మెరుగైన ఉల్లి సరఫరా

Sun,October 6, 2019 12:33 AM

-పెరిగిన దిగుమతులు.. తగ్గిన ధరలు
-రూ.1,800 పలుకుతున్న క్వింటాలు రేటు

మలక్‌పేట, అక్టోబర్ 5: ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, గద్వాల, వికారాబాద్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి పంట సకాలంలో రాకపోవడం.. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి దిగుమతులు ఆగిపోవడం మార్కెట్‌లో ఉల్లి ధరలను పరుగులు పెట్టించాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. ఈ క్రమంలోనే పది రోజుల క్రితం క్వింటాలు రూ.3,200-4000 పలికిన ఉల్లి ధర.. శనివారం రూ.800-1,800లకు పడిపోయింది. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి ఉల్లి దిగుమతులు తగ్గినప్పటికీ, రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, కర్నూలు నుంచి మార్కెట్‌కు ఉల్లి సరఫరా పెరిగింది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 3న మార్కెట్‌కు రికార్డు స్థాయిలో 80 వేల బస్తాల ఉల్లి దిగుమతి అయిందని, రెండు తెలుగు రాష్ర్టాల నుంచి 70 వేల బస్తాలు, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి 10 వేల బస్తాలు వచ్చినట్లు మలక్‌పేట మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ చంద్రశేఖర్ తెలిపారు. తెలుగు రాష్ర్టాల నుంచి ఉల్లిగడ్డ పెద్ద మొత్తంలో మార్కెట్‌కు వస్తున్నందున ఉల్లి కొరతలు కూడా తగ్గాయన్నారు. వారం రోజుల క్రితం క్వింటాలు రూ.3,000-3,800 అమ్మిన మేలు రకం ఉల్లి.. ఈ నెల 1న రూ.2,800లకు తగ్గిందని చెప్పారు. శనివారం క్వింటాలు రూ.800-1,800గా నమోదైందన్నారు. మొన్నటి వరకు తెలుగు రాష్ర్టాల్లో పండించే ఉల్లి పంటలు చేతికందకపోవటంతో మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే ఉల్లిపైనే ఆధారపడాల్సి వచ్చింది. వర్షాల కారణంగా అక్కడి నుంచి ఉల్లి దిగుమతులు తగ్గటంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ర్టాల్లో పండించే ఉల్లి పంటలు చేతికందాయి. మార్కెట్‌కు ఉల్లిగడ్డ పెద్ద మొత్తంలో దిగుమతి అవుతున్నది అని చంద్రశేఖర్ అన్నారు.

610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles