చదువే అర్హత కాదు

Mon,September 23, 2019 12:40 AM

-అనుభవం గొప్పది ఆర్బీఐ గవర్నర్ గిరీపై దాస్
-విషయ పరిజ్ఞానం ఉంటే చాలని వ్యాఖ్య

ముంబై, సెప్టెంబర్ 22: శక్తికాంత దాస్.. అనూహ్య రీతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌గా వచ్చిన రిటైర్డ్ ఐఏఎస్. ఊర్జిత్ పటేల్ రాజీనామాతో గతేడాది డిసెంబర్‌లో ఆర్బీఐ 25వ గవర్నర్‌గా దాస్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇటు ఆర్బీఐ, అటు దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్న వేళ.. మోదీ సర్కారు ఆశలకు ప్రతిబింబంగా ఈ బ్యూరోక్రాట్ వచ్చిన సంగతీ విదితమే. అయితే తన కంటే ముందు ఆర్బీఐ గవర్నర్లుగా పనిచేసిన ఊర్జిత్ పటేల్, రఘురామ్ రాజన్‌ల విద్యార్హతలతో పోల్చితే దాస్‌కున్నవి తక్కువే. ఈ క్రమంలో ఇక్కడ జరిగిన ఇండియా టుడే సదస్సులో మాట్లాడుతూ ఆర్బీఐ గవర్నర్‌కు చదువే అర్హత కాబోదు అని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థపై పట్టుంటే చాలని, విషయ పరిజ్ఞానం ముఖ్యమని పేర్కొన్నారు. సదస్సుకు హాజరైన వీక్షకుల్లో ఒకరి నుంచి వచ్చిన ప్రశ్నకు బదులుగా దాస్ పై విధంగా సమాధానమిచ్చారు. ఆర్థికపరంగా అంత బలమైన విద్యలేని మీరు ఆర్బిఐ గవర్నర్‌గా తేలిపోతున్నారు అన్న ప్రశ్నకు ఈ 62 ఏండ్ల మాజీ ఐఏఎస్ స్పందిస్తూ.. 35-40 సంవత్సరాల క్రితం చదువుకున్నది నేటి పరిస్థితులకు సరితూగదన్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా నడుచుకుంటేనే సత్ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. విషయ పరిజ్ఞానం, ప్రస్తుత పరిణామాలపై అవగాహన లేనైట్లెతే ఎంత చదువుకున్నా వ్యర్థమన్న దాస్.. అనుభవమే గొప్పదన్నారు. రఘురామ్ రాజన్.. అంతర్జాతీయ ఆర్థికవేత్త అవగా, ఊర్జిత్ పటేల్.. ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో ద్రవ్యవిధాన అర్థశాస్ర్తాల్లో కోవిదుడిగా ప్రఖ్యాతిగాంచారు. కాగా, వరుస వడ్డీరేట్ల కోతలతో దేశ ఆర్థిక వ్యవస్థకు శస్త్ర చికిత్స చేస్తున్న దాస్.. అటు ప్రభుత్వ, ఇటు పరిశ్రమ వర్గాలను ఆకట్టుకుంటున్నారు.

742
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles