ఎస్బీఐ రుణాలు మరింత చౌక

Thu,October 10, 2019 01:59 AM

-వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గించిన బ్యాంక్
-డిపాజిట్లపై కూడా 25 బేసిస్ పాయింట్లు కోత

ముంబై, అక్టోబర్ 9:బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులకు మరోసారి ఊరట కల్పించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్(ఎంసీఎల్‌ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించిన వారం రోజుల్లో ఎస్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. వీటితోపాటు లక్ష రూపాయల లోపు పొదుపు డిపాజిట్లపై వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రేటు 3.25 శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్ నుంచి) ఇప్పటి వరకు వడ్డీరేట్లను బ్యాంక్ తగ్గించడం ఇది ఆరోసారి. తగ్గించిన ఎంసీఎల్‌ఆర్ రేటు గురువారం(అక్టోబర్ 10) నుంచి అమలులోకి రాగా, పొదుపు ఖాతాలపై డిపాజిట్ రేట్ల తగ్గింపు నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నదని తెలిపింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై చెల్లించే వడ్డీరేటు 8.15 శాతం నుంచి 8.05 శాతానికి తగ్గనున్నది. కానీ, ఈ రుణాలు అక్టోబర్ 1 నుంచి రెపో రేటుతో అనుసంధానం అయి ఉండాలి. ప్రస్తుత పండుగ సీజన్‌లో ఖాతాదారులకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలనే ఉద్దేశంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటితోపాటు పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను కూడా 3.50 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గించింది. ఈ నెల 10 నుంచి అమలులోకి వచ్చేలా రిటైల్, బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను కూడా 10 బేసిస్ పాయింట్ల నుంచి 30 బేసిస్ పాయింట్ల వరకు కుదించింది. కాగా, గతవారంలో రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను పావు శాతం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో రుణ రేటు పదేండ్ల కనిష్ఠ స్థాయి 5.15 శాతానికి తగ్గింది.

571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles