గ్లోబల్ మార్కెట్లే ఆధారం

Mon,August 19, 2019 03:24 AM

Global markets are the basis

-ఈ వారం మార్కెట్ సరళిపై నిపుణుల అంచనా
న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈవారంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉండటంతో గడిచిన కొన్ని వారాలుగా దిగువముఖం పట్టిన సూచీలకు..ఈవారంలో అంతర్జాతీయంగా జరుగనున్న పరిణామాలు కీలకంకానున్నాయని మార్కెట్ పండితులు అంచనావేస్తున్నారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారుల సరళి, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య చర్చలు, చమురు, రూపాయి కదలికలు మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలని పేర్కొన్నారు. మందగిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్న చర్యలు మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని మార్కెట్ పండితులు అంచనావేస్తున్నారు. కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు ముగియడంతో ఇక దేశీయ, అంతర్జాతీయంగా జరుగనున్న పరిణామాలు మార్కెట్లకు కీలకమని స్యామ్‌కో సెక్యూరిటీస్ అండ్ స్టాక్ నోట్ ఫౌండర్, సీఈవో జిమీట్ మమోదీ వ్యాఖ్యానించారు. ఈవారంలో దేశీయంగా ఎలాంటి ప్రభావితం చేసే అంశాలు లేకపోవడంతో గ్లోబల్‌గా జరిగే పరిణామాలపై మదుపరులు దృష్టి సారించే అవకాశం ఉందన్నారు. గతవారంలో సెన్సెక్స్ 231.58 పాయింట్లు లాభపడింది.

84 వేల కోట్లు పడిపోయిన బ్లూచిప్ సంస్థల విలువ

గతవారంలో దేశీయ బ్లూచిప్ సంస్థలకు నిరాశనే మిగిల్చింది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కలుపుకొని టాప్-10 కంపెనీల్లో తొమ్మిది రూ.84,354.91 కోట్ల మేర మార్కెట్ వాటాను కోల్పోయాయి. ఈ సంస్థల్లో ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే కోలుకున్నది. ఆర్‌ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.72,153.08 కోట్లు పెరిగి రూ.8,09,755.16 కోట్లకు చేరుకున్నది. టీసీఎస్‌తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్), హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐల మార్కెట్ విలువ పడిపోయింది. టీసీఎస్ రూ.30,807.10 కోట్లు కోల్పోయి రూ.8,11,828.43 కోట్ల వద్ద ముగిసింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ విలువ రూ.19,495.4 కోట్లు కోల్పోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 15,065.80 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 6,700.27 కోట్లు, కొటక్ మహీంద్రా బ్యాంక్ రూ.6,525.48 కోట్లు, హెచ్‌యూఎల్ రూ. 2,954.95 కోట్లు, ఐటీసీ రూ. 1,657.41కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 790.71 కోట్లు, ఎస్బీఐ రూ.356.99 కోట్లు ఎం-క్యాప్‌ను తగ్గాయి.

రూ.8,319 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి

విదేశీ పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత నెలల ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీ, డెబిట్ మార్కెట్ల నుంచి రూ.8,319 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లపై విధించిన పన్నుపై అనిశ్చితి కొనసాగుతుండటం, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం కొనసాగుతుండటం ఇందుకు కారణం. ఈ నెల 1 నుంచి 16 వరకు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.10,416.25 కోట్లను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..డెబిట్ మార్కెట్లలో మాత్రం రూ.2,096.38 కోట్లను చొప్పించారు. ప్రస్తుత నెలలో జరిగిన పది ట్రేడింగ్ రోజుల్లో తొమ్మిది రోజులు ఎఫ్‌పీఐలు నిధులను ఉపసంహరించుకోవడానికి మొగ్గుచూపినట్లు మార్నింగ్‌స్టార్ సీనియర్ విశ్లేషకులు హిమాన్షు శ్రీవాత్సవ తెలిపారు. జూలై నెలలోనూ రూ.2,985.88 కోట్ల పెట్టు బడులను వెనక్కితీసుకున్న విషయం తెలిసిందే. ఎఫ్‌పీఐలపై అధిక పన్నును విధిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో ప్రకటించడంతో విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి పెంచింది. ఫలితంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నిధులను తరిలించుకుపోవడానికి మొగ్గుచూపుతున్నారని వెల్లడిస్తున్నారు.

294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles