చేతులెత్తేసిన బ్యాంకులు?

Tue,April 16, 2019 12:49 AM

Jet Airways calls board meeting on Tuesday

-సాయంపై ఇంకా నిర్ణయం తీసుకోని రుణదాతలు
-అయోమయంలో వేలాది జెట్ ఉద్యోగులు
-నేడు బోర్డు కీలక సమావేశం

ముంబై, ఏప్రిల్ 15: జెట్ ఎయిర్‌వేస్‌కు గట్టి ఎదురుదెబ్బ. పునరుద్ధరణకున్న దారులన్నీ మూసుకుపోతున్నాయి. మధ్యంతర సాయం చేస్తామన్న బ్యాంకులూ.. చేతులెత్తేసినట్లే కనిపిస్తున్నది. రూ.1,500 కోట్ల తక్షణ సాయం చేస్తామని సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకర్ల కూటమి గత నెల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రోజులు గడుస్తున్నా ఈ సా యం ఆచరణలోకి రాకపోవడంతో సోమవారం బ్యాంకర్లను కలిసిన జెట్ నిర్వాహకులకు నిరాశే మిగిలింది. నిధులను అందించడంపై రుణదాతలు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మంగళవారం జెట్ ఎయిర్‌వేస్ బోర్డు సమావేశం జరుగుతుండటం.. ఈ అనుమానాలకు మరింతగా తావిస్తున్నది.

ఏం చేయాలో నిర్ణయిస్తాం: దూబే

బోర్డు సమావేశం అనంతరం తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని జెట్ సీఈవో వినయ్ దూబే సోమవారం ఇక్కడ చెప్పారు. బోర్డు నుంచి మార్గదర్శకాలను మేనేజ్‌మెంట్ తీసుకుంటుందని వివరించారు. సోమవారం భేటీలో రూ.1,500 కోట్ల సాయంపై బ్యాంకర్లు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అత్యవసరాల కోసం దాదాపు రూ.250 కోట్లను బ్యాంకులు విడుదల చేశాయన్నారు. కాగా, బోర్డు నిర్ణయాలను ఉద్యోగులకు తెలియపరుస్తామని, మరే కీలక నిర్ణయాలు తీసుకున్నా.. ఎప్పటికప్పుడు వెల్లడిస్తామన్నారు.

చేస్తామన్న సాయం చేయండి

మరోవైపు రూ.1,500 కోట్లను విడుదల చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐని నాగ్ కోరింది. గత నెల జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యం చేతులు మారిన నేపథ్యంలో మెజారిటీ వాటాదారులుగా ఉన్న బ్యాంకులు రూ.1,500 కోట్ల సాయం చేస్తామని గత నెల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తక్షణ అవసరాల నిమిత్తం ఈ నిధుల్ని అందిస్తామని చెప్పాయి.

త్వరలోనే బిడ్డర్లను ప్రకటిస్తాం: ఎస్‌బీఐ

జెట్ ఎయిర్‌వేస్‌లో ఉన్న తమ వాటాను అమ్మడానికిగాను నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్న వారి పేర్లను త్వరలోనే ప్రకటిస్తామని ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని రుణ దాతలకు సంస్థలో మెజారిటీ వాటా ఉన్న విషయం తెలిసిందే. ఎస్‌బీఐ క్యాపిటల్ ఈ బిడ్డింగ్ ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నదని ఈ సందర్భంగా ఎస్‌బీఐ తెలియజేసింది. మరోవైపు జెట్ ఎయిర్‌వేస్ కోసం అమెరికా, బ్రిటన్ సంస్థలతో కలిసి నరేశ్ గోయల్ బిడ్డింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తున్నది. ఎతిహాద్ ఎయిర్‌వేస్ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకులకు 51 శాతం వాటా ఉండగా, గోయల్ దంపతులకు 24 శాతం, ఎతిహాద్‌కు 12 శాతం వాటాలున్నాయి. 13 శాతం ఇతరత్రా వాటాదారులకున్నది.

ఆదుకోవాలని ప్రధానికి సిబ్బంది విజ్ఞప్తి

జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభు త్వం జోక్యం చేసుకోవాలని సంస్థ ఉద్యోగులు కోరుతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. జెట్ ఎయిర్‌వేస్ పైలెట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (నాగ్) ఉపాధ్యక్షుడు అదిమ్ వలియాని ఇక్కడి సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద విలేఖరులతో మాట్లాడుతూ 20 వేల మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ ఇబ్బందులపై దృష్టి పెట్టాలని, తమకు న్యాయం చేయాలని ప్రధానిని కూడా కోరినట్లు తెలిపారు.

18దాకా అంతర్జాతీయ సర్వీసుల్లేవ్

బ్యాంకుల నుంచి సాయం రాని నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగించబడింది. ఈ నెల 18దాకా అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ సోమవారం ప్రకటించింది. నిజానికి సోమవారం వరకే వాయిదా వేస్తున్నట్లు జెట్ గతంలో చెప్పింది. అయితే తాజాగా మరో మూడు రోజులు పొడిగిస్తూ విదేశీ విమాన సర్వీసులను గురువారం వరకు ఆపేస్తున్నామని సంస్థ సీఈవో దూబే స్పష్టం చేశారు. జెట్ ఎయిర్‌వేస్ తమ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వని విషయం తెలిసిందే. జనవరి, ఫిబ్రవరి జీతాలతోపాటు మార్చి జీతాన్నీ ఇంతవరకు ఉద్యోగులకు అందించలేదు. రూ.8,000 కోట్లకుపైగా రుణ భారాన్ని మోస్తున్న జెట్ ఎయిర్‌వేస్.. ఒకప్పుడు గరిష్ఠంగా 124 విమానాలను నడిపింది. ఇప్పుడు 6 విమానాలకు పడిపోయింది. ఈ నెల 13 నుంచి జెట్ విదేశీ విమానాలు రైద్దెపోగా, దేశీయంగా రోజుకు 50 సర్వీసులు కూడా తిరుగడం లేదు.

5364
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles