజల్యూషన్ ప్రక్రియకున్న 180 రోజుల గడువు తీరిపోయిందని, రిజల్యూషన్ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇక సంస్థ ఆస్తులను అమ్మేసి, బకాయిల వసూళ్లే మేలన్న నిర్ణయానికి వచ్చింది.

ఈ మేరకు మంగళవారం స్టాక్ ఎక్సేంజ్‌లకు గీతాంజలి జెమ్స్ స్పష్టం చేసింది. గత నెల 28న సమావేశమైన రుణదాతల కమిటీ.. ఓటింగ్ నిర్వహించగా, 54.14 శాతం మెజారిటీతో రిజల్యూషన్ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. ఈ క్రమంలోనే నగదీకరణకు మొగ్గు చూపాయి. ఈ నెల 6తో రిజల్యూషన్ ప్రక్రియకున్న గడువు తీరింది. దీన్ని పొడిగించాలని గీతాంజలి జెమ్స్ కోరుతుండగా, రుణదాతలు అంగీకరించడం లేదు. గీతాంజలి జెమ్స్ రూ.12,558 కోట్ల బకాయిల్లో పీఎన్‌బీ వాటా అత్యధికంగా రూ.5,518.5 కోట్లుగా ఉండటం గమనార్హం. రుణదాతల కమిటీ ఓటింగ్‌లో పీఎన్‌బీకి 43.94 శాతం షేర్ ఉన్నది. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ బకాయి రూ.890.20 కోట్లుండగా, ఓటింగ్‌లో 7.09 శాతం షేర్ ఉంది. కార్పొరేషన్ బ్యాంక్‌కు రూ.543.82 కోట్లు, అలహాబాద్ బ్యాంక్‌కు రూ.521.81 కోట్లు చొప్పున ఈ ఆభరణాల సంస్థ బకాయిపడింది. ఇదిలా వుంటే ప్రపంచవ్యాప్తంగా నీరవ్, చోక్సీలకున్న ఆస్తులను జప్తు చేయడానికి ఎన్‌సీఎల్‌టీ జోక్యాన్ని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇప్పటికే కోరిన విషయం తెలిసిందే.

699
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles