మూడోసారీ వడ్డీ కోతలే!

Tue,April 16, 2019 12:36 AM

Repo and reverse repo reduction in monetary policy

-వచ్చే ద్రవ్యసమీక్షలోనూ రెపో, రివర్స్ రెపో తగ్గొచ్చు..
-బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా

ముంబై, ఏప్రిల్ 15: వచ్చే ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లు పావు శాతం మేర తగ్గవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అంచనా వేసింది. గత రెండు ద్రవ్యసమీక్షల్లో రెపో, రివర్స్ రెపోలను 25 బేసిస్ పాయింట్ల చొప్పున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడోసారి కూడా మరో పావు శాతం కీలక వడ్డీరేట్లు తగ్గే వీలుందని సోమవారం బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్పడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల వృద్ధిరేటుకు ఊతమిచ్చే చర్యలకు ఆటంకం ఏర్పడదని వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాబోయే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో మళ్లీ కోతలకు ఆస్కారముందని బ్యాంక్ ఆఫ్ అమెరికా అభిప్రాయపడింది. గత వారం వాషింగ్టన్‌లో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాలకు హాజరైన దాస్.. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నప్పుడు జీడీపీ పురోగతికి ప్రాధాన్యతనిస్తామన్నారు. ఈ క్రమంలో వడ్డీరేట్లను పావు శాతం వరకే ఎందుకు తగ్గించాలని, అంతకుమించి తగ్గిస్తే ఏమి? అని ప్రశ్నించారు కూడా. 25 బేసిస్ పాయింట్లకు బదులుగా 35 బేసిస్ పాయింట్లు తగ్గించకూడదా? అన్నారు. ఈ మాటల ఆధారంగానే వచ్చే ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లు మరింతగా దిగిరావచ్చన్న అంచనాల్ని బ్యాంక్ ఆఫ్ అమెరికా వెలిబుచ్చింది. నిజానికి జూన్ లేదంటే ఆగస్టు ద్రవ్యసమీక్షల్లో రెపో, రివర్స్ రెపోలు ఇంకా తగ్గుతాయని గతంలోనే బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. అయితే దాస్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో జూన్‌లో తప్పక కోతలుంటాయన్న విశ్వాసాన్ని కనబరుస్తున్నదీ వాల్‌స్ట్రీట్ బ్రోకరేజీ దిగ్గజం. జూన్ 7న విడుదలయ్యే ద్రవ్యసమీక్ష ఫలితంలో వడ్డీరేట్లు మరో 0.25 శాతం తగ్గవచ్చు అని పేర్కొన్నది. ఒకవేళ ఇదే జరిగితే ఆరు నెలల్లో కీలక వడ్డీరేట్లు 75 బేసిస్ పాయింట్లు దిగివచ్చినట్లవుతుంది. కాగా, ఏప్రిల్‌లో ప్రధాన ద్రవ్యోల్బణం 2.6 శాతానికి తగ్గుముఖం పట్టవచ్చన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా.. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిస్తే వడ్డీరేట్లు బాగా తగ్గవచ్చన్నది.

814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles