దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బే

Wed,April 24, 2019 12:10 AM

Oil hits nearly 6 month highs as US aims to slash Irans crude exports

-అమెరికా ఆంక్షల నేపథ్యంలో కేర్ రేటింగ్స్ అంచనా
-ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోళ్లు ఆగితే కష్టమే
-క్యాడ్ పెరుగుదల, రూపాయి పతనం, ద్రవ్యోల్బణానికి అవకాశాలు

ముంబై, ఏప్రిల్ 23: ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోళ్లపై అమెరికా విధించిన ఆంక్షలు.. భారత్ వంటి చమురు దిగుమతి ఆధారిత దేశాల ఆర్థిక వ్యవస్థల్ని పెద్ద ఎత్తున కుదిపేయనున్నాయి. కరెంట్ ఖాతా లోటు (క్యాడ్), డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, ద్రవ్యోల్బణం వంటి వాటికి దారి తీయవచ్చని మంగళవారం కేర్ రేటింగ్స్ అభిప్రాయపడింది. భారత్‌సహా ఎనిమిది దేశాలకు ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులపై ఇచ్చిన మినహాయింపుల్ని అమెరికా పొడిగించబోమని స్పష్టం చేసింది. ఇక ఇరాన్ నుంచి ఏ దేశం కూడా ముడి చమురును కొనుగోలు చేయవద్దని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చారిత్రాత్మక 2015 ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి ట్రంప్ వైదొలిగిన నేపథ్యంలో గతేడాది నవంబర్ నుంచి ఆ దేశంపై అమెరికా ఆంక్షలు మొదలైయ్యాయి.

అయితే అమెరికాపై ఒత్తిడితో భారత్, చైనా, టర్కీ, జపాన్, గ్రీస్, ఇటలీ, దక్షిణ కొరియా, తైవాన్ దేశాలకు ఆరు నెలలపాటు మినహాయింపు లభించింది. ఈ గడువు వచ్చే నెల మే 2తో ముగిసిపోతుండగా, ఆ తర్వాతి నుంచి ఎవరూ ఇరాన్ ముడి చమురును కొనవద్దని ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. ఇరాన్ నుంచి అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న టాప్-3 దేశాలు చైనా, జపాన్, భారత్‌లే. తమ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని అన్ని దేశాలకు ట్రంప్ హెచ్చరించిన సంగతీ విదితమే.

ప్రత్యామ్నాయం అన్వేషించాలి

మెజారిటీ ఇంధన అవసరాలు దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో సహజంగానే దేశ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ నిర్ణయాల ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలో స్వదేశీ ఇంధన వనరుల వినియోగంపై దృష్టి పెట్టాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి భారత్, చైనా తదితర ఎనిమిది దేశాలు మినహా ప్రపంచంలోని మిగతా దేశాలేవీ కూడా ఇరాన్ నుంచి ముడి చమురును ఇప్పుడు దిగుమతి చేసుకోవడం లేదు. ఈ ఎనిమిది దేశాల్లోనూ జపాన్, గ్రీస్, ఇటలీ, తైవాన్, దక్షిణ కొరియా దేశాలు తమ దిగుమతుల్ని తగ్గించుకున్నాయి. ఫలితంగా వచ్చే నెల 2 తర్వాత ఈ దేశాలపై అమెరికా ఆంక్షల ప్రభావం అంతగా ఉండ దు. కానీ భారత్‌పై ఎక్కువగా ఉండనున్నది. దీనికి కార ణం ఇంకా ఇరాన్ ముడి చమురు దిగుమతులు బాగానే కొనసాగుతుండటం. దీంతో ఇరాన్ క్రూడ్ పై ఆధారపడటం తగ్గించుకుని, ఇతర దేశాల నుంచి పెంచుకోవాలని, దేశీయంగా ఉత్పత్తినీ వృద్ధి చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. కాగా, 2017 ఏప్రిల్-2018 జనవరి వరకు భారత్‌కు ఇరాన్ 18.4 మిలియన్ టన్నుల ముడి చమురును సరఫరా చేసింది.

మోదీ వైఫల్యం: కాంగ్రెస్

అమెరికా నిర్ణయం.. మోదీ వైఫల్యం వల్లేనని కాంగ్రెస్ విమర్శించింది. ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోళ్లు భారత్‌కు ఎంత అవసరమో వివరించడంలో కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని, ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దౌత్యపరమైన అపజయాన్నే మూటగట్టుకున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం దేశంలో ఇంధన ధరల్ని తారాస్థాయికి తీసుకెళ్తుందని, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగి సామాన్యుల జీవితాలు అస్తవ్యస్థమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

భారత ఎగుమతులకు ఇబ్బంది: టీపీసీఐ

ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోళ్లపై భారత్‌కున్న మినహాయింపును పొడిగించకపోతే దేశ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుందని భారత వాణిజ్య ప్రోత్సాహక మండలి (టీపీసీఐ) మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. చమురు ధరలు 10 శాతం పెరిగితే 7 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుకు దారి తీస్తుందని, జీడీపీ కూడా 0.2 శాతం క్షీణిస్తుందని టీపీసీఐ చైర్మన్ మోహిత్ సింగ్లా అన్నారు. మరోవైపు అమెరికా నిర్ణయం మధ్యప్రాచ్య సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుందని చైనా అభిప్రాయపడింది.

ధరలపై ప్రభావం?

దేశీయ ఇంధన అవసరాలు 80 శాతానికిపైగా విదేశీ దిగుమతుల ద్వారానే తీరుతున్న విషయం తెలిసిందే. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రూడ్.. మొత్తం భారత్ ముడి చమురు దిగుమతుల్లో పదో వంతుగా ఉన్నది. సౌదీ అరేబియా, ఇరాక్‌ల తర్వాత ఇరాన్ నుంచే భారత్‌కు భారీగా ముడి చమురు వస్తున్నది. దీంతో అమెరికా తాజా ఆంక్షలు దేశంలో ఇంధన ధరలపై ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 74 డాలర్లను దాటేసింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2 తర్వాత ఇరాన్‌పై ఆంక్షలు అమల్లోకి రానుండటంతో మరింత పెరుగవచ్చని విశ్లేషిస్తున్నారు. పెరిగే ఇంధన ధరలు దేశ ఆదాయ, వ్యయాలను భారీగా ప్రభావితం చేస్తాయంటున్నారు. పెట్రో ఉత్పత్తులపై అధిక పన్నుల కారణంగా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, అలాగే రవాణా ఖర్చులు పెరిగి వ్యయం కూడా మితిమీరుతుందని హెచ్చరిస్తున్నారు. పాత పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నిర్ణయాల ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత జీడీపీని అమెరికా ఆంక్షలు మళ్లీ దిగజార్చవచ్చన్న ఆందోళనను వెలిబుచ్చుతున్నారు.

ఆర్బీఐ కోతలకు బ్రేక్..

గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు 10 శాతం పెరిగినా.. క్యాడ్ 0.40 శాతం ఎగబాకుతుందని, 3-4 శాతం రూపాయి విలువ పడిపోతుందని, ద్రవ్యోల్బణం కూడా 0.24 శాతం మేర ఎగిసిపడుతుందని కేర్ రేటింగ్స్ హెచ్చరించింది. బ్యారెల్ ముడి చమురు ధర దాదాపు 75 డాలర్ల వద్దే నెల రోజులపాటు కదలాడితే.. ఆర్బీఐ వడ్డీరేట్ల కోతలు కూడా ఆగిపోవడం ఖాయమని చెప్పింది. రెపో, రివర్స్ రెపోలను ఆర్బీఐ గత ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో వరుసగా తగ్గించిన విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా పారిశ్రామికోత్పత్తిని పరుగులు పెట్టించేందుకు రాబోయే సమీక్షల్లోనూ కీలక వడ్డీరేట్లకు కోతలు పెడుతుందన్న అంచనాలున్నాయి. అయితే ట్రంప్ తాజా నిర్ణయం ఈ అంచనాలపై నీళ్లు చల్లుతున్నది. జూన్ ద్రవ్యసమీక్షలో రెపో, రివర్స్ రెపోల జోలికి ఆర్బీఐ పోకపోవచ్చన్న అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. కాగా, మంగళవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.95, డీజిల్ రూ.66.46గా నమోదైంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు రూ.77.36, డీజిల్ రూ.72.21గా ఉన్నది.

1735
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles