హెదరాబాదే టాప్

Thu,April 18, 2019 12:58 AM

Hyderabad overtakes Bengaluru emerges at top in total office leasing in Q1 of 2019

-ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో అగ్రస్థానం
-తొలిసారి బెంగళూరును దాటేసిన భాగ్యనగరం
-3.5 మిలియన్ చదరపు అడుగులతో ముందు
-ప్రాపర్టీ కన్సల్టెన్సీ సీబీఆర్‌ఈ వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ పరుగులు పెడుతున్నది. కార్పొరేట్లకు దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరంగా భాగ్యనగరం ఎదిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని తొమ్మిది నగరాల్లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ వెల్లడించింది. ముఖ్యంగా బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ తొలిసారి అధిగమించినట్లు పేర్కొన్నది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, కొచ్చి నగరాల్లో 12.8 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగింది.

ఏడాదిలో మూడింతలకుపైగా వృద్ధి

మొత్తం తొమ్మిది నగరాల్లో జరిగిన లీజింగ్‌లో హైదరాబాద్ వాటానే 3.5 మిలియన్ చదరపు అడుగులు. గతేడాది ఇదే సమయంలో 1.1 మిలియన్ చదరపు అడుగులకే లీజింగ్ పరిమితమైంది. అయితే ఈసారి మాత్రం మూడింతలకుపైగా వృద్ధి చెందింది. ఈ క్రమంలోనే బెంగళూరుసహా ప్రధాన నగరాలను హైదరాబాద్ దాటేసింది. నగరంలోని మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్య వనరులు, సులభతరమైన అనుమతులు.. కార్పొరేట్ వర్గాలను ఆకట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఇక్కడి ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరుగగా, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీపడిమరి లీజులు చేసుకున్నాయి. ముందస్తు ఒప్పందాలూ ఇందుకు దోహదం చేశాయని సీబీఆర్‌ఈ చెప్పింది.

ఢిల్లీ, బెంగళూరుల్లో క్షీణత

బెంగళూరు ఆఫీస్ మార్కెట్‌లో లీజింగ్ గతంతో పోల్చితే ఈసారి 5.5 మిలియన్ చదరపు అడుగుల నుంచి 2.5 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోనూ 2.1 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.6 మిలియన్ చదరపు అడుగులకు క్షీణించింది. పుణెలో కూడా 1 మిలియన్ చదరపు అడుగుల నుంచి 0.9 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. అయితే ముంబైలో మాత్రం 1.5 మిలియన్ చదరపు అడుగుల నుంచి 2.1 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. చెన్నై కూడా 1.1 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.5 మిలియన్ చదరపు అడుగులకు పెంచుకున్నది. అలాగే అహ్మదాబాద్‌లో 0.02 మిలియన్ చదరపు అడుగుల నుంచి 0.4 మిలియన్ చదరపు అడుగులకు, కొచ్చిలో 0.06 మిలియన్ చదరపు అడుగుల నుంచి 0.2 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. కోల్‌కతాలో ఈసారి కూడా అతితక్కువగా 0.1 మిలియన్ చదరపు అడుగుల వద్ద ఆఫీస్ స్పేస్ లీజింగ్ యథాతథంగా ఉన్నది.

రాష్ట్ర విధానాలు ఆకర్షణీయం

అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. తెలంగాణను, ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. టీఎస్ ఐపాస్, యువతకు నైపుణ్య శిక్షణ, సులభతర అనుమతులు, అత్యుత్తమ పారిశ్రామిక విధానం.. తెలంగాణను కార్పొరేట్ ప్రపంచానికి చేరువయ్యేలా దోహదపడుతున్నాయి. ఈ క్రమంలోనే మున్ముందూ హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఆకర్షణీయంగా ఉంటుందన్న ఆశాభావాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దేశీయ మార్కెట్ స్థిరంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని సీబీఆర్‌ఈ ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాల చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ వ్యక్తం చేశారు. అమెరికా సంస్థలు భారతీయ మార్కెట్‌పై ఆసక్తిని కనబరుస్తాయని చెప్పారు.

టెక్నాలజీ రంగమే అగ్రగామి

ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో జరిగిన ఈ తొమ్మిది నగరాల ఆఫీస్ మార్కెట్ లీజింగ్‌లో ఎక్కువగా టెక్నాలజీ సంస్థలే పాల్గొన్నాయి. 33 శాతం ఆఫీస్ స్పేస్‌ను టెక్ కార్పొరేట్లే దక్కించుకున్నారు. నిరుడు 22 శాతంగానే ఉన్నది. ఇక ఆ తర్వాత 16 శాతంతో కో-వర్కింగ్ ఆపరేటర్లున్నారని సీబీఆర్‌ఈ ఇండియా ఆఫీస్ మార్కెట్ వ్యూ-క్యూ1 2019 నివేదిక స్పష్టం చేస్తున్నది. పోయినసారి 5 శాతం ఆఫీస్ స్పేస్‌నే లీజుకు తీసుకున్న వీరు.. ఈసారి మూడింతలకుపైగా పెంచుకున్నారు. ఇక ఈసారి మొత్తం తొమ్మిది నగరాల్లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వాటానే 75 శాతంతో సమానంగా ఉన్నది.

1960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles