పెట్రో రూ. 6 వడ్డన?

Sun,September 22, 2019 01:24 AM

-సంకేతాలిచ్చిన పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పెట్రోభారం నుంచి సామాన్యుడికి ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలేమి కనిపించడం లేదు. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా చమురు ధరలు భగ్గుమన్నాయి. ఫలితంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రూపాయి వరకు ప్రియమయ్యాయి. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను మరో రూ.6 పెంచక తప్పదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంకేతాలివ్వడం చూస్తుంటే సామాన్యుడి జేబుకు మరింత చిల్లులు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉగ్రదాడులు జరిగినప్పటికీ నుంచి హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.1.40 అధికమై రూ.77.97కి చేరుకోగా, డీజిల్ ధర మరో రూ.1.19 అందుకొని రూ.72.52కి చేరుకున్నది. వరుసగా వారం రోజులుగా ధరలు పెరుగుతుండటం విశేషం. ఒకవైపు ధరలు భగ్గుమంటుంటే కేంద్రానికి మాత్రం చీమకుట్టినట్లు లేదు. ఇప్పటికే ఎక్సైజ్ సుంకం రూపంలో భారీగా ధరలు పెంచిన కేంద్రం..వీటిని వెనక్కి తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నది.

సుంకాల తగ్గింపునకు రాష్ర్టాలు నో

పెట్రో ఉత్పత్తులపై సుంకాల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టపడటంలేదని ధర్మేంద్రప్రధాన్ వ్యాఖ్యానించారు. బీజేపీ చేపట్టిన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయనతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గనులు తవ్వకాలను వేగవంతంచేయాలి..

దేశంలో గనుల తవ్వకాలను వేగవంతంచేసి ఉత్పత్తిని పెంచాల్సిన అవసరమున్నదని, గనుల తవ్వకాల్లో కీలక భూమిక పోషిస్తున్న ఎన్‌ఎండీసీ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని ధర్మేంధ్రప్రధాన్ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి, సంస్థ పురోగతిపై ఉన్నతాధికారులు, డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. గనుల తవ్వకాల్లో ప్రమాదాలకు తావులేకుండా చూసేందుకు అత్యాధునికి డిజిటల్ పరికరాలను వినియోగించాలని సూచించారు. దేశంలో ఇనుప ఖనిజ తవ్వకాలు, ఉక్కు ఉత్పత్తిలో ఎన్‌ఎండీసీ పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు. నేషనల్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పెంచేందుకు అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షించాలని కోరారు. ఎన్‌ఎండీసీ సాధించిన విజయాలు, రాబడుల గురించి అధికారులు ఈ సందర్భంగా ప్రధాన్‌కు వివరించారు. ఈ సమీక్షలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి, ఎన్‌ఎండీసీ డైరెక్టర్ బినయ్‌కుమార్, కేంద్ర ఉక్కుశాఖ అదనపు కార్యదర్శి రాసికాచౌబేలు పాల్గొన్నారు.

863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles