అతి చేయొద్దు..

Mon,May 20, 2019 12:28 AM

Republican Justin Amash calls for Trump impeachment

-అమెరికాకు చైనా హితవు.. పరస్పర సహకారంతో ముందుకెళ్దామని పిలుపు
బీజింగ్, మే 19: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు వైఖరిని తగ్గించుకోవాలని చైనా హితవు పలికింది. తమ ప్రయోజనాలను దెబ్బతీయడమే లక్ష్యంగా చాలా దూరం వెళ్తున్నారన్న చైనా దౌత్యవేత్త, విదేశాంగ శాఖ మాజీ ఉప మంత్రి వాంగ్ యీ.. అతి చేస్తే అనర్థాలేనని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియోను హెచ్చరించారు. చైనాను నష్టపరిచే చర్యలు తీవ్రంగా ఉంటే మంచిది కాదన్న ఆయన ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్తే అందరికీ లాభమని సూచించారు. ఈ క్రమంలోనే సంఘర్షణలు తగ్గించుకుని కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. చాలా దూరం వెళ్లొద్దని మేము అమెరికాను కోరాం అని వాంగ్ యీ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యపరంగా నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితులపై పాంపియోకు వాంగ్ యీ ఫోన్ చేసి మాట్లాడారు. ఇప్పటికే అమెరికాలోకి వస్తున్న చైనా దిగుమతులపై భారీ సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్.. చైనా టెలికం దిగ్గజం హువావీపై నిషేధం విధించి ఇరు దేశాల వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. హువావీ తీరు అమెరికా టెలికం రంగాన్నేగాక, దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా మార్కెట్ నుంచి హువావీని నిషేధిస్తూ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ట్రంప్ విడుదల చేశారు. ఇది జరిగిన మర్నాడే పాంపియోకు ఫోన్ చేసి వాంగ్ యీ పైవిధంగా స్పందించారు. కాగా, ట్రంప్ తాజా నిర్ణయం నేపథ్యంలో ప్రతీకార చర్యలు తప్పవని చైనా హెచ్చరించిన సంగతీ విదితమే.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు నష్టం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రదేశాలైన అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం.. మొత్తం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేస్తున్నది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా కవ్వింపు చర్యలు చైనాను ఆగ్రహపరిస్తే వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడం ఖాయమన్న భయాలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోకి చైనా నుంచి దిగుమతి అవుతున్న 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తూత్పత్తులపై 10 శాతంగా ఉన్న సుంకాలను 25 శాతానికి ట్రంప్ పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో అదనంగా సుమారు 300 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై ప్రభావం పడింది. చైనా సైతం తమ దేశంలోకి వస్తున్న 60 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై సుంకాలను పెంచింది. అమెరికాతో చైనా వాణిజ్య లోటు భారీగా ఉందని, ఆ దేశం ఎగుమతులు తగ్గించుకోవాలని, అలాగే తమ దిగుమతులను పెంచుకోవాలని సూచిస్తూ వచ్చిన ట్రంప్.. చైనా ధిక్కారంతో సుంకాల పోరుకు తెరలేపారు.

1960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles