జెట్‌పై హిందుజా గ్రూపు కన్ను!

Sat,May 25, 2019 12:20 AM

Hinduja Group Etihad not making much progress in Jet Airways deal

-రూ.1,500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేయోచనలో సంస్థ
న్యూఢిల్లీ, మే 24: ఆర్థిక సంక్షోభంతో మూతపడిన జెట్ ఎయిర్‌వేస్‌పై హిందుజా గ్రూపు కన్ను పడిందా..! అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థగా వెలుగొందిన జెట్ ఎయిర్‌వేస్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సుడిగిండంలో చిక్కుకొని తాత్కాలికంగా మూతపడింది. సంస్థను ఆర్థికంగా చేయూతనందించడానికి బ్యాంకర్లు, ఇతర సంస్థలు నిరాకరించడంతో ఏప్రిల్ 17 నుంచి తన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రెండుసార్లు నిర్వహించిన బిడ్డింగ్‌లో ఒక్క సంస్థ కూడా ముందుకు రాకపోవడంతో వెనక్కి తగ్గింది. ప్రస్తుతం జెట్‌లో వాటాను కొనుగోలు చేయడానికి హిందుజా గ్రూపు ఆసక్తి చూపుతున్న విషయం బట్టబయలైంది. ఈ విషయాన్ని హిందుజా గ్రూపు చైర్మన్ ధీరజ్ జీ హిందుజా కూడా సంకేతాలిచ్చారు. సంస్థను టేకోవర్ చేస్తారా..లేదా కొంత మేర వాటాను కొనుగోలు చేస్తారా అనే దానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినప్పటికీ..జెట్ ఎయిర్‌వేస్‌లో ఉన్న ప్రము ఖ వాటాదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంకేతాలిచ్చారు. అత్యధిక వాటా కలిగిన అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నట్లు మీడియాలో కథనం ప్రచూరితమైంది.

నేలపట్టునే నిలిచిపోయిన జెట్ ఎయిర్‌వేస్ విమానాలను మళ్లీ గాలిలోకి ఎగురడానికి హిందుజా గ్రూపు రూ.1,000 నుంచి రూ.1,500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తున్నది. దీంతో ఈ వారంలో మొదట్లో కంపెనీ షేరు ధర ఏకంగా 14 శాతానికి పైగా లాభపడింది. ప్రస్తుతానికి చమురు, కెమికల్స్, బ్యాంకింగ్, ఆర్థిక, విద్యుత్, ఆటోమోటివ్, ఇన్‌ఫ్రా, ఫైనాన్స్, ఐటీ అండ్ ఐటీఈఎస్, మీడియా, హెల్త్‌కేర్ రంగాల్లో సేవలు అందిస్తున్న హిందుజా గ్రూపు తాజాగా విమానయాన రంగంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఇరు సంస్థల ఉన్నతాధికారులు గురువారం అబుదాబిలోని ఎతిహాద్ విమానయాన సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐకి చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.

758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles