అయ్యయ్యో.. ఆటో రంగర

Mon,August 19, 2019 03:32 AM

Hero MotoCorp Tata  Mahindra and Maruti Suzuki are all cutting production as there no demand

-సంక్షోభంతో అమ్మకాలు డల్.. పెట్టుబడులు నిల్.. కష్టాలు ఫుల్
-ఉత్పాదక కేంద్రాల్లో వర్క్ హాలిడేలు.. లక్షలాది ఉద్యోగాలు మాయం

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఆర్థికమాంద్యం దెబ్బకు దేశీయ ఆటో రంగం అతలాకుతలమవుతున్నది. అమ్మకాలు లేక వెలవెలబోతున్న సంస్థలు.. వర్క్ హాలిడేలను ప్రకటిస్తున్నాయి. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తుండగా, పెట్టుబడులనూ తగ్గించేస్తున్నాయి. దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఈ నెల 15 నుంచి 18 వరకు ఉత్పత్తిని నిలిపి వేసింది. మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడంతో తయారీ ప్లాంట్లను మూసేసింది. టాటా మోటర్స్ సైతం ఈ నెల 16, 17 తేదీలను వర్క్ హాలిడేలుగా ప్రకటించింది. ఇప్పటికే ఈ నెల 1న, 8 నుంచి 10 వరకు వాహనాల తయారీని సంస్థ ఆపేసింది. దీంతో పుణె, జంషెడ్‌పూర్ ప్లాంట్లు తెరుచుకోలేదు. వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ కూడా గడిచిన రెండు నెలల్లో 9 రోజులు ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ నెలలో 17, 19 తేదీలను ఉత్పత్తి విరామంగా ప్రకటించింది. ఇదే క్రమంలో టీవీఎస్ మోటర్ 16, 17 తేదీల్లో తయారీని ఆపేయగా, టయోటా 8 రోజులు నిలిపివేసింది. తమిళనాడు, మహారాష్ట్రల్లోని ప్లాంట్లలో 13 రోజులు ఉత్పత్తిని అపేస్తున్నట్లు బాష్ ప్రకటించింది. అలాగే వాబ్కో 19, జమ్న ఆటో 20 రోజుల చొప్పున తయారీని నిలిపేస్తున్నాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ప్రస్తుత మార్కెట్ మందగమనం దృష్ట్యా వర్క్ హాలిడేలను ప్రకటించింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్లాంట్లలో 8 నుంచి 14 రోజులు వాహన తయారీని అపేస్తున్నట్లు స్పష్టం చేసింది. హ్యూందాయ్ మోటర్ కూడా శ్రీపెరంబుదూర్ ప్లాంట్లో ఉత్పత్తిని ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెలలో విడుతలవారిగా తయారీకి విరామం ఇస్తున్నట్లు తెలియజేసింది. కాగా, మొత్తం ఈ ఏప్రిల్-జూలై ఉత్పత్తి 12,13,281 యూనిట్లుగా ఉన్నదని, గతేడాది ఏప్రిల్-జూలైలో 13,97,404 యూనిట్లుగా ఉందని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) పేర్కొన్నది. మారుతి ఉత్పత్తి 18.06 శాతం తగ్గగా, మహీంద్రా 10.65 శాతం, ఫోర్డ్ 25.11 శాతం, టాటా 20.37 శాతం, హోండా 18.86 శాతం, టయోట 20.98 శాతం మేర పడిపోయాయి. ఇకపోతే ద్విచక్ర వాహనాల విభాగంలోనూ ఇదే రకమైన పరిస్థితులు కనిపించాయని సియామ్ స్పష్టం చేసింది. టూవీలర్ సంస్థల మొత్తం ఉత్పత్తి 9.96 శాతం పతనమైంది. గతంతో పోల్చితే 87,13,476 యూనిట్ల నుంచి 78,45,675 యూనిట్లకు క్షీణించాయి. మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ ఉత్పత్తి 12.03 శాతం, హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 18.5 శాతం, టీవీఎస్ మోటర్ 8.07 శాతం, రాయల్ ఎన్‌ఫీల్డ్ 22.35 శాతం తయారీని తగ్గించేశాయి.
Marutisugiki1

పెరుగుతున్న ఉద్యోగ కోతలు

మునుపెన్నడూ లేనివిధంగా ఆటో పరిశ్రమలో నెలకొన్న విపత్కర పరిస్థితులు.. ఉద్యోగుల ఉసురు తీస్తున్నాయి. గడిచిన 2-3 నెలల్లో వాహన తయారీ సంస్థల్లో దాదాపు 15 వేల మంది కార్మికులు ఉపాధిని కోల్పోగా, దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లలో ఏకంగా 2 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. రిటైలర్లూ నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉద్యోగుల్ని తొలగించడానికే ఆటోమొబైల్ డీలర్లు మొగ్గు చూపుతున్నారని ఆటోమొబైల్ డీలర్ సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) చెబుతున్నది. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు పోయే వీలుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. దేశవ్యాప్తంగా 15 వేల డీలర్లు 26 వేల ఆటోమొబైల్ షోరూంలను నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 25 లక్షల మంది, పరోక్షంగా మరో 25 లక్షల మంది ఉపాధిని పొందుతున్నారు. అయితే ఆటో పరిశ్రమలో ఇప్పుడు నెలకొన్న మందగమన పరిస్థితులు.. డీలర్లను వ్యాపారానికి స్వస్తి పలికేలా చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌తో ముగిసిన 18 నెలల్లో దేశవ్యాప్తంగా 271 నగరాల్లోగల 286 షోరూంలు మూతబడ్డాయంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో దాదాపు 32 వేల ఉద్యోగులు పనిచేస్తుండగా, ఇప్పుడు వారంతా రోడ్డునపడ్డారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతోపాటు ప్రధాన నగరాల్లోగల ఔట్‌లెట్లనూ మూసి వేస్తున్నారని ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు ఆశిష్ హర్షరాజ్ కాలే తెలిపారు. చాలా డీలర్‌షిప్‌లలో 7-8 శాతం ఉద్యోగాల్లో కోత పడిందని వివరించారు.

స్తంభించిన పెట్టుబడులు

అమ్మకాల పతనం ప్రభావం.. పరిశ్రమలోని పెట్టుబడులపైనా పడుతున్నది. ఆటో కంపోనెంట్ సంస్థలు తమ పెట్టుబడులను భారీగా తగ్గించేస్తున్నాయి. కొన్ని సంస్థలు పెట్టుబడుల ప్రతిపాదనల్ని వెనక్కి కూడా తీసుకుంటున్నాయి. భారత్ ఫోర్జ్, లూమాక్స్ ఇండస్ట్రీస్ తదితర ప్రధాన సంస్థల పెట్టుబడులు పడిపోయాయి. ఈ మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2018-19)లో లూమాక్స్ పెట్టుబడులు రూ.94 కోట్లకు తగ్గాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం లో రూ.162 కోట్ల పెట్టుబడులను పెట్టింది. గతేడాది నవంబర్ నుంచి అమ్మకాలు తిరోగమనంలో పడిన విషయం తెలిసిందే. గత 20 ఏండ్లలో ఎప్పు డూ ఈ స్థాయిలో పరిశ్రమ ఇబ్బందులో పడలేదని సియామ్ చెబుతున్నది. తాజా పరిస్థితులు 10 లక్షల ఉద్యోగాలను ప్రమాదంలో పడేశాయని తెలిపింది.

పన్ను మినహాయింపులివ్వాలి: మారుతి

Marutisugiki2
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ.. హైబ్రిడ్, సీఎన్‌జీ కార్ల కోసం పన్నుల నుంచి ఉపశమనాన్ని కోరుతున్నది. కాలుష్య నియంత్రణ, ఇంధన వినియోగం తగ్గింపు కోసం విద్యుత్ ఆధారిత వాహనాల (ఈవీ)కు పన్ను మినహాయింపులు ఇవ్వడం సరైనదేనన్న మారుతి చైర్మన్ ఆర్‌సీ భార్గవ.. హైబ్రిడ్, సీఎన్‌జీ కార్లకూ ఆ తరహా ప్రోత్సాహకాలు అవసరమని అభిప్రాయపడ్డారు. హైబ్రిడ్ కార్లు 25 నుంచి 30 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తాయని, ముడి చమురు దిగుమతులు చాలావరకు తగ్గుతాయన్నారు. ఈవీలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 5 శాతానికి కోత పెట్టిన విషయం తెలిసిందే. కానీ పెట్రోల్, డీజిల్ వాహనాలు, హైబ్రిడ్ కార్లపై అత్యధికంగా 28 శాతం పన్ను పడుతున్నది. మందగించిన అమ్మకాల నడుమ మారుతి సుజుకీ 3 వేల మందికిపైగా తాత్కాలిక ఉద్యోగులను తొలగించిన సంగతి విదితమే.

ఉద్దీపనలు అవసరం: మహీంద్రా

mahindra
మునుపెన్నడూ లేనివిధంగా దేశ ఆటో పరిశ్రమలో నెలకొన్న విపత్కర పరిస్థితులను అధిగమించడానికి ఉద్దీపనలు అవసరమని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా అన్నారు. నీరసించిన అమ్మకాలు, ఉద్యోగుల తొలగింపులు ఆటో రంగంపై ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. ఆటోమోటివ్ సరఫరాదారులు, డీలర్‌షిప్‌లలోనే ఉద్యోగాల కోత ఎక్కువగా ఉందన్న ఆయన వాహన ఉత్పత్తి సంస్థల్లో తక్కువగానే ఉందన్నారు. అయితే వర్క్ హాలిడేలతో వ్యయ భారం పెరిగిపోతున్నదని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇబ్బందేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా తాము దాదాపు 1,500 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించామన్న ఆయన ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉద్దీపనలు అందించకపోతే వ్యాపారం పడిపోయి, నిరుద్యోగం పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం ఖాయమన్నారు.

1984
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles