అగ్రస్థానంలో ఆల్టో

Sat,March 23, 2019 01:15 AM

Maruti makes clean sweep of top six spots

-ప్యాసింజర్ వాహన విక్రయాల్లో టాప్-10లో ఆరు మారుతివే

న్యూఢిల్లీ, మార్చి 22: దేశవ్యాప్తంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనాల్లో మారుతి హవా కొనసాగుతున్నది. కంపెనీకి చెందిన ఎంట్రీ లెవల్ కారైన ఆల్టో మల్లీ తొలి స్థానానికి చేరుకున్నది. ఫిబ్రవరిలో 24,751 యూనిట్లతో అగ్రస్థానం దక్కించుకున్నదని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో 19,941 యూనిట్లతో రెండో స్థానంలో ఉన్న ఆల్టో ఈసారి తొలిస్థానాన్ని దక్కించుకున్నది. టాప్-10లో తొలి ఆరు స్థానాల్లో మారుతికి చెందిన కార్లు ఉండటం విశేషమని పేర్కొంది. 2018 ఫిబ్రవరిలో మారుతికి చెందిన డిజైర్ తొలి స్థానంలో నిలువగా, ఈసారి 15,915 యూనిట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. మిగతా కార్ల విషయానికి వస్తే తొలి స్థానంలో ఆల్టో ఉండగా, కంపెనీకి చెందిన హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ 18,224 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే మరో హ్యాచ్‌బ్యాక్ బాలెనో 17,944 యూనిట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉండగా, నూతన వ్యాగన్‌ఆర్ 15,661 యూనిట్లు అమ్ముడై ఐదో స్థానం లభించింది. గతేడాది కూడా వ్యాగన్‌ఆర్ ఇదే స్థానంలో ఉన్నది. మారుతికి చెందిన మరో ఎస్‌యూవీ విటారా బ్రెజ్జా ఆరో స్థానం వరించింది. 11,631 యూనిట్లు అమ్ముడైనట్లు సియామ్ వెల్లడించింది. కాగా, హ్యుందాయ్ మోటర్‌కు చెందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20 ఈ జాబితాలో ఏడో స్థానం దక్కించుకున్నది. గడిచిన నెలలో 11,547 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదేనెలలో నమోదైన ఆరో స్థానంతో పోలిస్తే ఒక స్థానం పడిపోయింది. హ్యుందాయ్‌కు చెందిన మరో కారు క్రెటా ఎనిమిదో స్థానంలో నిలువుగా, కాంప్యాక్ట్ కారు గ్రాండ్ ఐ10కు ఆ తర్వాతి స్థానం లభించింది. ఈ జాబితాలో తొలిసారిగా టాటా మోటార్స్‌కు చెందిన టియోగాకు స్థానం దక్కింది. 8,286 యూనిట్లతో చివరి స్థానంలో నిలిచింది. మహీంద్రా, రెనోలు ఈ జాబితా నుంచి వైదొలిగాయి.

1232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles