జీఎస్టీ వార్షిక రిటర్నుల గడువు పెంపు

Fri,November 15, 2019 02:53 AM

-2017-18 ఆర్థిక సంవత్సరానికి డిసెంబర్ 31 వరకు
-2018-19కిగాను మార్చి 31 వరకు పెంపు

న్యూఢిల్లీ, నవంబర్ 14: పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వార్షిక రిటర్నుల గడువును మరోసారి పెంచింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను గడువును డిసెంబర్ 31 వరకు పెంచిన కేంద్రం..2018-19 ఏడాదికిగాను వచ్చే మార్చి 31 వరకు పొడిగించింది. సమన్వయ నివేదిక కాలపరిమితిని కూడా పెంచింది. జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రయోజనం కల్గించేలా రెండు జీఎస్టీ దరఖాస్తులను మరింత సరళతరం చేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలకుగాను జీఎస్టీఆర్-9(వార్షిక రిటర్నులు), జీఎస్టీఆర్-9సీ(సయోధ్య ప్రకటన) గడువులను వచ్చే మార్చి వరకు పెంచుతున్నట్లు గురువారం కేంద్రం నిర్ణయం తీసుకున్నది. గతంలో 2017-18 ఏడాదికిగాను గడువు నవంబర్ 30 వరకు ఉండగా, అదే ప్రస్తుత సంవత్సరానికిగాను ఇది డిసెంబర్ 31 వరకు గడువు ఉండేది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది కూడా. గత రెండు ఆర్థిక సంవత్సరాలకుగాను పన్ను చెల్లింపుదారులు తమ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను జతపరుచాల్సిన అవసరం లేదు.

రూ.6 లక్షల కోట్ల పన్ను వసూళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.6 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూలైనట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బడ్జెట్‌లో నిర్దేశించుకున్న రూ.13.35 లక్షల కోట్లలో సగాని కంటే తక్కువగానే వసూలయ్యాయి. బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్ పీసీ మోదీ తెలిపారు. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో పన్ను చెల్లింపుదారులకోసం ప్రత్యేక లాంజ్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో రూ.13.35 లక్షల కోట్లు వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, దీంట్లో ఇప్పటి వరకు రూ.6 లక్షల కోట్ల వరకు వసూలు చేసినట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే రీఫండ్ చెల్లింపులు 20 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు.

పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించానికి ఇప్పటికే సీబీడీటీ పలు చర్యలు తీసుకోగా..తాజాగా ఆదాయం పన్ను శాఖ కూడాముఖ రహిత ఈ-అసెస్‌మెంట్ స్కీంను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం ద్వారా పన్ను అధికారుల ప్రమేయం లేకుండా పన్ను చెల్లించవచ్చును. తొలి విడుతలో భాగంగా ఈ నేషనల్ ఈ-అసెస్‌మెంట్ సెంటర్ ద్వారా 58,322 కేసులను ఎంపిక చేసింది. ఆర్థిక మందగమన పరిస్థితుల్లో పన్ను వసూళ్ల లక్ష్యం చేరుకోవడం కష్టమే అయినప్పటికీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని మోదీ తెలిపారు. దేశ వృద్ధిరేటు 5.5 శాతం కంటే తగ్గితే మాత్రం పన్ను వసూళ్లపై ఒత్తిడి తప్పదని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. పడిపోతున్న వృద్ధికి ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్సీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో ప్రతియేటా కేంద్రం రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం కోల్పోనున్నది.

296
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles