ఇక జియో బ్రాడ్‌బాండ్‌ సేవలు

Fri,September 6, 2019 12:56 AM

Reliance Jio Fiber broadband plans announced

-ప్రారంభించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
-కనిష్ఠ ధర రూ.699, గరిష్ఠం రూ.8,499
-మార్కెట్‌తో పోల్చితే 35 నుంచి 45 శాతం చౌక
-కనీస ఇంటర్నెట్‌ వేగం 100ఎంబీపీఎస్‌
-రూ.1,299, ఆపై ప్లాన్ల వార్షిక చందాదారులకు టీవీలు, సెట్‌-టాప్‌ బాక్స్‌లు ఉచితం
-కస్టమర్లకు ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ కూడా ఫ్రీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: మూడేండ్ల క్రితం భారతీయ టెలికం రంగ ముఖ చిత్రాన్నే మార్చేసిన రిలయన్స్‌ జియో.. ఇప్పుడు బ్రాడ్‌బాండ్‌, డీటీహెచ్‌/కేబుల్‌ టీవీ మార్కెట్‌లో సంచలనాలను సృష్టించేందుకు వచ్చేసింది. తమకు కలిసొచ్చిన సెప్టెంబర్‌ 5నే జియో బ్రాడ్‌బాండ్‌ సేవలు మొదలైయ్యాయి మరి. ఇంటర్నెట్‌, ల్యాండ్‌లైన్‌ టెలికం, టెలివిజన్‌లతో కూడిన ఈ మెగా వెంచర్‌ను గురువారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రారంభించింది. 2016 సెప్టెంబర్‌ 5న మొదలైన రిలయన్స్‌ జియో.. ఎలాంటి సంచలనాలకు వేదికైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా జియో ఫైబర్‌ కూడా అలాంటి అద్భుతాలతోనే పరిచయమైంది. మొత్తం ఆరు ప్లాన్లను ప్రకటించిన రిలయన్స్‌ జియో ఫైబర్‌.. వాటి నెలసరి కనిష్ఠ ధర రూ.699, గరిష్ఠ ధర రూ.8,499గా నిర్ణయించింది. కాంస్యం (బ్రాంజ్‌), రజతం (సిల్వర్‌), స్వర్ణం (గోల్డ్‌), వజ్రం (డైమండ్‌), ప్లాటినం, టైటానియం శ్రేణుల్లో తెచ్చిన ప్లాన్ల వివరాలను తెలియజేసింది. ప్రస్తుత మార్కెట్‌ ధరలతో పోల్చితే ఇవి 35 నుంచి 45 శాతం తక్కువగా ఉండటం విశేషం. సెకనుకు 100 మెగాబైట్ల (ఎంబీపీఎస్‌) కనీస వేగంతో అందుబాటులోకి వచ్చిన జియో బ్రాడ్‌బాండ్‌ గరిష్ఠంగా సెకనుకు 1 గిగాబైట్‌ (జీబీపీఎస్‌). ప్రస్తుతం ల్యాండ్‌లైన్‌ బ్రాడ్‌బాండ్‌ వేగం దేశీయ మార్కెట్‌లో 25ఎంబీపీఎస్‌గానే ఉండటం గమనార్హం. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఇది 90ఎంబీపీఎస్‌గానే ఉండటం విశేషం. కానీ జియో ఫైబర్‌ మాత్రం 100ఎంబీపీఎస్‌ కనీస ఇంటర్నెట్‌ వేగంతో భారతీయ బ్రాడ్‌బాండ్‌ మార్కెట్‌లోకి ప్రవేశించి సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా 1,600 నగరాలు, పట్టణాల్లో జియో ఫైబర్‌ సేవలు ప్రారంభం అవగా, ప్రయోగాత్మకంగా ఇప్పటికే 5 లక్షల మంది వినియోగదారులు జియో సేవలను పొందుతున్న విషయం తెలిసిందే.

చార్జీలు, ప్రోత్సాహకాలు

ప్లాన్ల ధరలన్నింటిపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అదనం. ప్రారంభ ప్రయోజనం కింద 6 నెలలు అదనపు డేటా అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగలవారు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్‌ అవగా, రూ.1,000 నాన్‌-రిఫండబుల్‌ మొత్తం. అత్యుత్తమమైన ఓవర్‌-ది-టాప్‌ అప్లికేషన్ల (ఓటీటీ యాప్‌లు)తో జియో ఫైబర్‌ ప్లాన్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. బ్రాంజ్‌ ప్లాన్‌ కస్టమర్లు జియోసినిమా, జియోసావన్‌లను మూడు నెలలు పొందగలుగుతారు. సిల్వర్‌ ప్లాన్‌ కొన్నవారైతే జియోకు చెందిన అన్ని ఓటీటీ యాప్‌లను మూడు నెలలపాటు అందుకుంటారు. గోల్డ్‌, ఆపై ప్లాన్ల కస్టమర్లు ఏ డాదిపాటు వీటిని దక్కించుకుంటారు.

కనెక్షన్‌ ఎలా పొందాలి?

జియో వెబ్‌సైట్‌ను సందర్శించి జియో ఫైబర్‌ కనెక్షన్‌ కోసం నమోదు చేసుకోవచ్చు. మీ పేరు, చిరునామా, మొబైల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. మీ ప్రాం తంలో ఒకసారి సేవలు ప్రారంభమైతే.. జియో ప్రతినిధులు మీ వద్దకు వచ్చి కనెక్షన్‌ ఇస్తారు. వారికి కావాల్సిన డాక్యుమెంట్లను, దరఖాస్తు ప్రక్రియను అక్కడే పూర్తి చేసుకుంటారు.

ఉచిత సెట్‌-టాప్‌ బాక్స్‌, టీవీలు

నెలనెలా రూ.1,299 నుంచి 8,499 ప్లాన్ల వార్షిక చందాదారులకు ఉచితంగా హెచ్‌డీ లేదా 4కే ఎల్‌ఈడీ టీవీ, 4కే సెట్‌-టాప్‌ బాక్స్‌లను జియో ఇస్తుంది. ఈ సెట్‌-టాప్‌ బాక్స్‌లు కేబుల్‌ ఆపరేటర్ల నుంచి నేరుగా టీవీ సిగ్నల్స్‌ను తీసుకోగలుగుతాయి. ఇప్పటికే హాథ్‌వే, డీఈఎన్‌, జీటీపీఎల్‌లో రిలయన్స్‌ మెజారిటీ వాటాలను దక్కించుకున్న విషయం తెలిసిందే. జియో సెట్‌-టాప్‌ బాక్స్‌తో ఓ కెమెరాను ఇన్‌స్టాల్‌ చేసుకున్నైట్లెతే వీడియోకాల్స్‌ను టీవీల్లో కూడా చూస్తూ మాట్లాడుకునే సదుపాయం ఉండటం విశేషం. ఇక వచ్చే ఏడాది మధ్య నుంచి ఇండ్లే.. సినిమా థియేటర్లుగా మారిపోనుండగా, విడుదలైన మొదటి రోజే సినిమాలను టీవీల్లో చూసేయచ్చు. అయితే ప్లాటినం, టైటానియం చందాదారులకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుందని స్పష్టం చేసింది. వర్చువల్‌ రియల్టీ (వీఆర్‌) సేవలు కూడా వీరికే ఉంటాయని చెప్పింది.

ఉచిత ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ కనెక్షన్‌

జియో ఫైబర్‌ ప్యాకేజీలో భాగంగా కస్టమర్లు ఉచితంగా ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ కనెక్షన్‌నూ పొందుతారు. దేశంలో ఎక్కడికైనా దీన్నుంచి ఉచితంగా ఫోన్లు చేసుకోవచ్చు. ఇక అమెరికా, కెనడాలకు నెలకు రూ.500 చెల్లింపుతో అపరిమితంగా మాట్లాడుకునే వెసులుబాటును కూడా రిలయన్స్‌ జియో కల్పించింది. కాగా, ఉచిత టీవీ వీడియో కాల్‌ కాన్ఫరెన్సింగ్‌ (ఏడాదికి రూ.1,200), జీరో లాంటెన్సీ గేమింగ్‌ (ఏటా రూ.1,200), హోం నెట్‌వర్కింగ్‌, నార్టన్‌ నుంచి డివైజ్‌ సెక్యూరిటీలనూ కల్పిస్తున్నది. అన్ని సంవత్సర కాలం ప్లాన్లపై ఇవి ఉచితంగా లభిస్తాయని జియో ఫైబర్‌ ప్రకటించింది.

వెల్‌కమ్‌ ఆఫర్‌..

గతంలో టెలికం సేవల్లో మాదిరిగానే, ఇప్పుడు బ్రాడ్‌బాండ్‌ సేవల్లోనూ రిలయన్స్‌ జియో.. వెల్‌కమ్‌ ఆఫర్లను తమ కస్టమర్లకు ప్రకటించింది. ఆయా వార్షిక ప్లాన్ల ఆధారంగా ఈ బహుమతులున్నాయి. బ్రాంజ్‌ ప్లాన్‌పై రెండు 6వాట్స్‌ స్పీకర్లు (విలువ రూ.2,999), సిల్వర్‌ ప్లాన్‌పై రెండు 12వాట్స్‌ స్పీకర్లు (రూ.3,999), గోల్డ్‌, డైమండ్‌ ప్లాన్లపై 24 అంగుళాల హెచ్‌డీ టీవీ (రూ.12,990), ప్లాటినం ప్లాన్‌పై 32 అంగుళాల హెచ్‌డీ టీవీ (రూ.32,990), టైటానియం ప్లాన్‌పై 43 అంగుళాల 4కే టీవీ (రూ.44,990) ఉచితంగా పొందవచ్చు.
List

2674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles