ఈ ఏడాది 5.6 శాతమే

Fri,November 15, 2019 03:05 AM

-దేశ జీడీపీపై మూడీస్ అంచనా

న్యూఢిల్లీ, నవంబర్ 14: ఈ ఏడాది దేశ జీడీపీ 5.6 శాతానికే పరిమితం కావచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. ఇంతకుముందు 5.8 శాతంగా అంచనా వేసిన విషయం తెలిసిందే. భారత ఆర్థిక మందగమనం మేము ఊహించిన దానికంటే తీవ్రంగానే ఉందని మూడీస్ ఒకింత ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. వృద్ధిరేటుపై గతంలో మేము వేసిన అంచనాల్ని సవరిస్తున్నాం. 2019లో దేశ వాస్తవిక జీడీపీ 5.6 శాతంగానే ఉండొచ్చు. 2018లో ఇది 7.4 శాతంగా ఉన్నది అని గురువారం మూడీస్ పేర్కొన్నది. అయితే వచ్చే ఏడాది లేదంటే ఆపై ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన మూడీస్.. 2020లో 6.6 శాతంగా, 2021లో 6.7 శాతంగా అంచనా వేసింది. దేశ ఆర్థిక వృద్ధిరేటు 2018 జూన్ నుంచి మందగిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో 5 శాతానికి పతనమైంది. నాడు దాదాపు 8 శాతంగా ఉండేది. నిరుద్యోగం కూడా పెరిగిపోయింది అని స్పష్టం చేసింది. పెట్టుబడులు నెమ్మదించాయని, వినియోగ సామర్థ్యం దెబ్బతిన్నదని పేర్కొన్నది. శుక్రవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) ద్వితీయ త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి.

21 సంస్థలకు నెగటివ్

21 దేశీయ ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థల ఔట్‌లుక్‌కూ మూడీస్ కోత పెట్టింది. ఎస్బీఐ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ సంస్థల ఔట్‌లుక్‌ను స్థిరం నుంచి ప్రతికూలానికి దిగజార్చింది. గత వారం భారత రేటింగ్స్ ఔట్‌లుక్‌ను సైతం మూడీస్ స్థిరం నుంచి ప్రతికూలానికి దించిన సంగతి విదితమే. అయితే దేశ స్థానిక, విదేశీ కరెన్సీ రేటింగ్స్‌ను మాత్రం బీఏఏ2 వద్ద స్థిరంగానే ఉంచింది.

ఇంకా తగ్గనున్న వడ్డీరేట్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరిన్ని వడ్డీరేట్ల కోతలకు దిగుతుందని మూడీస్ ఈ సందర్భంగా అంచనా వేసింది. వచ్చే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను ఆర్బీఐ మరింతగా తగ్గించే వీలుందని పేర్కొన్నది. ద్రవ్యోల్బణం ఆమోదయోగ్యంగానే ఉండటం, ముడి చమురు ధరలు అదుపులోనే ఉండటం.. ఆర్బీఐ వడ్డీరేట్ల కోతకు అవకాశాలను ఇస్తున్నాయి. అయితే బ్యాంకులు రుణాలపై ఆశించిన స్థాయిలో వడ్డీరేట్లను తగ్గించకపోవడం ప్రతికూలంగా మారిందని అభిప్రాయపడింది.

256
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles