మైండ్‌ట్రీ 200% ప్రత్యేక డివిడెండ్

Thu,April 18, 2019 12:43 AM

Mindtree Q4 net up 8.9 per cent at Rs 198.4 crore

-నాలుగో త్రైమాసికంలో 9% పెరిగిన లాభం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: మధ్యస్థాయి ఐటీ సేవల సంస్థయైన మైండ్‌ట్రీ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ రూ.198.40 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ. 182.20 కోట్ల లాభంతో పోలిస్తే 8.9 శాతం వృద్ధి కనబరిచింది. బెంగళూరు కేంద్రస్థానంగా విధులు నిర్వహిస్తున్న కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 25.6 శాతం ఎగబాకి రూ.1,839.40 కోట్లకు చేరుకున్నది. 2017-18 ఏడాది ఇదే సమయంలో సంస్థ రూ.1,464 కోట్ల ఆదాయాన్ని గడించింది. ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎల్ అండ్ టీ..మైండ్‌ట్రీని కొనుగోలు చేయడం వివాదాస్పదమైనప్పటికీ బోర్డు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు మధ్యంతర డివిడెండ్ కింద రూ.3, ప్రత్యేక డివిడెండ్ కింద మరో రూ.20 లేదా 200 శాతం ప్రకటించింది. ప్రత్యేక డివిడెండ్ కోసం రూ.320 కోట్ల నిధులను వెచ్చించనున్న సంస్థ..మధ్యంతర డివిడెండ్ కోసం రూ.368 కోట్లను చెల్లించనున్నది.

మధ్యంతర డివిడెండ్ మే 10న, ప్రత్యేక డివిడెండ్‌ను అదే నెల 27న వాటాదారులకు చెల్లింపులు జరుపనున్నది. ఈ రెండింటికోసం వాటాదారుల అనుమతి తీసుకోనున్నది. సంస్థను ప్రారంభించి 20 ఏండ్లు పూర్తికావడం, అలాగే బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జించిన సందర్భంగా వాటాదారులకు భారీగా పంచింది. నాలుగో త్రైమాసికంలోనూ, మొత్తం ఏడాదిలోనూ సంస్థ అన్ని రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచిందని, ముఖ్యంగా ఒక్క ఏడాదిలో బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించిందని మైండ్‌ట్రీ సీఈవో, ఎండీ రోస్టో రావనన్ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం వల్లనే గడిచిన 20 ఏండ్లుగా నిలబడగలిగామన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.7,021.5 కోట్ల ఆదాయంపై రూ.754.10 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మైండ్‌ట్రీని ఎల్ అండ్ టీ కొనుగోలుపై త్వరలో ఏజీఎం జరుగనున్నదని, దీంట్లో వాటాదారులు తమ అభిప్రాయాన్ని వెల్లడించడానికి అవకాశం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు.

572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles