హ్యార్లీ నుంచి 11 లక్షల బైకు

Fri,March 15, 2019 12:32 AM

Harley Davidson launches Forty Eight Special model at Rs 10 98 lakh

న్యూఢిల్లీ, మార్చి 14: అమెరికాకు చెందిన లగ్జరీ బైకుల తయారీ సంస్థ హ్యార్లీ-డేవిడ్‌సన్ మరో బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. 1,200 సీసీ సామర్థ్యం కలిగిన ఫార్టీ-ఏయిట్ స్పెషల్‌గా విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.10.98 లక్షలగా నిర్ణయించింది. ఈ సందర్భంగా హ్యార్లీ-డేవిడ్‌సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ రాజశేఖరన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 1,600 సీసీ సెగ్మెంట్‌లో 90 శాతం మార్కెట్‌తో దూసుకుపోతున్నామని..ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి మరిన్ని వాహనాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ విభాగంలో నాలుగు మోడళ్లను విక్రయిస్తున్నది సంస్థ. భారత్‌లో ప్రతియేటా 1,600 సీసీ కంటే అధిక సామర్థ్యం కలిగిన బైకులు 600 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా బిగ్ బైకుల విభాగంలో నిలకడైన వృద్ధిని నమోదు చేసుకుంటున్న సంస్థ.. దీంట్లో తొలిస్థానంలో ఉన్నట్లు ఆయన చెప్పారు.

గడిచిన సంవత్సరంలో సంస్థ 3 వేల యూనిట్ల విక్రయాలు జరిపింది. ప్రస్తుతం సంస్థ రూ.5.33 లక్షలు మొదలుకొని రూ.50.53 లక్షల లోపు ధర కలిగిన పలు మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్నది. భారత్‌లో చిన్న స్థాయి బైకులకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో సంస్థ 200-500 సీసీ లోపు కెపాసిటీ కలిగిన బైకులను విడుదల చేయనున్నట్లు గతేడాది ప్రకటించింది. కాగా, ఇప్పటికే అమెరికా, యూరప్ మార్కెట్లోకి విడుదల చేసిన లీవ్‌వైర్ ఎలక్ట్రిక్ బైకును భారత్‌లో మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నతర్వాతనే విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles