ఆటో పరిశ్రమకు అభయం

Fri,September 6, 2019 12:47 AM

No plan to ban petrol and diesel vehicles

-పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను నిషేధించే యోచన లేదు
-కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ
-ఉద్దీపనలు అందిస్తామని భరోసా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: మునుపెన్నడూ లేనివిధంగా కష్టాలను ఎదుర్కొంటున్న దేశీయ ఆటో పరిశ్రమకు.. కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ భరోసానిచ్చారు. ఆర్థిక మందగమనం, దాదాపు రెండు దశాబ్దాల కనిష్ఠానికి అమ్మకాలు పడిపోవడంతో ఆటో రంగం అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరిస్తామని, డిమాండ్లను తీరుస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు అంశాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చిస్తామని, అవసరమైన అన్ని రకాల సాయం అందిస్తామని గురువారం ఇక్కడ జరిగిన భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) వార్షిక సదస్సులో స్పష్టం చేశారు. దీంతో మారుతి సుజుకీ ఇండియా సీఈవో, ఎండీ కెనిచీ అయుకావా హర్షం వ్యక్తం చేశారు. కాగా, రూ.5 లక్షల కోట్ల విలువైన 68 రోడ్డు ప్రాజెక్టులకు రాబోయే మూడు నెలల్లో అనుమతులిచ్చే వీలుందని, ఇప్పటికే 80 శాతం భూమినీ సేకరించామని తెలిపారు. దీనివల్ల వాణిజ్య వాహనాలకు డిమాండ్‌ పెరుగుతుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల రంగాన్ని బలోపేతం చేయడానికి యూకే సిన్హా కమిటీ చేసిన సిఫార్సులపై త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తుందని గడ్కరీ ఎంఎస్‌ఎంఈ సమస్యలపై జరిగిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు.

భయాలు వద్దు

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల నిషేధానికి ప్రభుత్వం యోచిస్తున్నదన్న మాటలు వినిపిస్తున్నాయని, అలాంటి ఆలోచనేదీ కేంద్రం వద్ద లేదని ఈ సందర్భంగా గడ్కరీ స్పష్టం చేశారు. ఆ దిశగా తమ ప్రభుత్వం ఏ రకంగానూ ముందుకు వెళ్లడం లేదని ప్రకటించారు. కాగా, పెట్రోల్‌, డీజిల్‌ ఆధారిత వాహనాలపై పన్నును తగ్గించాలన్న ఆటో పరిశ్రమ ప్రతిపాదన బాగుందని, దీనిపై ఆర్థిక మంత్రితో చర్చిస్తామని గడ్కరీ చెప్పారు. జీఎస్టీ భారం కొంత తగ్గినా అదిప్పుడు పరిశ్రమకు ఎంతో సహాయకారిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. విద్యుత్‌ వాహనాలపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించినట్లుగానే.. హైబ్రిడ్‌ వాహనాలపైనా తగ్గించాలని కోరుతామని చెప్పారు. ఇదిలావుంటే దేశీయ మార్కెట్‌లో నెలకొన్న మందగమనాన్ని అధిగమించేందుకు ఆటో రంగ సంస్థలు ఎగుమతులపై దృష్టి పెట్టాలని సీఐఐ అధ్యక్షుడు ఉదయ్‌ కొటక్‌ సూచించారు. కాగా, ఆటో రంగాన్ని ఆదుకునేందుకు ఉద్దీపనలను ప్రవేశపెట్టాలని సియామ్‌ అధ్యక్షుడు రాజన్‌ వధేరా ప్రభుత్వానికి సూచించారు. మందగమనంతో ఆటోమొబైల్‌ తయారీ రంగంలో 15 వేల కాంట్రాక్టు ఉద్యోగులు ఉపాధిని కోల్పోగా, దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో దాదాపు 2.8 లక్షల మంది ఉద్యోగాలకు దూరమైయ్యారు.

మహీంద్రా పెట్టుబడులు వాయిదా

ఆటోమొబైల్‌ రంగంలో నెలకొన్న మందకొడి పరిస్థితులు ఈ రంగంలోకి వచ్చే పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి భవిష్యత్తులో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన మహీంద్రా అండ్‌ మహీంద్రా..తాజాగా ఈ ప్రతిపాదన వాయిదా వేసుకుంటున్నట్లు కంపెనీ ఎండీ పవన్‌ గోయెంకా ప్రకటించారు. పెట్టుబడులతోపాటు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. అమ్మకాలు పడిపోవడంతో ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న ప్లాంట్లలో ఉత్పత్తిలో కోత విధించింది సంస్థ. వచ్చే పండుగ సీజన్‌లో కూడా అమ్మకాలు పెద్దగా పెరిగే అవకాశాలు లేవని ఆయన స్పష్టంచేశారు. ఈ ఏడాది వ్యాపార విస్తరణకోసం రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టబోతున్నట్లు గతంలో సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన ఉత్పత్తులకోసం పెట్టే పెట్టుబడులను తగ్గించడం లేదని, ఇతర యాక్టివ్స్‌ కోసం పెట్టే ఖర్చులను వాయిదావేసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆటోమొబైల్‌ రంగంలో ఇప్పటికే లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని, మరింత మందిపై వేటు పడే అవకాశాలున్నాయన్నారు. సియామ్‌ అంచనా ప్రకారం..15 వేల మంది తాత్కాలిక ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. కంపెనీ విషయానికి వస్తే 30 వేల మంది సిబ్బందిలో 1,500 మంది తాత్కాలిక వర్కర్లపై వేటు పడిందని ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుత మాంద్యం పరిస్థితుల నుంచి ఆటోమొబైల్‌ రంగ పరిశ్రమలు గట్టెక్కాలంటే వెంటనే జీఎస్టీని తగ్గించాలని ఆయన కేంద్రానికి సూచించారు.
goenka

కుప్పకూలడం ఖాయం!

-టాటా మోటర్స్‌ ఎండీ గ్యుంటర్‌ బషేక్‌

దేశీయ ఆటోమొబైల్‌ రంగం కుప్పకూలడం ఖాయమని టాటా మోటర్స్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గ్యుంటెర్‌ బషేక్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగంలో నెలకొన్న మందకొడి పరిస్థితులకు తోడు, వినియోగదారుల సెంటిమెంట్‌ నిరాశవాదంగా ఉండటం, నిధుల లభ్యత అంతంత మాత్రంగానే ఉండటం ఇందుకు కారణమని ఆయన విశ్లేషించారు. భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం(సియామ్‌) ఏర్పా టు చేసిన వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ..ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదని, ఈ పరిస్థితి నుంచి బయటపడకపోతే కుప్పకూలడం ఖాయమని ఆయన జోస్యంచెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాహన అమ్మకాలు చూస్తే ఏ పరిస్థితిలో ఉన్నదో అర్థమవుతున్నదని, గడిచిన రెండు నెలల్లో కూడా అమ్మకాలు ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడం చూస్తే భవిష్యత్తులో ఈ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనావేయడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక పరిస్థితులు కూడా నిరుత్సాహకరంగా ఉండటం, నిధుల కొరత దీనికి ఆజ్యం పోసిందని, కమర్షియల్‌ వాహన నిబంధనలు మరింత కఠినతరం చేయడం వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిన చందంగా తయారైంది ఆటోమొబైల్‌ సంస్థల పరిస్థితి అన్నారు. ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఆటోమొబైల్‌ సంస్థలు భారీ స్థాయిలో ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయని..దీంతో ఈ ఏడాది మూసివేత నామ సంవత్సరంగా మారిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతించిన ఆయన.. ఈ గడ్డు కాలం నుంచి బయటపడాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదన్నారు.
TATAMOTORS-CEO

390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles