మూతపడ్డ జెట్

Thu,April 18, 2019 01:07 AM

Jet Airways temporary closure a setback for Indian aviation

-అత్యవసర నిధులివ్వని బ్యాంకులు
-అర్ధరాత్రి నుంచి విమాన సేవలు బంద్
-తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించిన యాజమాన్యం
ముంబై, ఏప్రిల్ 17: జెట్ ఎయిర్‌వేస్ మూతబడింది. బ్యాంకుల నుంచి అత్యవసర సాయం అందకపోవడంతో బుధవారం అర్ధరాత్రి నుంచి విమానయాన సేవల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. నాలుగు నెలలకుపైగా నగదు కొరతను ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్‌వేస్.. కనీస అవసరాల కోసం రూ.400 కోట్లు ఇవ్వాలని రుణదాతలను వేడుకున్నది. అయితే ఈ విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది. మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకర్ల కమిటీ మధ్యంతర సాయాన్ని అందించలేమని తేల్చిచెప్పాయి. ఈ క్రమంలోనే వేరే గత్యంతరం లేని యాజమాన్యం.. ఈ బలవంతపు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. మంగళవారం బోర్డు సమావేశంలోనే బ్యాంకులు తక్షణ సాయానికి నో చెప్పగా, ఆ తర్వాత జెట్ చేసిన చివరి ప్రయత్నానికీ భంగపాటు తప్పలేదు. నిజానికి రుణాలను ఈక్విటీగా మార్చుకుని సంస్థలో మెజారిటీ వాటాను పొందిన బ్యాంకర్లు.. తక్షణ సాయంగా రూ.1,500 కోట్లను అందిస్తామని ప్రకటించారు. దీంతో జెట్ సిబ్బందిలో కొత్త ఆశలు చిగురించగా, ఆ తర్వాత రుణదాతలు మొహం చాటేయడంతో అవికాస్తా ఆవిరైపోయాయి.

రోడ్డునపడ్డ 20 వేల ఉద్యోగులు

జెట్ ఎయిర్‌వేస్ మూతబడటంతో అందులో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. వివిధ విభాగాల్లో 20,000 మంది పనిచేస్తుండగా, ఇప్పుడు వారి భవితవ్యంపై తమ వద్ద ఎలాంటి సమాధానం లేదని జెట్ ఎయిర్‌వేస్ సీఈవో వినయ్ దూబే అన్నారు. దీంతో ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. డిసెంబర్ నుంచి జెట్ ఎయిర్‌వేస్ తమ సిబ్బందికి జీతా లివ్వనిది తెలిసిందే. ఇప్పటికే పైలెట్లు వేతన బకాయిలపై రోడ్డెక్కగా, కేంద్రం జోక్యాన్నీ అభ్యర్థించిన సంగతీ విదితమే. ఓ జెట్ ఉద్యోగి కూతురు తన తండ్రి ఉద్యోగం పోతే తమ కలలపై రాజీపడ్డట్లేనంటూ ఓ ఆన్‌లైన్ పిటిషన్‌లో రాయడం అందరినీ ఆలోచింపజేస్తున్నది.

సాయానికి ప్రయత్నిస్తాం: కేంద్రం

ప్రస్తుత విధివిధానాలకు లోబడి జెట్ ఎయిర్‌వేస్‌కు సాయం అందేలా కృషి చేస్తామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ప్రయాణీకులకూ వేలాది కోట్ల రూపాయలను రిఫండ్ చేయాల్సి ఉన్న క్రమంలో డీజీసీఏ ఈ అంశంపై దృష్టి సారిస్తుందని, రద్దయిన విమాన ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లనూ అధికారులు చూస్తారని ఈ సందర్భంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు జెట్ ఎయిర్‌వేస్ మూతబడటం.. భారతీయ విమానయాన రంగానికి ఎదురుదెబ్బేనని ఎయిర్ ఇండియా సీఎండీ అశ్వని లోహానీ ఆందోళన వ్యక్తం చేశారు.

చివరి విమానం ఢిల్లీకి..

షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రి 10:30 గంటలకు అమృత్‌సర్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి జెట్ విమానం బయలుదేరింది. అయితే ఇదే జెట్ చివరి సర్వీసు అని సంస్థ ప్రకటించింది. అర్ధరాత్రి నుంచి విమానాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోతాయని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 25 ఏండ్లకుపైగా దేశీయ విమానయాన రంగంలో జెట్ ఎయిర్‌వేస్ సేవలు కొనసాగాయి. 1992 ఏప్రిల్ 1న స్థాపించబడిన జెట్ ఎయిర్‌వేస్.. 1993 మే 5న విమాన సేవల్ని ఆరంభించింది. రూ.8,500 కోట్లకుపైగా రుణ భారాన్ని మోస్తున్న జెట్.. ఈ 13 నుంచే అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో దేశీయ సేవలకూ బుధవారం తాత్కాలికంగా గుడ్‌బై చెప్పింది.

ఇది మా ఖర్మ


-అప్పుడు కింగ్‌ఫిషర్.. ఇప్పుడు జెట్ ఎయిర్‌వేస్
-ఎయిర్ ఇండియాకు ఓ నీతి.. ఇతర సంస్థలకు మరో నీతి
-నరేశ్ గోయల్‌కు సంఘీభావంగా విజయ్ మాల్యా వ్యాఖ్యలు
లండన్, ఏప్రిల్ 17: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు అన్యాయం చేశారని, ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించిందని మరోసారి విజయ్ మాల్యా ఏకరువు పెట్టారు. జెట్ ఎయిర్‌వేస్ పరిణామాలపై స్పందిస్తూ ఆ సంస్థ వ్యవస్థాకుడు నరేశ్ గోయల్‌కు సోషల్ మీడియా వేదికగా మాల్యా సంఘీభావం తెలిపారు. నాడు కింగ్‌ఫిషర్, నేడు జెట్ ఎయిర్‌వేస్‌పట్ల కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ నీతిని ప్రదర్శించిందని, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు ఓ నీతి.. ఇతర సంస్థలకు మరో నీతిని పాటిస్తున్నదని ట్విట్టర్ ద్వారా విమర్శించారు. కాగా, ఈ సందర్భంగా బ్యాంకులకు తానుపడిన బకాయిలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా బకాయిపడగా, వాటిని ఎగవేసి మాల్యా విదేశాలకు పారిపోయారన్న ఆరోపణలున్న సంగతి విదితమే.

నేను జైలు శిక్షకు భయపడను..

జైలు శిక్షకు భయపడే బ్యాంకుల రుణాలను తీర్చుతానంటున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదన్న మాల్యా నేను లండన్‌లో ఉన్నా.. భారతీయ జైళ్లలో ఉన్నా బకాయిలను చెల్లిస్తా అని అన్నారు. మరోవైపు బకాయిలను వసూలు చేసుకోవడానికి భారతీయ బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడంలో భాగంగా బ్రిటన్ కోర్టును మెప్పించడంలో మాల్యా విఫలమయ్యారు.

1205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles