జెట్ కథ కంచికి?

Wed,April 17, 2019 01:01 AM

Jet Airways stops jet flights as lenders waver about aid

-కానరాని పునరుద్ధరణ అవకాశాలు
-సాయంపై ఇంకా నిర్ణయం తీసుకోని బ్యాంకులు
-పీఎన్‌బీ ఎండీ మెహెతా వెల్లడి
-రూ.400 కోట్ల అత్యవసర నిధుల కోసం సంస్థ ప్రయత్నాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: జెట్ ఎయిర్‌వేస్ మూతబడనుందా?.. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ సంస్థ కోలుకునే అవకాశాలే కనిపించడం లేదుమరి. మేమున్నామంటూ ముందుకొచ్చిన బ్యాంకులు సైతం వెనుకడుగు వేస్తుండటంతో జెట్ ఎయిర్‌వేస్ కథ ఇక కంచికేనా అన్న సంకేతాలు వస్తున్నాయి. మంగళవారం ఇక్కడ జరిగిన జెట్ ఎయిర్‌వేస్ బోర్డు సమావేశం అనంతరం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఎండీ సునీల్ మెహెతా విలేఖరులతో మాట్లాడుతూ జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు రుణదాతలు కట్టుబడి ఉన్నారు. అయితే దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ నేతృత్వంలోని జెట్ ఎయిర్‌వేస్‌కు అప్పులిచ్చిన 26 మంది రుణదాతల్లో పీఎన్‌బీ కూడా ఒకటి. జెట్ ఎయిర్‌వేస్ రుణ భారం రూ.8,000 కోట్లకుపైగా ఉన్న విషయం తెలిసిందే. జెట్ పునరుద్ధరణ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ పునరుద్ధరణ ప్యాకేజీని పరిశీలిస్తున్నది అని మెహెతా చెప్పారు. బ్యాంకుల నుంచి రూ.1,500 కోట్ల ఆర్థిక సాయం అందకపోవడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులను గురువారందాకా నిలిపివేస్తున్నట్లు సోమవారం జెట్ ఎయిర్‌వేస్ సీఈవో వినయ్ దూబే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన సంస్థలోని 20 వేలకుపైగా ఉద్యోగులకు ఓ లేఖలో సమాచారం అందించిన సంగతీ విదితమే.

ఎగురుతున్నవి ఐదు విమానాలే

ప్రస్తుతం నడుస్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానాలు ఐదేనని పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా మంగళవారం ఇక్కడ స్పష్టం చేశారు. బ్యాంకుల నుంచి రూ.400 కోట్ల అత్యవసర నిధుల కోసం జెట్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. జెట్ ఎయిర్‌వేస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై, ఈ సంక్షోభం నేపథ్యంలో దేశీయ విమానయాన రంగంలో ఏర్పడిన పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తున్నదనీ ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా, నడుస్తున్న ఈ విమానాలు కూడా ఏటీఆర్ (చిన్న శ్రేణి విమానాలు)లు కావడం గమనార్హం. బకాయిలు చెల్లించకపోవడంతో చమురు సంస్థలు అరువుపై ఇంధన సరఫరాను నిలిపివేయగా, డబ్బులిచ్చి కొనలేక భారీ విమానాలన్నీ ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి.

18న జెట్ పరిణామాలపై సమీక్ష

పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు.. జెట్ ఎయిర్‌వేస్ పరిణామాలపై సమీక్షకు ఆదేశించారు. పెరుగుతున్న విమాన టిక్కెట్ ధరలు, రద్దవుతున్న సర్వీసులుసహా జెట్‌కు సంబంధించిన సమస్యలను సమీక్షించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఖరోలా తెలియజేశారు. ఈ నెల 18 (గురువారం)న ఎయిర్‌లైన్స్, విమానాశ్రయాల ప్రతినిధులతో సమావేశం ఉంటుందని, టిక్కెట్ ధరల తగ్గింపు, ఎయిర్‌పోర్టుల సామర్థ్యం విస్తరణ వంటి అంశాలపై చర్చ ఉంటుందని చెప్పారు. ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుం డా, వారి భద్రత, హక్కుల విషయంలో రాజీ పడకుండా అన్ని చర్యలను తీసుకోవాలని ప్రభు ఆదేశించినట్లు ఖరోలా స్పష్టం చేశారు.

బోయింగ్ 777 విమానాల జప్తు?

జెట్ ఎయిర్‌వేస్ కష్టాలను అమెరికా ఎగ్జిమ్ బ్యాంక్ మరింత పెంచేసింది. బోయింగ్ 777 విమానాలను కొనేందుకు గతంలో పొడిగిస్తామన్న అన్ని రుణాలను నిలిపివేసిన బ్యాంకు.. ఇప్పటికే ఇచ్చిన అప్పుల వసూలుకు ఉన్న బోయింగ్ విమానాలనూ హస్తగతం చేసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి జెట్ ఎయిర్‌వేస్ దాదాపు రూ.2,000 కోట్ల రుణాలను తీసుకున్నది. ఈ క్రమంలోనే జెట్ ఎయిర్‌వేస్‌కున్న 10 బోయింగ్ 777 విమానాలను ఎగ్జిమ్ బ్యాంక్ స్వాధీనం చేసుకునే వీలుందని తెలుస్తున్నది. దీనిపై అటు ఎగ్జిమ్ బ్యాంక్‌ను, ఇటు జెట్ ఎయిర్‌వేస్‌ను సంప్రదించినా సమాధానం లేదు. 25 ఏండ్లకుపైగా నడిచిన జెట్ ఎయిర్‌వేస్.. ఒకప్పుడు గరిష్ఠంగా 124 విమానాలతో సేవలందించింది. అయితే ప్రస్తుతం 5 విమానాలను నడుపుతున్నది. ఇవి కూడా రేపోమాపో నిలిచిపోయే అవకాశాలున్నాయి. కాగా, మంగళవారం జెట్ షేర్ల విలువ 8 శాతం వరకు నష్ట పోయింది. ఒకానొక దశలో దాదాపు 19 శాతం పడిపోయింది.

టిక్కెట్ ధరల్ని తగ్గించండి: డీజీసీఏ

జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం నేపథ్యంలో పెరుగుతున్న విమాన చార్జీలపై విమానయాన రంగ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దృష్టి సారించింది. టిక్కెట్ ధరలు, ఇతరత్రా సేవల విలువల్లో రోజువారి మార్పులను గమనిస్తున్న డీజీసీఏ.. రద్దీ ఎక్కువగా ఉన్న పది మార్గా ల్లో చార్జీలను ఆమోదయోగ్య స్థాయిలోనే ఉంచాలని ఎయిర్‌లైన్స్‌ను కోరినట్లు ఖరోలా చెప్పారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలుగకుండా, వారిపై భారం పెరుగకుండా ఎయిర్‌లైన్స్ సంస్థలతో డీజీసీఏ చర్చలు కూడా జరుపుతుందని మంగళవారం ఇక్కడ ఆయన వెల్లడించారు. జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు గణనీయంగా పడిపోగా, పెరిగిన ప్యాసింజర్ల రద్దీతో ఇతర విమానయాన సంస్థలు ఒక్కసారిగా టిక్కెట్ ధరలను పెంచేసిన విషయం తెలిసిందే.

గోయల్ బిడ్ వేయలేదు

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్.. బ్యాంకర్లు నిర్వహించిన వాటా విక్రయ బిడ్డింగ్‌లో పాల్గొనలేదని తెలుస్తున్నది. ఆయన అసలు బిడ్ దాఖలు చేయలేదని మంగళవారం సంబంధిత వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ నెల 12న బిడ్డింగ్ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ బిడ్డింగ్‌లో గోయల్ కూడా పాల్గొన్నారన్న వార్తలు వచ్చాయి. విదేశీ సంస్థలతో కలిసి బిడ్ వేసినట్లు ప్రచారం జరిగింది. జెట్ ఎయిర్‌వేస్ బోర్డు నుంచి గోయల్ దంపతులు గత నెల తప్పుకున్న సంగతి విదితమే. గోయల్‌తోపాటు, సంస్థలో వాటా ఉన్న ఎతిహాద్ ఎయిర్‌వేస్ షేర్లను అప్పులిచ్చిన రుణదాతలు తీసుకుని మెజారిటీ భాగస్వాములుగా అవతరించినదీ తెలిసిందే. ఈ క్రమంలోనే రుణాల వసూళ్లలో భాగంగా తమ వాటాలను విక్రయించేందుకు బ్యాంకులు బిడ్డింగ్ నిర్వహించాయి. ఎస్‌బీఐ క్యాపిటల్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా, త్వరలోనే బిడ్డర్ల వివరాలను విడుదల చేస్తామని సోమవారం ఎస్‌బీఐ ప్రకటించినది తెలిసిందే. సంస్థలో 75 శాతం వరకు వాటాను సొంతం చేసుకునేలా బిడ్డర్లు ఉండాలని బ్యాంకులు అంటున్నాయి.

ఉద్యోగుల్లో సన్నగిల్లిన విశ్వాసం

జెట్ ఎయిర్‌వేస్ మనుగడపై ఆ సంస్థ ఉద్యోగుల్లో విశ్వాసం సన్నగిల్లింది. వరుస ప్రతికూల పరిణామాల మధ్య ఇప్పటికే ఇతర ఎయిర్‌లైన్స్ వైపు చూస్తున్న ఉద్యోగులు.. తమ వేతన బకాయిల వసూలుకు యాజమాన్యంపై న్యాయ పోరాటానికీ తెరతీస్తున్నారు. బ్యాంకుల చేతికి మెజారిటీ వాటా చేరడంతో అంతా సర్దుకున్నట్లే అనుకున్న జెట్ సిబ్బంది ఆనందం ఎంతోసేపు నిలువలేదు. తక్షణ అవసరాల నిమిత్తం రూ.1,500 కోట్ల సాయం చేస్తామన్న బ్యాంకర్లు.. వెనుకడుగు వేస్తుండటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినైట్లెంది. మేము మా బకాయిల వసూలు కోసం లేబర్ కమిషనర్ వద్దకు వెళ్తున్నాం. ఇక ఓపిక పట్టే స్థితిలో మేము లేము అని రోజువారి ఖర్చుల కోసం తన ఎల్‌ఐసీ పాలసీపై రుణం తీసుకున్న ఓ ఇంజినీర్ మంగళవారం చెప్పారు. జెట్ ఎయిర్‌వేస్ షేర్ల విలువ ఉన్నట్టుండి భారీగా పడిపోయింది. ఇక సంస్థ పనైపోయిందన్న సంకేతాలు వస్తున్నాయి. త్వరలోనే అన్ని విమాన సర్వీసులు ఆగిపోనున్నాయి అని ఆయన ఒకింత నిరాశ, నిస్పృహలతో మాట్లాడారు. అన్ని ర్యాంకుల్లోని ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ పైలెట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (నాగ్) ఉపాధ్యక్షుడు కెప్టెన్ అసిం వలియాని అన్నారు. దాదాపు నాలుగు నెలలుగా జీతాలు రాక పిల్లల చదువు, ఈఎంఐ, మెడిక్లయిములకు ఆటంకం ఏర్పడుతున్నదని తెలిపారు. మాకు రావాల్సిన బకాయిలు వస్తాయన్న నమ్మకం లేదు. భవిష్యత్తు అంధకారంగా ఉన్నది. దివాలా చట్టంలోకి సంస్థను తీసుకళ్లైనా మా వేతన బకాయిలను ఇప్పించాలని ప్రభు త్వాన్ని కోరుతున్నాం అని మరో పైలట్ తెలియజేశారు.

1146
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles