ఐడీబీఐ.. ప్రైవేట్ బ్యాంకే!

Fri,March 15, 2019 12:39 AM

RBI categorises IDBI as a private bank

-వర్గీకరించిన ఆర్బీఐ
-ఎల్‌ఐసీ రాకతో ప్రభుత్వ హోదా దూరం

ముంబై, మార్చి 14: ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేట్ రంగ బ్యాంకుగా వర్గీకరించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న ఐడీబీఐలో మెజారిటీ వాటాను ఎల్‌ఐసీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో బ్యాంక్‌లో 51 శాతం వాటా ఈ ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ సొంతమైన సంగతీ విదితమే. ఈ క్రమంలో ప్రభుత్వ వాటా మైనార్టీలో పడినందున ఇకపై ఐడీబీఐ బ్యాంక్ ఓ ప్రైవేట్ బ్యాంకేనని ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. జనవరి 21 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఆర్బీఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) జాబితాలో ఐడీబీఐ బ్యాంక్ ఉన్న విషయం తెలిసిందే. మొండి బకాయిలు (ఎన్‌పీఏ లేదా నిరర్థక ఆస్తులు) ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో బ్యాంక్‌ను పీసీఏ పరిధిలోకి ఆర్బీఐ తీసుకొచ్చింది. దీంతో కార్పొరేట్ రుణాలు, శాఖల విస్తరణ, జీతాల పెంపు, ఇతరత్రా సాధారణ కార్యకలాపాలకు బ్యాంక్ దూరమైన విషయం తెలిసిందే.

ఇక కలిసే పనిచేస్తాయ్..

ఎల్‌ఐసీ చేతికి ఐడీబీఐ బ్యాంక్ వచ్చిన నేపథ్యంలో బ్యాంకింగ్, బీమా సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చే దిశగా ఐడీబీఐ అడుగులు వేస్తున్నదిప్పుడు. గత వారం ఎల్‌ఐసీని కార్పొరేట్ ఏజెంట్‌గా ఐడీబీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక దీర్ఘకాల ప్రయోజనార్థం భవిష్యత్తులో ఐడీబీఐ, ఎల్‌ఐసీలు ఉమ్మడి పెట్టుబడుల వ్యూహాన్ని అనుసరిస్తాయని, రియల్ ఎస్టేట్, వాణిజ్య, నివాస సముదాయాలు, బ్యాంక్ శాఖలు, భవనాలు, ఏటీఎంలు, డిజిటల్ మార్కెటింగ్ ఇతరత్రా వనరులను, ఆస్తులను కలిసి వినియోగించుకుంటాయని చెప్పింది. మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాల్లో ఉన్న ఉమ్మడి అనుబంధ సంస్థల హేతుబద్దీకరణకూ ఇరు సంస్థలు ముందుకెళ్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ఐడీబీఐ బ్యాంక్ నష్టం మొండి బకాయిల కారణంగా రూ.4,185 కోట్లకు పెరిగిన సంగతి విదితమే. నిరుడు డిసెంబర్ 31నాటికి బ్యాంక్ ఎన్‌పీఏలు 29.67 శాతానికి ఎగిశాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో 24.72 శాతంగా ఉన్నాయి.

1090
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles