సమస్యల్ని పరిష్కరిస్తాం

Mon,August 12, 2019 02:24 AM

Nirmala Sitharaman to meet representatives of various sectors

-నిర్మాణరంగ ప్రతినిధులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల
-త్వరలోనే చర్యలు చేపడుతామని హామీ

న్యూఢిల్లీ, ఆగస్టు 11: నిర్మాణరంగంలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ పరిశ్రమల వర్గాలతో సమావేశమవుతున్నది. ఈ క్రమంలోనే ఆదివారం రియల్ ఎస్టేట్ వర్గాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. దీంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను రియల్టర్లు మంత్రి వద్ద ఏకరువు పెట్టారు. నగదు కొరత, స్తంభించిన ప్రాజెక్టులు, అమ్మకాల లేమి, అరకొర రుణ లభ్యత వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. మంత్రి ఈ సందర్భంగా రెండు సమావేశాలను ఏర్పాటు చేయగా, ఒకటి క్రెడాయ్, నరెడ్కోలతో, మరొకటి ఇండ్ల కొనుగోలుదారుల సంఘాలతో నిర్వహించారు. ఈ సమావేశంలో గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఆర్థిక వ్యవహారాలు, రెవిన్యూ, హౌజింగ్, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శులు, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), రెరా ప్రతినిధులూ హాజరైయ్యారు. ఈ సందర్భంగా నిర్మాణ రంగ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను పరిశ్రమ వర్గాల నుంచి మంత్రి అడిగి తెలుసుకున్నారు.

నిధులను అందించాలి

నిర్మాణ రంగం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నదని, అమ్మకాలు లేక నగదు కొరత వేధిస్తున్నదని క్రెడాయ్ చైర్మన్ జక్సే షా, అధ్యక్షుడు సతీశ్ మగర్, నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్ హీరానందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల నుంచి నిధులు అందేలా చొరవ చూపాలని మంత్రిని కోరారు. అప్పుడే నిలిచిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణ జరుగుతుందని చెప్పారు. సాధారణంగా రాబోయే పండుగ సీజన్‌లో అమ్మకాలు బాగుంటాయని, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు విక్రయాలు ఉంటాయి? అన్నదానిపై స్పష్టత లేకుందని చెప్పారు. కాగా, క్యాబినెట్ కార్యదర్శి నాయకత్వంలో ప్రత్యేకంగా ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించే వీలుందని సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే కొద్ది వారాల్లో సమస్యల పరిష్కారార్థం చర్చలుంటాయని సదరు వర్గాల ద్వారా తెలుస్తున్నది. మరోవైపు ఆగిపోయిన ప్రాజెక్టులతో లక్షలాది మందికి కష్టాలు వచ్చిపడ్డాయని ఫోరం ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫర్ట్స్ (ఎఫ్‌పీసీఈ) అధ్యక్షుడు అభయ్ ఉపాధ్యాయ్ తెలిపారు.

241
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles