కొత్త క్షేత్రాల్లోనూ ఉత్పత్తి

Mon,October 21, 2019 12:51 AM

-వచ్చే ఏడాదిలో గ్యాస్‌ వెలికితీత ప్రారంభిస్తాం..
-కేజీ-డీ6 బ్లాక్‌పై రిలయన్స్‌ విశ్వాసం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 20: కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీ6 బ్లాక్‌లోగల కొత్త గ్యాస్‌ క్షేత్రం నుంచి వచ్చే ఏడాది ఉత్పత్తి రాగలదన్న విశ్వాసాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) వ్యక్తం చేసింది. ఓవైపు ప్రస్తుత క్షేత్రాల్లో ఉత్పత్తి అంతకంతకూ పడిపోతున్నా.. మరోవైపు వచ్చే ఏడాది మధ్య నుంచి మాత్రం కొత్త గ్యాస్‌ క్షేత్రం నుంచి ఉత్పత్తి వస్తుందన్న ఆశాభావాన్ని ఆర్‌ఐఎల్‌ కనబరిచింది. ఆ దిశగానే కృషి చేస్తున్నామని ఇటీవల ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్‌)గాను ప్రకటించిన ఆర్థిక ఫలితాల అనంతరం జరిగిన ఓ కార్యక్రమంలో మదుపరులకు స్పష్టం చేసింది. కేజీ-డీ6 బ్లాక్‌లో ఉత్పత్తి అడుగంటిన క్షేత్రాలను తిరిగి ఉత్పత్తిలోకి తీసుకురావడానికి 2017 జూన్‌లో రిలయన్స్‌, బ్రిటన్‌కు చెందిన దాని భాగస్వామి బ్రిటీష్‌ పెట్రోలియం (బీపీ) రూ.40 వేల కోట్ల పెట్టుబడితో ఓ ప్రణాళికను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్‌-క్లస్టర్‌, శాటిలైట్‌ క్లస్టర్‌, ఎంజే ఫీల్డ్‌ల్లో తిరిగి ఉత్పత్తిని సాధించడానికి చర్యలు మొదలైయ్యాయి. ఈ క్రమంలోనే ఆర్‌-క్లస్టర్‌లో ఉత్పత్తిని మొదట ప్రారంభించేందుకు ఆర్‌ఐఎల్‌, బీపీ ప్రయత్నిస్తున్నాయి. 2020-22 మధ్య రోజుకు 30-35 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తామన్న ధీమాను కనబరుస్తున్నాయి. 2021 లో శాటిలైట్‌ క్లస్టర్‌లో ఉత్పత్తిని ప్రారంభిస్తామంటున్న రిలయన్స్‌.. 2022 జనవరి-మార్చిలో ఎంజే ఫీల్డ్‌ అందుబాటులోకి రాగలదని అంటున్నది. కేజీ-డీ6 బ్లాక్‌లో ఇప్పటిదాకా 19 గ్యాస్‌ క్షేత్రాలను రిలయన్స్‌ కనుగొన్నది. ఇందులో డీ-1, డీ3లు చాలా పెద్దవి. 2009 ఏప్రిల్‌ నుంచే ఇవి ఉత్పత్తిలోకి వచ్చాయి.

330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles