హ్యాపెనింగ్ సిటీ హైదరాబాదే

Sun,September 22, 2019 01:16 AM

-దేశానికి ప్రాజెక్టు మేనేజర్ మోదీ
-మాంద్యంలోనూ మూడోస్థానం
-ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ జాతీయ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: భారతదేశంలోనే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న హ్యాపెనింగ్ సిటీ హైదరాబాదేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. శనివారం మాదాపూర్‌లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ నేషనల్ కాన్ఫరెన్స్-19 సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలకోపన్యాసం చేస్తూ.. హైదరాబాద్ లాంటి చారిత్రాత్మక నగరాన్ని ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహణ కోసం ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందని.. ఈ నగరమంటే తనకెంతో అభిమానమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్నదని.. దాన్ని ప్రభావం మన భారతదేశం మీద కూడా ఉన్నదని తెలిపారు. అయినప్పటికీ, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగేందుకు ప్రధానమంత్రి మోదీ కృషి చేస్తున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రాజెక్టు మేనేజర్ అని అభివర్ణించారు. ప్రపంచమంతా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం దిశగా దూసుకెళుతున్నదని తెలిపారు. 2027 నాటికి మన దేశానికి డెబ్బయ్ లక్షల మంది ప్రాజెక్టు మేనేజర్లు కావాలన్నారు.

ప్రాజెక్టులను వేగవంతం చేయాలి..

నత్తనడకన కొనసాగుతున్న ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. కీలక ప్రాజెక్టులు సకాలంలో పూర్తికావడంలో మనకు సరైన రికార్డు లేదని, దీనిలో పూర్తిగా మార్పులు జరుగాల్సిన అవసరం ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రపంచమంతా ఎల్‌పీజీ వైపు..

ప్రపంచమంతా కుగ్రామంలా మారిందని.. టెక్సాస్‌లో జరిగే సంఘటన రెండు నిమిషాల్లో మనకు తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ప్రపంచమంతా ఎల్‌పీజీ వైపు అనగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వైపు పరుగు పెడుతున్నదని చమత్కరించారు.

కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు భేష్

కార్పొరేట్ ట్యాక్స్‌ను పది శాతం వరకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా కార్పొరేట్లు స్వాగతించాయి. భారత్ కేంద్రస్థానంగా వ్యాపారాలు నిర్వహించడానికి ఇదే సరైన సమయని వారు అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ట్యాక్స్‌ను పది శాతంవరకు తగ్గించడంతో 25.17 శాతానికి జారుకోగా, నూతన తయారీ సంస్థలను ప్రోత్సహించడానికి వీటిపై విధించే పన్నును 17.01 శాతంగా నిర్ణయించింది. ఈ తాజా నిర్ణయం ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధిని తిరిగి గాడిలో పెట్టే అవకాశం ఉన్నదని..కార్పొరేట్ పన్ను తగ్గింపుతోపాటు ఇతర ఉద్దీపన ప్యాకేజీలు దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల పెట్టుబడులను ఆకట్టుకునే దిశగా ఉన్నాయని అమెరికా ఇండియా స్ట్రాటజీ అండ్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం(యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) ప్రెసిడెంట్ ముకేశ్ అఘీ తెలిపారు.

397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles