రిలయన్స్ ప్రభంజనం

Fri,April 19, 2019 01:09 AM

Reliance Industries reported a decent growth in consolidated profit

-క్యూ4 లాభం రూ.10,362 కోట్లు
-దన్నుగా నిలిచిన రిటైల్, టెలికం
-రూ.1.54 లక్షల కోట్లకు చేరిన ఆదాయం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.10,362 కోట్ల నికర లాభం లేదా ప్రతిషేరుకు రూ.17.5 ఆర్జించింది. 2017-18 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.9,438 కోట్ల(ప్రతిషేరుకు రూ.15.9)తో పోలిస్తే 9.8 శాతం వృద్ధి నమోదైంది. చమురు రిఫైనరీ మార్జిన్లు దెబ్బతీసినప్పటికీ టెలికం, రిటైల్ రంగం నుంచి వచ్చిన దన్నుతో లాభాలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నది. ప్రైవేట్ రంగంలో ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయి లాభాలు ఆర్జించిన సంస్థగా రిలయన్స్ రికార్డును సృష్టించింది. జనవరి-మార్చి 2013లో ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) రూ.14,512.81 కోట్ల లాభాన్ని గడించింది. ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శణ. గడిచిన త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీ రూ.1,54,110 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదేసమయంలో నమోదైన రూ.1,70,709 కోట్ల ఆదాయంతో పోలిస్తే 19.4 శాతం ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో రిఫైనరీ వ్యాపార మార్జిన్లు తీవ్ర ఒత్తిడికి గురైనప్పటికీ..రిటైల్, టెలికం వెంచర్ అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకోవడంతో లాభాల్లో పుంజుకోవడానికి దోహదపడ్డాయని రిలయన్స్ గ్రూపు చైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. ఇంధన రంగంలో తీవ్ర ఒడిదుడుకులకు గురైనప్పటికీ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించడం విశేషమన్నారు.

2018-19లో రికార్డు స్థాయి లాభాలు

గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఐఎల్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. 2018-19లో రూ.6,22,809 కోట్ల ఆదాయంపై రూ.39,588 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకున్నది. రిటైల్ విభాగ ఆదాయం లక్ష కోట్ల రూపాయలు దాటడం, జియో 30 కోట్ల వినియోగదారులకు చేరుకోవడం, పెట్రో కెమికల్ బిజినెస్ అత్యధికంగా ఆర్జించినట్లు ముకేశ్ చెప్పారు. నాలుగో త్రైమాసికంలో కొత్తగా 510 రిటైల్ అవుట్‌లెట్లను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 10,415కి చేరుకున్నాయి.

ఆర్థిక ఫలితాల్లో పలు ముఖ్య అంశాలు..

-పన్నులు చెల్లించకముందు పెట్రోకెమికల్ వ్యాపారం నికర లాభం 24 శాతం పెరిగి రూ.7,975 కోట్లకు చేరుకున్నది.
-ప్రతి బ్యారెల్‌ను శుద్ది చేయడం ద్వారా 8.2 డాలర్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఇది 11 డాలర్లుగా ఉన్నది.
-గ్రాస్ రిఫైన్ మార్జిన్ 9.5 డాలర్ల నుంచి 8.8 డాలర్లకు పడిపోయింది.
-ఇంధనం, గ్యాస్ వ్యాపారం ద్వారా రూ.267 కోట్ల నష్టం సంభవించింది.
-మార్చి 31 నాటికి కంపెనీకి రూ.2,87,505 కోట్ల స్థాయిలో అప్పు ఉన్నది. డిసెంబర్ 31, 2018 నాటికి రూ.2,74,381 కోట్లుగా ఉన్నది.
-ప్రస్తుతం కంపెనీ వద్ద రూ.1,33,027 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో ఉన్న రూ.77,933 కోట్లతో పోలిస్తే రెండురెట్లు పెరిగాయి.
-రిటైల్ వ్యాపారం ద్వారా సంస్థకు రూ.36,663 కోట్ల ఆదాయం సమకూరింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,30,566 కోట్లకు పెరిగింది.

జియో లాభం రూ.840 కోట్లు

ఇతర టెలికం సంస్థలు నష్టాలతో కాలం వెళ్లదీస్తుంటే రిలయన్స్ జియో మాత్రం లాభాల్లో దూసుకుపోతున్నది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ జియో రూ.840 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.510 కోట్ల లాభంతో పోలిస్తే 64.70% వృద్ధి కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ నిర్వహణ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 55.8 శాతం ఎగబాకి రూ.11,106 కోట్లకు చేరుకున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.38,838 కోట్ల ఆదాయం(92.7%వృద్ధి)పై రూ.2,964 కోట్ల నికర లాభాన్ని(నాలుగింతలు వృద్ధి) ఆర్జించింది. గడిచిన త్రైమాసికం చివరినాటికి జియోకు 30.67 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, ఒక్కోక్కరి నుంచి సరాసరిగా రూ.126.2 ఆదాయం సమకూరింది. జియోతో నిమగ్నమైన సర్వీసులు అందించడం ద్వారా 30 కోట్ల మందికి పైగా వినియోగదారులను ఆకట్టుకోగలిగాం..డాటా, వాయిస్ టారిఫ్‌ల్లో వృద్ధి నమోదైందని, ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్‌లో ఒకటైన జియోతో ప్రతినెల 3 ఎక్సాబైట్ల డాటాను వినియోగిస్తున్నారని ముకేశ్ అంబానీ తెలిపారు.

4262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles