భళారే.. మేఘా

Tue,August 13, 2019 12:56 AM

Megha Engineering to set up worlds largest underground pump house

-కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుతాలు

హైదరాబాద్, ఆగస్టు 12: తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మేఘా ఇంజినీరింగ్ అద్భుతాలను సృష్టిస్తున్నది. భూగర్భంలో ఆవిష్కృతమైన ఈ ప్రాజెక్టు.. ఓ ఇంజినీరింగ్ కళాఖండమే. ఈ మానవ నిర్మిత అద్భుతానికి తమ సాంకేతిక శక్తి, సామర్థ్యాలను మేఘా జోడించడంతో ప్రపంచ శ్రేణి నిర్మాణాల్లో ఒకటైంది. అదే కాళేశ్వరం పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామం వద్ద భూగర్భాన్ని తొలిచి నిర్మించిన లక్ష్మీపూర్ (గాయత్రి) భూగర్భ పంపింగ్ కేంద్రం. ప్రపంచంలో ఇంత పెద్ద నీటి పంపింగ్ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు. ఒక్కో మిషన్ వారీగా చూస్తే సామర్థ్యం 139 మెగావాట్లు కావడంతో ప్రపంచంలో ఇదే పెద్దది. మొత్తం పంపింగ్ కేంద్రం ప్రకారం చూసినా 973 మెగావాట్లతో ముందుంటుంది. ఇందులో వినియోగించిన ఎలక్ట్రికల్ మోటర్ పంప్ హౌజ్.. ప్రపంచంలోని ఏ రంగంలోనూ లేదంటే అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి ఈ పంపింగ్ కేంద్రం, మేఘా స్థాయి ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు. ఈ భూగర్భ పంపింగ్ కేంద్రంలోని 5వ పంపు నుంచి నీటి పంపింగ్‌ను ఆదివారం రాత్రి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. సుమారు 52 నిమిషాలు నడిపించారు. మొత్తం పంపు డిశ్చార్జ్ 89.73 క్యుమెక్స్. ఆదివారం పంపు చేసిన నీటి పరిమాణం మొత్తం 98,85,303 ఘనపుటడుగులు. అంటే సుమారు 28 కోట్ల లీటర్ల నీటిని 111 మీటర్ల ఎత్తుకు పంపు చేశారు. సోమవారం నాలుగో మోటరు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసింది.

ఈఫిల్ టవర్ కన్నా పెద్దది..

లక్ష్మీపూర్ (గాయత్రి) భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం పొడవు ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ పొడవు కన్నా ఎక్కువ. ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు అవగా, ఈ పంప్ హౌజ్ పొడవు 327 మీటర్లు. ఇక కోల్‌కతాలోని దేశంలోనే అతిపొడవైన భవంతి ది 42 కంటే ఈ పంప్ హౌజ్ లోతు ఎక్కువ. ది 42 పొడవు 260 మీటర్లు. ఈ పంప్ హౌజ్ ఎంత లోతైనదో తెలిస్తే విస్తుపోక తప్పదు. ఈ పంప్ హౌజ్ నిర్మాణం కోసం భూగర్భాన్ని తొలిచి 2.3 కోట్ల ఘనపు మీటర్ల మట్టిని మేఘా ఇంజినీరింగ్ బయటకు తీసింది. మొత్తంగా లక్ష్మీపూర్ (గాయత్రి) భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులు. ఈ పంప్ హౌజ్ నిర్మాణం కోసం 6 వేల టన్నుల స్టీల్‌తోపాటు 50 వేల టన్నుల సిమెంట్ కాంక్రీట్ వినియోగించారు.

మూడున్నరేండ్లలోనే

అసలు ఎత్తిపోత పథకాలే ఇంత పెద్ద స్థాయిలో, భారీ శక్తి సామర్థ్యాలతో భూ ఉపరితలంపై కూడా ఇప్పటికీ ఎక్కడా లేవు. అటువంటిది ఇక్కడ భూగర్భంలో ప్రపంచంలోనే పెద్దది నిర్మించడం.. అందులోనూ రోజుకు కనీసం 2 టీఎంసీల నుంచి గరిష్ఠంగా 4.5 టీఎంసీలను 111.4 మీటర్ల ఎగువకు పంప్ చేయడం అనేది అసామాన్యమైనది. సవాళ్లను ఎదుర్కొని తన శక్తి సామర్థ్యాలతో మేఘా ఇంజనీరింగ్ ఈ పంపింగ్ కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చింది. అదీ కేవలం మూడున్నరేండ్లలోనే. సాధారణ పథకాల నిర్మాణాలు సైతం దశాబ్దాల సమయం పడుతున్న పరిస్థితుల్లో ఈ పథకంతోపాటు ఈ పంపింగ్ కేంద్రాన్ని యుద్ధప్రాతిపదికన వేగంగా నిర్మించి రైతులకు అంకితం చేయడం మేఘా ఇంజనీరింగ్‌కే సాధ్యమైంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో 2 టీఎంసీల పంపింగ్‌కుగాను మొత్తం 4,627 మెగావాట్ల పంపింగ్ సామ ర్థ్యం అవసరం. మేఘా 3,057 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం కలిగిన పంపులను ఏర్పాటు చేస్తున్నది. సాగునీటి రంగంలో ఎత్తిపోతల పథకంలోని పంపులకు ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ సామర్థ్యం వ్యవస్థను ఏర్పాటు చేయడం ఓ రికార్డ్. దీని విద్యుత్ వినియోగ, పంపింగ్ సామర్థ్యం 973 మెగావాట్లు. విడివిడిగా చూస్తే శ్రీశైలంలోని రెండు జలవిద్యుత్ కేంద్రాల కన్నా, నాగార్జునసాగర్‌లో ఒక జలవిద్యుత్ కేంద్రం ఉత్పత్తి స్థాయి కన్నా దీని వినియోగం ఎక్కువ. ఈ భారీ పంప్ హౌజ్ విశిష్టత అంతా జంట టన్నెల్స్. ఈ రెండింటినీ పక్కపక్కనే 10 మీటర్ల వ్యాసంతో భూమిని తవ్వి ఒక్కో టన్నెల్‌ను 4,133 మీటర్ల పొడవుతో నిర్మించాం. సర్జ్‌పూల్, అదనపు సర్జ్‌పూల్ కూడా ప్రపంచంలోనే అతి పెద్దవి. భూగర్భంలో ఇంత భారీ ఎత్తున నిర్మాణాలు జరుగడం ప్రపంచంలో ఇదే తొలిసారి. 470 అడుగుల దిగువన 327 మీటర్లు పొడవు, 25 మీటర్ల వెడల్పు, 65 మీటర్ల ఎత్తుతో ఈ పంప్ హౌజ్ నిర్మాణం జరిగింది అని మేఘా డైరెక్టర్ బీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

1219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles