నీరవ్‌మోదీ లీలలెన్నో

Fri,March 22, 2019 02:35 AM

Nirav Modi planned plastic surgery to Evade Arrest

-ప్లాస్టిక్ సర్జరీకి ప్రయత్నాలు
-పలు దేశాల పౌరసత్వానికి దరఖాస్తులు

న్యూఢిల్లీ, మార్చి 21: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను వేల కోట్ల రూపాయలు ముంచి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ.. తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలనే చేశాడు. వనౌటు పౌరసత్వం కోసం దరఖాస్తుతోపాటు సింగపూర్‌లో శాశ్వత నివాసం, పోలీసులు, న్యాయస్థానాల నుంచి రక్షణ పొందేలా బ్రిటన్‌లోని భారీ న్యాయ సంస్థలతో సంప్రదింపులు, చివరకు తన రూపాన్నే మార్చేలా ప్లాస్టిక్ సర్జరీకి కూడా యత్నించినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ రంగ బ్యాంకైన పీఎన్‌బీని మేనమామ మెహుల్ చోక్సీతో కలిసి రూ.14,000 కోట్లు మోసం చేసిన నీరవ్‌మోదీ.. గతేడాది జనవరిలో భారత్ నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటిదాకా.. అంటే దాదాపు ఈ 15 నెలల కాలంలో విచారణ నుంచి తప్పించుకోవడానికి నీరవ్ వేసిన వేషాలు, చేసిన మోసాలు అన్నీఇన్నీ కావు. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి తల దాచుకునే ప్రయత్నం చేసిన నీరవ్.. చివరకు భారత ఆర్థిక మోసగాళ్లకు నీడనిచ్చే బ్రిటన్‌కే చేరాడు. లండన్ నుంచే తన విదేశీ వ్యాపారాలను చూసుకుంటూ.. దొంగ పాస్‌పోర్టులపై తిరిగాడు.

ప్లాస్టిక్ సర్జరీ కోసం..


లండన్ వీధుల్లో ఇటీవల కనిపించిన దృశ్యాలు.. నీరవ్ వేషధారణ మారిందని స్పష్టం చేస్తున్నాయి. స్వదేశంలో నున్నగా షేవ్ చేసుకుని, నీట్‌గా క్రాఫ్ చేయించుకుని కనిపించిన నీరవ్.. పరాయి దేశంలో మాత్రం గడ్డం, మీసాలు, తల వెంట్రుకలు పెంచి తిరుగుతున్నాడు. పీఎన్‌బీ కేసు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో తన జాగ్రత్తల్లో తానున్న నీరవ్.. చివరకు ప్లాస్టిక్ సర్జరీకి కూడా ప్రయత్నించాడని తెలుస్తున్నది. ఎవరూ గుర్తుపట్టకుండా ముఖ కవలికలను మార్చుకునేందుకు చూశాడు. మంగళవారం తనను చూసి గుర్తుపట్టిన ఓ బ్యాంక్ ఉద్యోగి.. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులకు తెలిపినందునే నీరవ్ చిక్కిన విషయం తెలిసిందే. ఇక పీఎన్‌బీ కేసు నుంచి తప్పించుకునేందుకు బుధవారం వెస్ట్‌మినిస్టర్ కోర్టులో తానో బ్రిటన్ వాసిని అంటూ నిరూపించే విఫలప్రయత్నం నీరవ్ చేయడం గమనార్హం. తాను స్థానికంగా పన్ను లు చెల్లిస్తున్నానని, తనకంటూ చిరునామా ఉందని, ఓటు హక్కు కోసం బ్రిటన్ ఎన్నికల అధికారుల నుంచి ఆఫర్ కూడా వచ్చిందని న్యాయమూర్తికి తెలిపాడు. డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు కూడా పెట్టుకున్నాడు. ప్రస్తుతం కూడా నీరవ్ తరఫు న్యాయవాదులు కోర్టులో గతేడాది జనవరి నుంచి నీరవ్ లండన్‌లోనే ఉంటున్నాడని, అతని కుమారుడు ఇక్కడి స్కూల్‌లోనే ఐదేండ్లుగా చదువుతున్నాడని, ఓ వ్యాపారానికి సంబంధించి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం నీరవ్ బ్రిటన్ వచ్చాడని, లండన్ కేంద్రంగానే తన వ్యాపార బ్రాండ్ ఉందని వాదిస్తుండటం విశేషం.

చేతినిండా పాస్‌పోర్టులే


గతేడాది ఫిబ్రవరిలోనే నీరవ్ పాస్‌పోర్టును భారత్ రద్దు చేసింది. అప్పటికే లండన్‌కు చేరిన నీరవ్.. సదరు పాస్‌పోర్టు ఆధారంగా పొందిన ఇన్వెస్టర్ వీసాను విరివిగా ఉపయోగించుకున్నాడు. లండన్‌లో డైమండ్ హోల్డిం గ్స్ పేరిట ఓ వ్యాపారాన్నీ నమోదు చేశాడు. భారత్‌ది కాకుండా మొత్తం మూడు పాస్‌పోర్టులను కలిగి ఉన్న నీరవ్.. వాటిపైనే సింగపూర్, యూఏఈ, హాంకాంగ్, ఇతర కరేబియన్ దీవులకు ప్రయాణం చేసినట్లు బ్రిటన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. నీరవ్ అరెస్ట్ నేపథ్యంలో ఓ పాస్‌పోర్టును స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు స్వాధీనం చేసుకోగా, బ్రిటన్ హోం శాఖ జారీ చేసిన మరో పాస్‌పోర్టు గడువు తీరిపోయింది. డ్రైవింగ్ లైసెన్సు కోసం బ్రిటన్ డ్రైవింగ్, వెహికిల్ లైసెన్సింగ్ అథారిటీ (డీవీఎల్‌ఏ)కి ఇచ్చిన ఇంకో పాస్‌పోర్టు అక్కడే ఇరుక్కుపోయింది.

బ్రిటన్‌తో చురుగ్గా సంప్రదింపులు


నీరవ్ మోదీ అరెస్ట్ నేపథ్యంలో అతనికి వ్యతిరేకంగా ఉన్న చాలా సాక్ష్యాలను బ్రిటన్‌కు సమర్పిస్తున్నది భారత్. వీలైనంత త్వరగా అతన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. ఇంటర్‌పోల్ రెడ్-కార్నర్ నోటీసున్న నేపథ్యంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేలా నీరవ్ నడుచుకున్నాడని ఇప్పటికే వెస్ట్‌మినిస్టర్ కోర్టులో భారత్ తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) బలమైన వాదనలు వినిపిస్తున్నది. సీపీఎస్ వల్లే నీరవ్ బెయిల్‌ను కోర్టు తిరస్కరించి ఈ నెల 29దాకా కస్టడీని విధించిన సంగతి తెలిసిందే. కాగా, వెస్ట్‌మినిస్టర్ కోర్టు అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో సోమవారం సెంట్రల్ లండన్ పోలీస్ స్టేషన్‌లో నీరవ్‌ను సరెండర్ చేసేందుకు ఆయన తరఫు న్యాయవాదులు ఉత్తుత్తి ప్రయత్నాలు చేశారన్న ప్రచారం కూడా నీరవ్‌పై కోర్టు నమ్మకాన్ని పోగొట్టింది.
list

రద్దీ జైలులో..


ఒకప్పుడు భారతీయ శ్రీమంతుల్లో ఒకరిగా వెలుగొందిన నీరవ్ మోదీ.. ఇప్పుడు బ్రిటన్ కారాగారంలో కళావిహీనంగా కాలం గడుపుతున్నాడు. ఈసారి హోలీ నీరవ్ కలర్‌ఫుల్ జీవితాన్ని.. కటిక చీకటిగానే మార్చేసింది. నాడు సెలబ్రిటీలతో తిరిగిన నీరవ్.. నేడు విదేశీ ఖైదీలతో జైలు గదిని పంచుకుంటున్నా డు. బ్రిటన్‌లోని అత్యంత రద్దీ జైళ్లలో ఒకటైన నైరుతి లండన్‌లోగల హర్ మెజెస్టీస్ ప్రిషన్ వాండ్స్‌వర్త్‌కు నీరవ్‌ను తరలించారు.

వనౌటు ఆశ్రయం కోసం..


తూర్పు ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పసిఫిక్ ద్వీపపు దేశమే వనౌటు. ఇక్కడి పౌరసత్వం కోసం నీరవ్ దరఖాస్తు చేసుకున్నాడు. వనౌటు వాసిని అని చెప్పుకుని తిరిగేందుకు చూశాడు. ఇదే సమయంలో సింగపూర్‌లో శాశ్వత నివాసం కోసం కూడా గట్టిగానే ప్రయత్నించాడు. సింగపూర్‌లో నీరవ్‌కు వ్యాపారాలున్న విషయం తెలిసిందే. కరేబియన్ దీవుల వైపూ కన్నేశాడు. ఇక్కడే తన మేనమామ మెహుల్ చోక్సీ ఆశ్రయం పొందుతున్న సంగతి విదితమే. మరోవైపు తానుంటున్న లండన్‌లో వ్యాపార కార్యకలాపాలనూ సాగించాడు. వెస్ట్ ఎండ్‌లోగల ఓ లగ్జరీ ఫ్లాట్‌లో నివాసముంటున్న నీరవ్.. సమీపంలో ఓ ఆభరణాల దుకాణాన్ని తెరిచినట్లు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. తుదకు ఖర్మ కాలి దొరికితే న్యాయ పోరాటానికి పేరు మోసిన లాయర్లను నియమించుకున్నాడు.

2950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles