రూ.1.2 లక్షల కోట్లు

Sat,May 25, 2019 12:17 AM

Public Sector Banks Recover Rs 12 Lakh Crore from Bad Loans in 2018-19

-గతేడాది బ్యాంకులు వసూలు చేసిన మొండి బకాయిలు
న్యూఢిల్లీ, మే 24: మొండి బకాయిల వసూళ్లపై ప్రభుత్వరంగ బ్యాంకులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1.2 లక్షల కోట్ల ఎన్‌పీఏలను తిరిగి వసూలు చేసుకోగలిగాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎన్‌పీఏలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన దివాలా, దివాలా కోడ్(ఐబీసీ) చట్టం ఇందుకు దోహదం చేసిందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే రూ.60,713 కోట్లను రికవరీ చేసిన బ్యాంకులు..మరో ఆరు నెలల్లో ఇంతే స్థాయిలో వసూలు చేయగలిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1.80 లక్షల కోట్ల ఎన్‌పీఏలను వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బ్యాంకులకు పలు పెద్ద ఖాతాలకు ఎన్‌సీఎల్‌టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో మోక్షం లభించకపోవడంతో ఈ లక్ష్యానికి చేరుకోలేకపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాతాలకు పరిష్కారం లభించనున్నదని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. గతేడాది వసూలు చేసిన వాటిలో ఎన్‌సీఎల్‌టీ ద్వారా రూ.55 వేల కోట్లు లభించాయి. 2017-18 ఏడాదిలో వసూలైన రూ.74,562 కోట్లతో పోలిస్తే ఇంచుమించు రెండింతలు పెరిగి రూ.1.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రెండు పెద్ద ఖాతాలైన ఎస్సార్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్‌లకు చెందిన ఖాతాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. వచ్చే కొన్ని నెలల్లో పూర్తికానున్న ఈ రెండు ఖాతాలతో రూ.50 వేల కోట్ల వరకు వసూలు కావచ్చునని ఆయన అంచనావేస్తున్నారు. జేఎస్‌డబ్ల్యూ బిడ్డింగ్ ఆఫర్‌ను రూ.11 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్లకు పెంచగా, ఇటీవల ఇది కూడా రూ.19 వేల కోట్లకు చేరుకున్నది. దీనిని కొనుగోలు చేయడానికి టాటా స్టీల్ రూ.17 వేల కోట్ల ఆఫర్ ఇవ్వగా, ఇది తిరస్కరణకు గురైంది. అలాగే ఎస్సార్ స్టీల్‌కు ఆర్సెలార్‌మిట్టల్ రూ.42 వేల కోట్ల ఆఫర్ ఇచ్చారు. ఇది కూడా ఇప్పటి వరకు తేలలేదు. దేశవ్యాప్తంగా రోజు రోజుకు నిధుల సంక్షోభం ముదురుతుండటంతో సామాన్యుడి నుంచి నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థల(ఎన్‌బీఎఫ్‌సీ) వరకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

1382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles