సంక్షోభంలో బ్యాంకింగ్

Wed,August 21, 2019 05:17 AM

Increase Stubborn Dues In Banking Sector

-వ్యాపారానికి ఆర్థిక మందగమనం సెగ
-మళ్లీ పెరుగుతున్న మొండి బకాయిలు
-కొత్త రుణాలకు వెనుకడుగేస్తున్న బ్యాంకర్లు
-వ్యక్తిగత, సంస్థాగత లోన్లపై ప్రభావం

న్యూఢిల్లీ, ఆగస్టు 20:దేశ ఆర్థిక వ్యవస్థ చుట్టూ సంక్షోభపు వలయాలు ఏర్పడుతున్నాయి. కీలక రంగాల్లో నెలకొన్న స్తబ్ధత.. ఇప్పుడు బ్యాంకింగ్ రంగానికి తాకుతున్నది. ఆర్థిక మందగమనం, ఉద్యోగాల కోతలు.. రుణ వితరణతోపాటు ఇప్పటికే ఉన్న రుణాల వసూలుకు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) ముప్పుతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. బ్యాంకుల ఉనికినే ఇవి ప్రశ్నార్థకం చేస్తున్న క్రమంలో ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల వల్ల కొత్త రుణాలకు బ్యాంకులు సాహసించలేకపోతున్నాయి. దీంతో బ్యాంకింగ్ వ్యాపారం, రుణాల మంజూరు బాగా పడిపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత, సంస్థాగత, రిటైల్ రుణాలపై ఈ ప్రభావం పెద్ద ఎత్తున ఉంటుందన్న ఆందోళనలు కనిపిస్తున్నాయి. జెట్ ఎయిర్‌వేస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, అలోక్ ఇండస్ట్రీస్ వంటి భారీ సంస్థలు దివాలా తీయడం, వేలాది మంది ఉద్యోగులు ఉపాధిని కోల్పోవడం బ్యాంకర్లను కలవరపాటుకు గురిచేస్తున్నది. ఉద్యోగులు తీసుకున్న రుణాల భవితవ్యం అగమ్యగోచరంగా ఉన్నదిమరి. నిజానికి ప్రమాదకర స్థాయికి చేరుకున్న ఎన్‌పీఏల నుంచి ఇప్పుడిప్పుడే బ్యాంకులు కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో మరో సంక్షోభం ముంచుకొస్తుండటం.. బ్యాంకింగ్ రంగానికే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకూ ఇబ్బందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండేండ్ల క్రితం ఐటీ రంగంలో చోటుచేసుకున్న సంక్షోభం కంటే ఇప్పుడున్నది భిన్నంగా ఉందని ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఎండీ రమేశ్ సోబ్టీ అన్నారు. నానాటికీ పరిస్థితులు దిగజారుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈవో ఆదిత్యా పూరీ అన్నారు.

క్షీణించిన వినియోగ సామర్థ్యం

వినియోగదారుల కొనుగోళ్ల శక్తి దెబ్బతినడం కూడా ప్రస్తుత ఆర్థిక మందగమనానికి ఓ కారణంగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. మారిన ఆర్థిక ముఖచిత్రంతో గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలు తగ్గిపోయాయని బ్యాంకర్లే చెబుతున్నారు. అమ్మకాలు లేక ఆటో రంగం భీకర సంక్షోభానికి లోనవగా, 10 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని భారతీయ ఆటోమోటివ్ కంపోనెంట్ తయారీదారుల సంఘం హెచ్చరికలు చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 20 ఏండ్ల కనిష్ఠానికి విక్రయాలు పతనమవగా, ప్యాసింజర్ వాహన అమ్మకాలు భారీగా దిగజారాయి. దీంతో చివరకు సరైన సెక్యూరిటీ లేకుండా డీలర్లకూ రుణాలు దొరుకడం లేదని కొటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఉదయ్ కొటక్ అన్నారు. ఈ ఏడాది జనవరి-మార్చిలో దేశ జీడీపీ ఐదేండ్ల కనిష్ఠానికి పతనమవగా, ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల నుంచి రుణాలూ తగ్గిపోయాయి. దీంతో రుణ లభ్యత లేక వ్యాపార, పారిశ్రామిక రంగాలు కుదేలైపోగా, క్షీణించిన వినియోగ సామర్థ్యంతో అమ్మకాలూ పడిపోయి సంక్షోభం ముదురుతున్నది.

భవిష్యత్తు అయోమయం!

కార్పొరేట్ రంగమైనా.. రిటైల్ రంగమైనా వాటికిచ్చే రుణాలు ఆయా రంగాల పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలు మందగమనంలోనే ఉండటంతో బ్యాం కుల నుంచి రుణాలూ తగ్గా యి. దీంతో అటు బ్యాంకింగేతర రంగాలు, ఇటు బ్యాంకింగ్ రంగం రెండింటి భవిష్యత్తు అయోమయంలో పడ్డాయి. ముఖ్యంగా ఆటో, నిర్మాణ రంగాలు కుదేలైపోతుండగా, రుణాలు ఇస్తామన్నా ఎవరూ తీసుకోవడం లేదని ఇటీవలే ఎస్బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్ స్పష్టం చేసిన సంగతి విదితమే. దీంతో రుణాలపై వినియోగదారుల్లోనే ఆసక్తి తగ్గిందన్న సంకేతాలు వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు కుదుటపడ్డాకగానీ కొనుగోళ్లకు వెళ్లవదన్న నిర్ణయానికి కొనుగోలుదారులు వచ్చినట్లు మార్కె ట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బ్యాంకులు సైతం రుణాలు కావాలని వచ్చేవారి మొత్తం స్థితిగతులను పరిశీలించిగానీ రుణాలను మంజూరు చేయడం లేదు. వ్యక్తిగతంగానైనా, సంస్థాగతంగానైనా చాలా జాగ్రత్తలు వహిస్తున్నాయి. వ్యక్తిగతంగా రుణం ఆశించేవారి.. ఉద్యోగం, జీతం, చేస్తున్న పని, సంస్థలను గమనించి బ్యాంకులు ముందుకొస్తున్నాయి. అలాగే సంస్థాగతంగానైతే ఆయా రంగాలనుబట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో సిబిల్ స్కోరు బాగున్నా రుణాలను ఇవ్వలేమని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ ఆదిత్యా పురి అంటుండటం తాజా భయానక పరిస్థితులకు అద్దం పడుతున్నది.

ముందున్నది అసలు మాంద్యం

అసలు మాంద్యం ముందున్నదని బజాజ్ ఫైనాన్స్ హెచ్చరించింది. మొండి బకాయిలు పెరుగుతాయన్న భయాలతో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు రుణాలకు దూరంగా ఉంటున్నాయని బజాజ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో రాజీవ్ జైన్ తెలిపారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆస్తుల విలువలు గణనీయంగా పడిపోతున్నాయని, దీంతో రుణాలు ఇచ్చేందుకు ఇటు బ్యాంకులు, అటు ఎన్‌బీఎఫ్‌సీలు వెనుకాడుతున్నాయని అన్నారు. ఇక యువకులకైతే రుణాలు ఇవ్వడమే లేదని, తాము 25 ఏండ్ల లోపు వయసున్నవారికి లోన్లు మంజూరు చేయడం లేదని జైన్ అన్నారు. మొత్తానికి తాము మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సైతం రుణాల విషయంలో ఆచితూచి అడుగులేస్తుండగా, సెక్యూరిటీ లేని రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల బకాయిల విషయంలో నిబంధనలను మార్చుతున్నది. దీంతో ఇప్పుడు రుణం అంత సులభంగా రాదన్న అంచనాలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. గృహ, వాహన రుణాలు కష్టమేనన్న ఆందోళన వారిలో కనిపిస్తున్నది.

30 వేల ఉద్యోగాలు ఔట్

దేశ ఆర్థిక వ్యవస్థపైనేగాక.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ఇప్పుడు తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ రంగంపై భయాలు నెలకొన్నాయి. ఈ ఏడాది బ్యాంకింగ్ రంగంలో 30 వేల ఉద్యోగాలు పోయేందుకు ఆస్కారముందని తెలుస్తున్నది. ఆర్థిక మందగమనం, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, వ్యయ నియంత్రణ, వడ్డీరేట్ల పతనం వంటి కారణాలు, లక్ష్యాలు, ప్రాధాన్యత అంశాలు ఇందుకు దారి తీస్తున్నాయి. డ్యూషే బ్యాంక్ 18 వేల ఉద్యోగాలను తొలగిస్తామని ప్రకటించగా, బార్క్‌లేస్ 3 వేలు, సొసైటీ జనరెలి 1,600 మేర ఉద్యోగులను తొలగించే వీలున్నది. సిటీ గ్రూప్ సైతం వందలాది మంది ఉద్యోగులను తీసేయాలని పావులు కదుపుతున్నది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న కొనుగోళ్లు, కుదురుతున్న విలీనాలు సైతం ఉద్యోగుల కోతకు కారణమవుతున్నాయని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles