లాభాలొస్తాయట!

Fri,March 15, 2019 12:45 AM

PSBs may report net profit of Rs 23000 to 37000 crore in FY20

-వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వ బ్యాంకులపై ఐక్రా అంచనా
-రూ.23,000-37,000 కోట్ల లాభాలకు అవకాశం

ముంబై, మార్చి 14: వరుస నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను రాబోయే ఆర్థిక సంవత్సరం (2019-20)లో లాభాలు పలుకరించే అవకాశాలున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఐక్రా అంచనా వేసింది. గడిచిన నాలుగేండ్లుగా నష్టపోతూ వస్తున్న ప్రభు త్వ బ్యాంకులు.. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.23,000 కోట్ల నుంచి 37,000 కోట్లదాకా లాభాలను ప్రకటించవచ్చన్నది. దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికినే మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) ప్రశ్నార్థకం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్‌పీఏల ధాటికి దాదాపు ప్రభుత్వ బ్యాంకులన్నీ భారీ నష్టాలను నమోదు చేస్తున్న సంగతీ విదితమే. ఈ క్రమంలో స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) తగ్గవచ్చని, వచ్చే ఏడాది మార్చి 31కల్లా 8.1-8.4 శాతానికి దిగిరావచ్చని ఐక్రా చెబుతున్నది.

గత నాలుగేండ్లలో ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక సాయ ం అందిందని, దీంతో బ్యాంకులు కోలుకున్నాయని, జీఎన్‌పీఏతోపాటు నికర నిరర్థక ఆస్తుల (ఎన్‌ఎన్‌పీఏ) స్థాయి కిందకు వచ్చిందని అంటున్నది. ఎన్‌ఎన్‌పీఏ 3.5-3.6 శాతానికి తగ్గవచ్చని పేర్కొన్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎన్‌పీఏ బాధిత బ్యాంకులపై విధించిన ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) విధివిధానాల నుంచి ఇప్పటికే ఐదు బ్యాంకులు బయటపడగలిగాయని గుర్తుచేస్తున్నది. కాగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి జీఎన్‌పీఏ 10.3 శాతంగా, ఎన్‌ఎన్‌పీఏ 5.3-5.4 శాతంగా నమోదు కావచ్చని ఐక్రా అంచనా వేసింది. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఇవి వరుసగా 10.9 శాతంగా, 6.3 శాతంగా ఉన్నాయి.

ఈసారి ఐదు బ్యాంకులకే లాభాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో కేవలం ఐదు బ్యాంకులే లాభాలను ప్రకటించవచ్చని ఐక్రా అంచనా వేస్తున్నది. తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్) ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టాలు రూ.42,900 కోట్లుగా ఉన్నాయి. ఈ నెలాఖరుకు రూ.65,000 కోట్లకు చేరవచ్చని ఐక్రా చెబుతున్నది. అయితే గత ఆర్థిక సంవత్సరం (2017-18)లో రూ.85,400 కోట్లుగా ఉండటం గమనార్హం. మొండి బకాయిలకుతోడు మోసాలు, కుంభకోణాలు వెలుగు చూస్తుండటంతో మెజారిటీ బ్యాంకులపై ఆ ప్రభావం కనిపిస్తుందని పేర్కొన్నది. అయినప్పటికీ అటు ఆర్బీఐ, ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలు కనిపిస్తున్నాయన్న ఐక్రా.. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇవి మరింతగా సత్ఫలితాలను ఇవ్వగలవని విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. మోదీ సర్కారు తెచ్చిన దివాలా చట్టం బ్యాంకులకు లాభిస్తున్న విషయం తెలిసిందే.

మెరుగ్గా ప్రైవేట్ రంగ బ్యాంకులు

ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చితే ప్రైవేట్ రంగ బ్యాంకుల పనితీరు మెరుగ్గా ఉందని ఐక్రా వెల్లడించింది. అడ్వాన్సుల్లో 18.7 శాతం వృద్ధి ఉందని పేర్కొన్నది. అయితే భవిష్యత్తులో మాత్రం ప్రైవేట్ బ్యాంకులకు సమస్యలేనన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. రుణాలు, డిపాజిట్ల పరంగా సమస్యలు ఎదురు కావచ్చన్నది. ఇదిలావుంటే ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌ల రేటింగ్‌ను ఐక్రా సవరించింది. బీవోఐ, పీఎన్‌బీ, ఓబీసీ, బీవోఎంల ఔట్‌లుక్‌ను నెగటివ్ నుంచి స్టేబుల్‌కు మార్చింది.

1445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles