జీడీపీ గోల్‌మాల్

Wed,June 12, 2019 01:42 AM

Indias GDP growth overstated

-దేశ వృద్ధిని ఎక్కువగా అంచనా వేశారు
-2011-17 మధ్య 2.5 శాతం అధికంగా చూపారు
-మాజీ సీఈఏ అర్వింద్ సుబ్రమణియన్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జూన్ 11: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధిదాయక దేశం.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వెలుగు రేఖ.. ఇప్పటిదాకా భారత్‌పై అంతర్జాతీయ సమాజం అంచనాలు ఇవన్నీ. అయితే దేశ జీడీపీ గణన అంతా తప్పుల తడక, వాస్తవ గణాంకాల కంటే ఎక్కువ చూపించారని ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) నుంచే ఈ ఆరోపణలు రావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. 2011-12 నుంచి 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు దేశ వృద్ధిరేటును ఉన్నదానికంటే దాదాపు 2.5 శాతం అధికంగా అంచనా వేశారని మోదీ సర్కారు మాజీ సీఈఏ అర్వింద్ సుబ్రమణియన్ అంటున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ప్రచురించిన రిసెర్చ్ పేపర్‌లో 2011-17 మధ్య భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు దాదాపు 4.5 శాతంగానే ఉన్నా.. అధికారిక గణాంకాలు మాత్రం సుమారు 7 శాతంగా ఉన్నాయని సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. జీడీపీ లెక్కింపు పద్ధతిలో మార్పే ఇందుకు కారణమని పేర్కొన్నారు. 2011-12 నుంచి 2016-17 వరకు వాస్తవ జీడీపీ అంచనా కోసం భారత్ తమ డేటా వనరుల పద్ధతిని మార్చింది. దీనివల్లే దేశ వృద్ధిరేటు ఉండాల్సిన దానికంటే ఎక్కువ కనిపించింది అన్నారు. 2011-17 వ్యవధిలో వార్షిక జీడీపీ సగటు సుమారు 7 శాతంగా ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయని, అయితే నిజానికిది దాదాపు 4.5 శాతాన్ని మించబోదని అన్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2018-19) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో జీడీపీ ఐదేండ్ల కనిష్ఠాన్ని తాకడం.. సుబ్రమణియన్ తాజా వ్యాఖ్యలకు బలం చేకూరుస్తుండటం గమనార్హం.

అర్థ రహితం: ప్రభుత్వం

జీడీపీ లెక్కలు సరిగా లేవం టూ అర్వింద్ సుబ్రమణియ న్ చేసిన వ్యాఖ్యలు అర్థ రహితమని, ఆమోదయోగ్యమైన విధానాలు, పద్ధతుల ద్వారానే జీడీపీ గణన జరిగిందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిం ది. తమ గణాంకాలు.. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని గుర్తుచేసింది. బహుశా విద్యుత్ వినియోగం, ద్విచక్ర, వాణిజ్య వాహనాల అమ్మకాలు ఆధారంగా సుబ్రమణియన్ ప్రాథమికంగా లెక్కలు వేసి ఉండొచ్చని ఓ ప్రకటనలో ఎద్దేవా చేసింది. ఐక్యరాజ్యసమితి అనుసరిస్తున్న వ్యవస్థ ఎస్‌ఎన్‌ఏ 2008 నే తామూ పాటిస్తున్నట్లు ప్రకటించింది. జీడీపీ సిరీస్ బేస్ ఇయర్‌ను 2004 -05 నుంచి 2011-12కు మార్చా మ న్నది. కాగా, ఈ ఏడాది మే వరకు పదవీ కాలం ఉన్న ప్పటికీ గతేడాది ఆగ స్టులోనే తన సీఈఏ హోదాకి అర్వింద్ సుబ్రమణియన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

యూపీఏ-2లో మొదలు

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 హయాంలోనే జీడీపీ అంచనాలు వాస్తవికతకు దూరంగా ఉండటం మొదలైందని సుబ్రమణియన్ తెలిపారు. 2012లో జీడీపీ గణనకు అనుసరిస్తున్న పద్ధతులను అప్పటి మన్మోహన్ సర్కారు మార్చిందన్నారు. దీంతో అప్పటిదాకా ఉన్న విలువ ఆధారిత డేటా స్థానంలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమకూర్చిన ఆర్థిక పద్దుల ఆధారిత డేటా వచ్చిందని వివరించారు. ఫలితంగా జీడీపీ అంచనాలు చాలా సున్నితంగా తయారయ్యాయని చెప్పారు. ఇక మోదీ సర్కారు వచ్చాక కొత్త జీడీపీ సిరీస్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. దీని కింద ఇప్పటికే దేశ వృద్ధిరేటు అంచనాలపై వివాదాలు నెలకొన్న సంగతీ విదితమే. ఈ నేపథ్యంలో సుబ్రమణియన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles