పారిశ్రామిక పరుగుకు బ్రేక్

Sat,August 10, 2019 01:07 AM

Industrial production growth slips to 2 Percent in June

-నాలుగు నెలల కనిష్ఠానికి వృద్ధి
-జూన్ నెలలో 2 శాతంగా నమోదు
-దెబ్బతీసిన గనులు, తయారీ రంగాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 9: పారిశ్రామిక పరుగుకు బ్రేకులు పడ్డాయి. గనులు, తయారీ రంగాల్లో నెలకొన్న మందకొడి వృద్ధి కారణంగా జూన్ నెలలో పారిశ్రామిక వృద్ధిరేటు నాలుగు నెలల కనిష్ఠ స్థాయి 2 శాతానికి జారుకున్నది. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2018 ఏడాది ఇదే నెలలో పారిశ్రామిక వృద్ధి 7 శాతంగా ఉన్నది. ప్రస్తుతం సంవత్సరం ఫిబ్రవరి నెలలో నమోదైన వృద్ధి తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి. అప్పట్లో ఇది 0.2 శాతం. ఆ తర్వాతి నెల(మార్చి)లో 2.7 శాతంగా నమోదైన పారిశ్రామికం..ఏప్రిల్‌లో 4.3 శాతంగాను, మే నెలలో 4.6 శాతంగా నమోదయ్యాయి. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను పారిశ్రామిక ప్రగతి 3.6 శాతంగా ఉన్నది. అంతక్రితం ఏడాది నమోదైన 5.1 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. తయారీ రంగంలో నెలకొన్న మందకొడి కారణంగా వృద్ధికి బ్రేక్‌పడిందని తెలిపింది. జూన్ నెలలో తయారీ రంగ పనితీరు 1.2 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇది 6.9 శాతంగా ఉన్నది. అలాగే పెట్టుబడులకు గిటురాయి అయిన క్యాపిటల్ గూడ్స్ వృద్ధి కూడా 9.7 శాతం నుంచి 6.5 శాతానికి పడిపోగా..మైనింగ్ 1.6 శాతానికి జారుకున్నది. అలాగే, విద్యుత్ రంగంలో వృద్ధి 8.2 శాతంగాను, ప్రాథమిక వస్తువులు 0.5 శాతం, మౌలిక సదుపాయాలు/నిర్మాణ రంగ వస్తువుల్లో వృద్ధి 0.8 శాతానికి పరిమితమైంది. కన్జ్యూమర్ గూడ్స్, నాన్-డ్యూరబుల్ రికార్డు స్థాయి పనితీరును కనబరిచాయి. 23 రంగాల్లో ఎనిమిది వృద్ధిని నమోదు చేసుకోగా, మిగతావి ప్రతికూలానికి పడిపోయాయి. ఇండస్ట్రీ గ్రూపునకు చెందిన తయారీ రంగం అత్యధిక వృద్ధి 17.7 శాతం నమోదు చేసుకోగా, ఆహార ఉత్పత్తులు 16.5 శాతం, పొగాకు ఉత్పత్తులు 10.3 శాతం చొప్పున పనితీరు కనబరిచాయి.

458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles