హైదరాబాద్, నవంబర్ 14: రాష్ర్టానికి చెందిన ప్రముఖ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ రూ.86.20 కోట్ల సమీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.63.50 కోట్ల లాభంతో పోలిస్తే 36 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2,412.40 కోట్ల నుంచి రూ.2,840.70 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మాట్లాడుతూ..గత త్రైమాసికంలో పనితీరు అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకున్నట్లు, సేవల విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో కంపెనీ సమీకృత ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15 శాతం ఎగబాకి రూ.2,463.30 కోట్లకు చేరుకున్నది. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా 3,607 రిటైల్ ఫార్మసీ అవుట్లెట్లను నిర్వహిస్తున్నది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర 2.03 శాతం పెరిగి రూ.1,417.95 వద్ద ముగిసింది.