జియోహో

Tue,August 13, 2019 01:12 AM

Mukesh Ambani unveils Jio Fiber & the mother of all set top boxes

-ఇక గిగా ఫైబర్ సేవలు
-వచ్చే నెల 5 నుంచి మొదలు
-వార్షిక చందాదారులకు సెట్ టాప్ బాక్స్‌తో ఎల్‌ఈడీ టీవీ ఉచితం
-ల్యాండ్ లైన్ ఫోన్లపై జీవితాంతం వాయిస్ కాల్స్ కూడా
-విడుదలైన రోజే కొత్త సినిమాలను ఇంట్లో చూసే అవకాశం

ఉచితంగా హెచ్‌డీ టీవీ లేదా 4కే ఎల్‌ఈడీ టీవీ ఇస్తారు.. దానికి సెట్‌టాప్ బాక్సు కూడా ఉచితమే! ల్యాండ్‌లైన్‌పై జీవితాంతం ఉచితంగానే కాల్స్ చేసుకోవచ్చు! జియో ఫస్ట్‌డే ఫస్ట్ షో ఆఫర్‌లో థియేటర్‌లో సినిమా విడుదలైన రోజే.. టీవీలో చూసే అవకాశం కల్పిస్తారు! ఇవన్నీ త్వరలో మార్కెట్‌లో పెనుసంచలనాలకు దారితీయనున్న రిలయన్స్ జియోఫైబర్‌లోని అద్భుతాలు! జియోతో టెలికం మార్కెట్‌ను ఒక కుదుపు కుదిపిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ఇప్పుడు జియోహో అనిపించేలా కొత్త సంచలనానికి తెరతీస్తున్నారు. సోమవారం ముంబైలో నిర్వహించిన సంస్థ వాటాదారుల 42వ వార్షిక సమావేశంలో జియోఫైబర్ అద్భుతాలను ఆవిష్కరించారు. ఈ ఫైబర్ సేవలు వచ్చే నెల ఐదో తేదీ నుంచి వార్షిక చందాదారులకు అందుబాటులోకి తెస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మార్కెట్‌లో కొమ్ములు తిరిగిన టెలికం ఆపరేటర్లు ఇప్పటికే రిలయన్స్ జియో దెబ్బకు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోగా.. తాజాగా డిష్ టీవీలు, కేబుల్ ఇంటర్నెట్, టెలివిజన్ పరిశ్రమలకు గట్టి షాకిచ్చారు ముకేశ్. అంతేగాక తమ చమురు శుద్ధి-రసాయనాల వ్యాపారంలో సౌదీ ఆరామ్కోకు 20 శాతం వాటాను, చమురు రిటైల్ వ్యాపారంలో బ్రిటిష్ పెట్రోలియంకు 49 శాతం వాటాను అమ్మేస్తున్నట్లు ముకేశ్ ఈ సందర్భంగా ప్రకటించారు. తద్వారా రూ.1.15 లక్షల కోట్లను పొందుతున్నట్లు చెప్పారు.

ముంబై, ఆగస్టు 12: రిలయన్స్ జియో.. 2016 సెప్టెంబర్ 5న మొదలై భారతీయ టెలికం రంగ ముఖచిత్రాన్నే మార్చేసిన సంచలనం. సరిగ్గా మూడేండ్ల తర్వాత మళ్లీ జియో ఫైబర్.. అదే తేదీన పరిచయం అవుతున్నది. ఇప్పుడు దీని టార్గెట్ డిష్ టీవీలు, కేబుల్ ఇంటర్నెట్, టెలివిజన్ పరిశ్రమలు. నాడు అనూహ్య ఆఫర్లతో వచ్చి కొమ్ములు దిరిగిన టెలికం ఆపరేటర్లను జియో కుదిపేయగా, ఈ సెప్టెంబర్ 5న జియో గిగా ఫైబర్ సైతం అలాంటి అద్భుతాలనే ఆవిష్కరించనున్నది. వార్షిక ప్లాన్లను ఎంచుకున్న కస్టమర్లకు 4కే సెట్ టాప్ బాక్స్‌తో ఏకంగా 4కే ఎల్‌ఈడీ హెచ్‌డీ టీవీనే సంస్థ అధిపతి ముకేశ్ అంబానీ ఫ్రీ ఆఫర్ చేశారు మరి. సోమవారం ఇక్కడ జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) వాటాదారుల 42వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో జియో ఫైబర్ అద్భుత ఆఫర్లను ఆయన ప్రకటించారు. రిలయన్స్‌ను ఇక మునుపెన్నడూ చూడని విధంగా చూడబోతున్నారన్న ముకేశ్.. వచ్చే నెల 5 నుంచి జియో ఫైబర్ సేవలు మొదలవుతాయని, నెలకు కేవలం రూ.700లకే హై-స్పీడ్ బ్రాడ్‌బాండ్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కనీస ఇంటర్నెట్ వేగం 100 ఎంబీపీఎస్ ఉండగా, గరిష్ఠ వేగం 1,000 ఎంబీపీఎస్ (1 జీబీపీఎస్). ధర కూడా రూ.10,000లుగా స్పష్టం చేశారు. అలాగే వార్షిక ప్లాన్లను కొనుగోలు చేసినవారికి సెట్ టాప్ బాక్స్‌లతో ఉచితంగా హెచ్‌డీ టీవీలను అందిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా తమ ల్యాండ్ లైన్ కస్టమర్లకు జీవితాంతం ఉచిత వాయిస్ కాల్స్ ఉంటాయన్న ముకేశ్.. అమెరికా, కెనడాలకు నెలకు రూ.500 చెల్లించి అపరిమిత అంతర్జాతీయ కాలింగ్ ప్యాక్‌ను పొందవచ్చని చెప్పారు. ప్రస్తుత మార్కెట్ ధరలతో పోల్చితే ఇది చాలాచాలా తక్కువని గుర్తుచేశారు. ఇక దేశంలోనే ప్రప్రథమంగా కొత్త సినిమాలను థియేటర్లలో విడుదలైన రోజే.. ఇంటిల్లిపాదీ ఇంట్లో కూర్చుని చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాం.

జియో ఫస్ట్ డే ఫస్ట్ షో పేరుతో పరిచయం కానున్న ఈ సేవలు.. వచ్చే ఏడాది మధ్య నుంచి అందరికీ అందుబాటులో ఉంటాయి అంటూ పెను సంచలనాన్నే ముకేశ్ సృష్టించారు. అయితే జియో ఫైబర్ ప్లాన్‌లో టీవీలు మాత్రమే కాకుండా డెస్క్‌టాప్‌లనూ భాగం చేస్తున్నామని సంస్థకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. రూ.700-10,000 నెలసరి ప్లాన్లలో కేబుల్ టీవీ సబ్‌స్క్రిప్షన్ భాగం కాదని, టీవీ సేవల కోసం ప్రత్యేకంగా వినియోగదారులు చెల్లించాలన్నారు. ఈ సేవలు కేబుల్ ఫైబర్ ద్వారాగానీ డీటీహెచ్ సర్వీస్ ద్వారాగానీ అందుతాయన్నారు. ఇక తొలి ఏడాదిలో 3.5 కోట్ల మంది కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పిన ఆయన 2 కోట్ల మంది గృహస్తులను, 1.5 కోట్ల మంది వ్యాపారస్తులను చేర్చుతామన్నారు. గత ఏజీఎంలో ప్రకటించినట్లుగానే జియో గిగా ఫైబర్ సర్వీస్.. టీవీల్లో అల్ట్రా-హై డెఫినేషన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను వీక్షకులకు అందించనున్నది. నిరుడు 41వ ఏజీఎంలో డిజిటల్ షాపింగ్, వర్చువల్ రియాల్టీ గేమింగ్, స్మార్ట్ హోం సొల్యూషన్లు, వాయిస్ యాక్టివేటెడ్ అసిస్టెన్స్‌ను గృహస్తులకు అందిస్తామని ముకేశ్ వాగ్ధానం చేసిన విషయం తెలిసిందే. దాన్ని ఈ సందర్భంగా ముకేశ్ నిలబెట్టుకున్నారన్న అభిప్రాయాలు.. తాజా ఏజీఎం తర్వాత వ్యక్తమవుతున్నాయి.
MukeshAmbani1

ఇప్పటికే 5 లక్షల గృహాలకు సేవలు

గత కొద్ది నెలలుగా జియో గిగా ఫైబర్ మౌలిక వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి సారించిన రిలయన్స్.. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో 5 లక్షల గృహాలకు ప్రయోగాత్మకంగా సేవలను ప్రారంభించారు. గతేడాది జియో ఫైబర్‌ను ప్రకటించిన దగ్గర్నుంచి దేశంలోని దాదాపు 1,600 నగరాలు, పట్టణాల నుంచి కోటిన్నరకుపైగా రిజిస్ట్రేషన్లను అందుకున్నామని ముకేశ్ ఈ సందర్భంగా తెలియజేశారు. జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్.. సిమ్ ప్రాధాన్య సెట్ టాప్ సర్వీసులను ఇంటి వద్దే అందించనుందని చెప్పారు.

సౌదీ ఆరామ్కోకు 20 శాతం వాటా

సంస్థకు కీలకమైన చమురు శుద్ధి-రసాయనాల వ్యాపారంలో సౌదీ చమురు దిగ్గజం ఆరామ్కో 20 శాతం వాటాను దక్కించుకుంటున్నది. ఇందుకుగాను దాదాపు 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.06 లక్షల కోట్లు)ను చెల్లిస్తున్నది. ఆర్‌ఐఎల్ చమురు-రసాయన విభాగం విలువను 75 బిలియన్ డాలర్లుగా లెక్కించి ఈ వాటాకు ఈ మొత్తాన్ని సౌదీ ఆరామ్కో ఇస్తున్నది. ఈ డీల్‌లో భాగంగా గుజరాత్‌లోని జమ్‌నగర్ వద్దనున్న రెండు రిలయన్స్ రిఫైనరీలకు దీర్ఘకాలిక ప్రాతిపదికన రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ప్రపంచ అతిపెద్ద క్రూడ్ ఎగుమతిదారైన సౌదీ ఆరామ్కో సరఫరా చేయనున్నది. ప్రస్తుతం సౌదీ అరేబియా నుంచి రిలయన్స్ కొంటున్న దానికి ఇది రెట్టింపు కావడం గమనార్హం.

బీపీ నుంచి రూ.7 వేల కోట్లు

తమ దేశీయ చమురు మార్కెటింగ్ వ్యాపారంలో బ్రిటీష్ పెట్రోలియం (బీపీ)కు 49 శాతం వాటాను విక్రయిస్తున్న రిలయన్స్.. అందుకుగాను ఆ సంస్థ నుంచి రూ.7 వేల కోట్లను పొందుతున్నది. గత వారం ఇరు సంస్థలు ఇందుకు సంబంధించి ఓ ఒప్పందాన్నీ చేసుకున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న 1,400 రిలయన్స్ పెట్రోల్ పంపులు, 31 విమానయాన ఇంధన స్టేషన్లు ఈ జాయింట్ వెంచర్‌లోకి వచ్చేస్తున్నాయి. వచ్చే ఐదేండ్లలో 5,500 పెట్రోల్ పంపుల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్న బీపీ, ఆర్‌ఐఎల్‌లు.. విమానయాన ఇంధనాన్నీ అమ్మనున్నాయి.

జమ్ము కశ్మీర్‌లో పెట్టుబడులు

జమ్ము కశ్మీర్‌లో పెట్టుబడులు పెడుతామని ముకేశ్ అంబానీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జమ్ము కశ్మీర్, లడఖ్‌లలో పెట్టుబడులకు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చిన క్రమంలో ముకేశ్ స్పందించారు. పర్యాటకం, వ్యవసాయం, ఐటీ, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని మోదీ ఆదివారం పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో రాబోయే రోజుల్లో రిలయన్స్ పెట్టుబడులు ఇక్కడ ఉంటాయని ముకేశ్ స్పష్టం చేశారు.

మైక్రోసాఫ్ట్‌తో జియో జట్టు

దేశవ్యాప్తంగా అతిపెద్ద డాటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి రిలయన్స్ జియో.. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో జతకట్టింది. భారతీయ సాంకేతిక రంగాన్ని మరో ఉన్నత శిఖరాలకు చేర్చాలనే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్‌తో కలిసి క్లౌడ్ డాటా సెంటర్ల ఏర్పాటు చేయనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. తద్వారా స్టార్టప్‌లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు తమ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించడానికి ఉచితంగా అత్యంత వేగవంతమైన డాటా సేవలు అందించనున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లు పెట్టే ఖర్చులో 80 శాతం క్లౌడ్, కనెక్టివిటీ మౌలిక సదుపాయాలకోసం ఖర్చు చేస్తున్నాయని, తద్వారా ఎంతో నష్టపోతున్నాయని, వీటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో నూతన సేవలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇందుకోసం వచ్చే జనవరి 1 నుంచి jio.com నుంచి స్టార్టప్‌లు రిజిస్టార్ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు. వ్యవసాయ, హెల్త్‌కేర్, విద్య, నైపుణ్యం అభివృద్ధి పరిచే స్టార్టప్‌లకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అంబానీ ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టులాంటి సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి సంస్థలు ప్రతి నెల రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు అవుతున్నదని, వీటి నుంచి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముకేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. అడ్వాన్స్ టెక్నాలజీతో దేశవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ ఒప్పందం దోహదం చేయనున్నదన్నారు. ఆ దిశగా రిలయన్స్ జియో తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.
MukeshAmbani2

2021 మార్చి ఆఖరుకల్లా అప్పులుండవ్

రుణ రహిత రిలయన్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ముకేశ్.. 18 నెలల్లో ఆ కల సాకారం అవుతుందని ప్రకటించారు. 2021 మార్చి 31 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై ఉన్న రుణ భారం మొత్తాన్ని తీర్చేస్తామని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విలువ దాదాపు 134 బిలియన్ డాలర్లుగా ఉందన్న ఆయన ఈ ఏడాది మార్చి 31 నాటికి సంస్థ నికర రుణాలు రూ.1,54,478 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. జూన్ 30 నాటికి రూ.2,88,243 కోట్లకు చేరగా, నగదు నిల్వలు రూ.1,31,710 కోట్లకు పడిపోయాయి. 2013 నుంచి ఇదే కనిష్ఠ స్థాయి. గత ఐదేండ్లలో రిలయన్స్ రూ.5.4 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టగా, ఇందులో అధిక శాతం రుణాల ద్వారా తీసుకున్నవే. ఈ క్రమంలోనే సౌదీ ఆరామ్కో, బీపీలకు వాటాలను విక్రయిస్తుండగా, రూ.1.15 లక్షల కోట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే 18 నెలల్లో రుణ రహిత రిలయన్స్‌ను చూస్తారంటూ వాటాదారులకు ముకేశ్ అభయమిచ్చారు.

జియో నంబర్ 2

టెలికం రంగంలో ప్రభంజనం సృష్టించిన రిలయన్స్ జియో..ఇక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) సేవలకు సిద్ధమవుతున్నది. మూడేండ్లలోపే 34 కోట్ల మంది టెలికం వినియోగదారులతో అగ్రస్థాయికి చేరుకున్న జియో..గృహాలకు, ఎంటర్‌ప్రైజెస్‌లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలతోపాటు చిన్న మధ్యతరహా పరిశ్రమలకు తక్కు వ ధరకే ఇంటర్నెట్ సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. భారత్‌లో అత్యంత వేగవంతమైన డాటా సేవలు అందించాలనే ఉద్దేశంతో మూడేండ్ల క్రితం టెలికం రంగంలోకి అడుగు పెట్టిన సంస్థ.. ఇప్పటి వరకు రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. జియోకు ముందు డార్క్ డాటాగా ఉన్న భారత దేశంలో ఆ తర్వాత జియో అంటే మేడి న్ ఇండియా డాటాగా మారిపోయిందని ముకేశ్ అంబానీ అన్నారు. వినియోగదారులను చూస్తుంటే భవిష్యత్తులో 50 కోట్లకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. భారత్‌లో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించిన జియో..ప్రపంచంలో రెండో అతిపెద్ద సంస్థగా రికార్డు సృష్టించిందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు దేశంలో ప్రముఖంగా ఉన్న బిట్స్ పిలానీ, మణిపాల్ అకాడమీలకు పోటీగా రిలయన్స్‌కు చెందిన జియో ఇనిస్టిట్యూట్‌లను ప్రపంచ స్థాయి విద్యా సంస్థలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు ముకేశ్ ప్రకటించారు. వచ్చే మూడేండ్లకాలంలో రూ.1,500 కోట్ల వరకు ఖర్చు చేయనున్నది.
MukeshAmbani3

ముఖ్యాంశాలు..

-18 నెలల్లో రుణ రహిత రిలయన్స్
-చమురు శుద్ధి, రసాయనాల వ్యాపారంలో సౌదీ ఆరామ్కోకు 20% వాటా అమ్మకం ద్వారా సంస్థకు రూ.1.06 లక్షల కోట్ల ఆదాయం
-వాటా కొనుగోలు తర్వాత రిలయన్స్ రిఫైనరీలకు రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును సరఫరా చేయనున్న సౌదీ ఆరామ్కో
-చమురు రిటైల్ వ్యాపారంలో బ్రిటిష్ పెట్రోలియంకు 49 శాతం వాటా విక్రయం ద్వారా రిలయన్స్ చేతికి రూ.7 వేల కోట్లు రాక
-రిలయన్స్ జియోపై పూర్తయిన పెట్టుబడులు, ఇప్పటిదాకా దాదాపు రూ.3.5 లక్షల కోట్లు మదుపు
-సెప్టెంబర్ 5 నుంచి జియో ఫైబర్ వాణిజ్య సేవలు మొదలు
-కనీస ఇంటర్నెట్ వేగం 100 ఎంబీపీఎస్.. గరిష్ఠం 1,000 ఎంబీపీఎస్
-ధరల శ్రేణి నెలకు రూ.700ల నుంచి రూ.10,000
-జియో ఫైబర్ ల్యాండ్ లైన్ ఫోన్ల నుంచి దేశవ్యాప్తంగా జీవితాంతం వాయిస్ కాల్స్ ఉచితం
-2020 మధ్య నుంచి జియో ఫస్ట్ డే ఫస్ట్ షో సేవలు
-వచ్చే ఏడాది స్టాక్ మార్కెట్లలోకి రిలయన్స్ రిటైల్, జియో
-భారతీయ సాంకేతిక పరివర్తన కోసం మైక్రోసాఫ్ట్‌తో కలిసి క్లౌడ్ డాటా సెంటర్ల ఏర్పాటు
-2030 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 10 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందన్న విశ్వాసం

మీ జీవితంలోకి జియో ఫైబర్, జియో సెట్ టాప్ బాక్స్‌ల అనుభవం ఓ ఎల్‌ఈడీ టీవీతో పరిచయమవబోతున్నది. మా కస్టమర్లకు ఎల్‌ఈడీ టీవీ ఉచితం మరి. జియో ఫైబర్ వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం. మా వార్షిక ప్లాన్లను ఎంచుకున్నవారు హెచ్‌డీ లేదా 4కే ఎల్‌ఈడీ టీవీ, 4కే సెట్ టాప్ బాక్స్‌లను పూర్తిగా ఉచితంగా అందుకుంటారు. అంతేగాక జీవితాంతం ఉచిత వాయిస్ కాల్స్‌ను ల్యాండ్ లైన్ ఫోన్ల ద్వారా పొందగలుగుతారు. ఇక థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలను మొదటి రోజే ఇంట్లో కూర్చుని చూసే అవకాశాన్ని మీకు అందిస్తున్నాం. 2020 మధ్య నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి
- ముకేశ్ అంబానీ

5236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles